పోలీసుశాఖలో ఉద్యోగాల జాతర

ABN , First Publish Date - 2022-04-26T05:17:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

పోలీసుశాఖలో ఉద్యోగాల జాతర

- ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారి

- ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

- రాష్ట్ర వ్యాప్తంగా 16 వేలకు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారి

- కామారెడ్డి జిల్లాలో 302 ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టుల ఖాళీలు

- రాజన్న సిరిసిల్ల జోన్‌ పరిధిలో 43 ఎస్‌ఐ పోస్టులు

- జిల్లాలో 259 కానిస్టేబుల్‌ పోస్టులు

- మే 2 నుంచి 20 వరకు దరఖాస్తుల స్వీకరణ

- రాత పరీక్షతో పాటు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్న పోలీసుశాఖ


కామారెడ్డి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 80వేలకు పైగా ప్రభుత్వ  ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటిసారిగా పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పోలీసుశాఖలో ఉద్యోగాల జాతర నెలకొననుంది. పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో మొత్తం 16వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 302 ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ కానున్నాయి. మే 2 నుంచి 20వ తేది వరకు పోలీసు ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

జిల్లాలో మొత్తం 302 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు

రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖలోని ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్న వివరాలను ప్రకటించడంతో పాటు ఆ ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు సైతం జారీ చేసింది. జిల్లాల వారిగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సైతం రాష్ట్ర పోలీసుశాఖ ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 302 ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో 259 కానిస్టేబుల్‌ పోస్టులు, రాజన్న సిరిసిల్ల జోన్‌ పరిధిలోని 43 ఎస్‌ఐ పోస్టులను ప్రకటించింది. ఎస్‌ఐ పోస్టులలో సివిల్‌, ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీ, ఐటీసీ, పీటీవో, ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌, ఎఫ్‌పీబీ, ఎఫ్‌ఎస్‌ఎల్‌ కేటగిరీల్లో, కానిస్టేబుల్‌లో సివిల్‌, ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీ, ఐటీసీ, డ్రైవర్‌, మెకానిక్‌, ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ తదితర కేటాగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

రాజన్న సిరిసిల్ల జోన్‌లో 43 ఎస్‌ఐ పోస్టులు

రాష్ట్ర పోలీసుశాఖలోని ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ, బదిలీల ప్రక్రియను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 7 జోన్‌లుగా విభజించింది. కామారెడ్డి జిల్లా రాజన్న సిరిసిల్ల-3 జోన్‌ పరిధిలో ఉంది. ఈ జోన్‌ పరిధిలో కామారెడ్డి జిల్లాతో పాటు కరీంనగర్‌, సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లు, మెదక్‌, సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్‌ పరిధిలో మొత్తం 43 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు జారీ చేసింది. ఈ 43 పోస్టులలో 35 ఎస్‌ఐ(సివిల్‌), 4 ఎస్‌ఐ(ఏఆర్‌), 4 ఎస్‌ఐ(ఫైర్‌ సర్వీస్‌) కేటాగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఐ ఉద్యోగాల కోసమై మే 2 నుంచి 20 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా పోలీసుశాఖ ప్రకటించింది. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాతపరీక్షతో పాటు శరీరదారుఢ్య పరీక్షలు పోలీసుశాఖ నిర్వహించనుంది. 200 మార్కులతో రాతపరీక్ష నిర్వహించనుండగా రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, షార్ట్‌ఫుట్‌ తదితర శారీరక పరీక్షలను సైతం చేపట్టనున్నారు.

జిల్లాలో 259 కానిస్టేబుల్‌ పోస్టులు

జిల్లాలో మొత్తం 259 కానిస్టేబుల్‌ పోస్టులను పోలీసుశాఖ భర్తీ చేయనుంది. జిల్లాలోని సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 154, ఏఆర్‌ పోస్టులు 86, ఫైర్‌ సర్వీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 19 ఖాళీగా ఉన్నట్లు పోలీసుశాఖ ప్రకటించింది. మొత్తం 259 వివిధ కేటాగిరీల్లో కానిస్టేబుల్‌ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం అభ్యర్థులు మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సైతం రాత పరీక్షతో పాటు ఫిజికల్‌ టెస్ట్‌లను నిర్వహించనున్నారు.

Updated Date - 2022-04-26T05:17:06+05:30 IST