డీలిమిటేషన్ సెగ: కశ్మీర్‌లో నేతల ముందస్తు నిర్బంధం

ABN , First Publish Date - 2022-01-01T21:09:07+05:30 IST

నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషన్ చేసిన ప్రతిపాదనలకు..

డీలిమిటేషన్ సెగ: కశ్మీర్‌లో నేతల ముందస్తు నిర్బంధం

శ్రీనగర్: నియోజకవర్గాల పునర్విభజనపై డీలిమిటేషన్ కమిషన్ చేసిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బైఠాయింపు నిరసనలు జరపాలన్న పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్తార్ డిక్లరేషన్ (పీఏజీడీ) ప్రయత్నాలకు జమ్మూకశ్మీర్ యంత్రాంగం శనివారంనాడు గండికొట్టింది. బైఠాయింపు నిరసనలకు ముందే నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టం చేసింది. ఈ నెల 20న న్యూఢిల్లీలో కమిషన్ సభ్యులను డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా సహా ముగ్గురు నేషనల్ కాన్ఫరన్స్ ఎంపీలు కలిసారు. అనంతరం ముసాయిదా ప్రతిపాదనకు వ్యతిరేకంగా శాంతియుత బైఠాయింపు నిరసనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.


కాగా, శనివారంనాడు తాము జరుపతలబెట్టిన శాంతియుత ప్రదర్శనకు ముందే అధికార యంత్రాంగం తమను అడ్డుకోవడాన్ని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్‌లో తప్పుపట్టారు. సాధారణ రాజకీయ కార్యకలాపాలను సైతం అడ్డుకోవడం ద్వారా అధికార యంత్రాంగ భయభ్రాంతులను చేస్తోందని ఆరోపించారు. ''శుభోదయం. 2022కు స్వాగతం. కొత్త ఏడాది రోజు కూడా జేకే పోలీసులు షరామామూలుగా ప్రజలను ఇళ్లలోనే లాక్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధమైన సాధారణ కార్యక్రమాలను అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శాంతియుతంగా జరిగే బైఠాయింపు నిరసనలను నీరుగార్చేందుకు మా ఇళ్ల గేట్లు ముందు ట్రక్కులను నిలిపి ఉంచారు. కొన్ని పరిస్థితులు ఎప్పటికీ మారవు" అని ఆయన ట్వీట్ చేశారు. తన తండ్రి ఇంటి నుంచి తన సోదరణీమణులను కలుసుకునేందుకు వెళ్లే ఇంటర్నల్ గేట్‌ను కూడా పోలీసులు లాక్ చేశారనీ, ఇంత జరుగుతున్నా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని మన నేతలు ఘనంగా చెప్పుకుంటున్నారని, ఇదెంలాంటి ప్రజాస్వామ్యమే ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


పీఏజీడీ నేతలను ఇళ్లలోంచి బయటకు రాకుండా ప్రభుత్వ తీసుకున్న చర్యలపై పీఏజీడీ వైస్-చైర్‌పర్సన్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ''370 అధికరణను రద్దు చేశామంటూ భారత ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటోంది.  ప్రజాస్వామబద్ధంగా ప్రజలు చేసే నిరసనలను కూడా సహించలేనని విధంగా, ఎలాంటి హక్కులు వారికి లేకుండా చేస్తోంది. ఇది చాలా విచారకరం. శాంతియుత ప్రదర్శనలకు కూడా వెళ్లనీయకుండా లెక్కలేనన్ని సార్లు మమ్మల్ని నిర్బంధించారు'' అని విరుచుకుపడ్డారు.


కాగా, నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదాకు,  నిరసన ప్రదర్శనలకు ముందే తమ నేతల నిర్బంధానికి నిరసనగా శ్రీనగర్‌లో పలు ప్రాంతాల్లో ఎన్‌సీ, పీడీపీ కార్యకర్తలు నిరసలకు దిగారు. ఒక్క బీజేపీ మినహా, జమ్మూకశ్మీర్‌లోని గుర్తింపు పొందిన పార్టీలన్నీ కమిటీ ముసాయిదా ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా జమ్మూకు అదనంగా 6, కశ్మీర్‌కు అదనంగా ఒక సీటు కేటాయించాలని డ్రాఫ్ట్ కమిటీ సిఫారసు చేసింది.

Updated Date - 2022-01-01T21:09:07+05:30 IST