Delimitaion: జమ్మూకు 6, కశ్మీర్‌కు ఒక సీటు.. విమర్శల వెల్లువ

ABN , First Publish Date - 2021-12-21T01:41:28+05:30 IST

మ్మూకశ్మీర్‌పై ఏర్పాటు చేసిన నియోజకవర్గాల పునర్విజన (డీలిమిటేషన్) కమిషన్..

Delimitaion: జమ్మూకు 6, కశ్మీర్‌కు ఒక సీటు.. విమర్శల వెల్లువ

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌పై ఏర్పాటు చేసిన నియోజకవర్గాల పునర్విజన (డీలిమిటేషన్) కమిషన్ జమ్మూ ప్రాంతానికి అదనంగా 6 సీట్లు, కశ్మీర్‌కు ఒక సీటు ప్రతిపాదించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు 16 నియోజకవర్గాలు (ఎస్‌సీలకు 7, ఎస్‌టీలకు 9) రిజర్వ్ చేయాలని కమిషన్ ప్రతిపాదన చేసింది. కాగా, కమిషన్ ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్ సహా పలు పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. బీజేపీ రాజకీయ ఎజెండాకు అనుగుణంగానే కమిషన్ సిఫారసులు ఉన్నాయని తప్పుపట్టాయి.


బీజేపీతో మిత్రత్వం కలిగిన పీడీపీ, జేకే అప్ని పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) సైతం కమిషన్ ముసాయిదా సిఫారసులపై తీవ్ర నిరనసన వ్యక్తం చేశాయి. జమ్మూకశ్మీర్ ఎలక్టోరల్ మ్యాప్‌ను మార్చే విధంగా సిఫారసులు ఉన్నాయని ఆ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. కశ్మీర్‌ డివిజన్‌‌లో ప్రస్తుతం 46 సీట్లు ఉండగా, జమ్మూలో 37 సీట్లు ఉన్నాయి. కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ దేశాయ్ నేతృత్వం వహించగా, జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు అసోసియేట్ మెంబర్లుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఎక్స్-అఫిషియే సభ్యులుగా ఉన్నారు.


శాస్త్రీయ దృక్పథం లోపించింది: ఒమర్

కమిషన్ సిఫార్సులపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పెదవి విరిచారు. బీజేపీ రాజకీయ ఎజెండాకు తలవొగ్గినట్టుగా కమిషన్ సిఫారసులు ఉన్నాయని, ఈ సిఫారసులు తనను నిరాశపరిచాయని ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రాజకీయ ఎజెండానే కమిషన్ పాటించిందని అన్నారు. కమిషన్ ముసాయిదా సిఫారసులు తమకు ఆమోదయోగ్యం కాదని, 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా జమ్మూకు ఆరు, కశ్మీర్‌కు ఒక్క సీటు మాత్రమే కేటాయించడం సహేతుకం కాదని స్పష్టం చేశారు.


ఆమోదయోగ్యం కాదు: అప్నీ పార్టీ

కమిషన్ సిఫారసులు తమకు ఆమోదయోగ్యం కాదని జమ్మూకశ్మీర్ అప్ని పార్టీకి సారథ్యం వహిస్తున్న అల్టాఫ్ బుఖారి అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకమైన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని, జనాభా, జిల్లాల ఆధారంగా ఈ డిలిమిటేషన్ ఉండాలని అన్నారు. దీనిపై భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తాము బలంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.


బీజేపీ రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట: మెహబూబా ముఫ్తీ 

మతం, ప్రాంతీయ కోణంలో ప్రజలను విడగొట్టే ఆలోచనలో భాగంగా బీజేపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు చేసిన సిఫారసులు ఇవని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. డీలిమిటేషన్ విషయంలో తన భయాలే నిజమయ్యాయని, జనాభా లెక్కలను నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను ఒకరిపై మరొకరు ఉసిగొల్పేందుకే జమ్మూకు 6, కశ్మీర్‌ను ఒక్క సీటుకు పరిమితం చేయాలనుకున్నారని అన్నారు. కాగా, కమిషన్ సిఫారసులు తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్జద్ లోన్ అన్నారు. ప్రజాస్యామ్యాన్ని బలంగా విశ్వసించే వారికి ఇదొక షాక్ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-21T01:41:28+05:30 IST