అచ్చం అమెరికాలోలా.. వ్యక్తిపై మెడను మోకాలితో తొక్కిపెట్టిన కానిస్టేబుల్!

ABN , First Publish Date - 2020-06-06T02:46:31+05:30 IST

ఏ కారణంగానైతే అమెరికా ఆందోళనలతో అట్టుడికిపోతోందో.. అచ్చం అలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో

అచ్చం అమెరికాలోలా.. వ్యక్తిపై మెడను మోకాలితో తొక్కిపెట్టిన కానిస్టేబుల్!

జోధ్‌పూర్: ఏ కారణంగానైతే అమెరికా ఆందోళనలతో అట్టుడికిపోతోందో.. అచ్చం అలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. ఓ వ్యక్తి మెడను పోలీసు కానిస్టేబుల్ తన మోకాలితో అదిమిపెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఆ వ్యక్తి దాడి నుంచి తప్పించుకునేందుకే కానిస్టేబుల్ అలా అతడి మెడపై మోకాలితో తొక్కిపట్టినట్టు జోధ్‌పూర్ డీసీపీ (వెస్ట్) ప్రీతి చంద్ర తెలిపారు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను ఇది తలపించింది. ఫ్లాయిడ్ మెడను పోలీసు కాలితో తొక్కిపెట్టడంతో అతడు ఊపిరి ఆడక మృతి చెందిన విషయం తెలిసిందే.  


జోధ్‌పూర్‌లో గురువారం ముకేశ్ కుమార్ ప్రజాపత్ అనే వ్యక్తి ముఖానికి మాస్క్ లేకుండా తిరుగుతున్నాడు. గమనించిన ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిని పట్టుకున్నారు. మాస్క్ ఎందుకు ధరించలేదని అడిగినందుకు ముకేశ్ తమపై దాడిచేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. మరో కానిస్టేబుల్ ముకేశ్‌ను కింద పడేసి అతడి మెడను తన మోకాలితో అదిమిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనను డీసీపీ సమర్థించుకున్నారు. యూనిఫామ్‌లో ఉన్న పోలీసులపై దాడి చేయడం నేరమన్నారు.  


ప్రజాపత్‌పై ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయని, అందులో ఒకటి అతడి తండ్రే పెట్టినది గుర్తు చేశారు. తన కంటిని పెరికించేశాడంటూ గతేడాది ప్రజాపతిపై అతడి తండ్రి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 

Updated Date - 2020-06-06T02:46:31+05:30 IST