జితేందర్‌రెడ్డికి కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2021-09-14T04:17:47+05:30 IST

రాజకీయాల్లో విలక్షణతను..

జితేందర్‌రెడ్డికి కీలక బాధ్యతలు
ఏపీ జితేందర్‌రెడ్డి

పార్టీలో వ్యూహాలకు పెట్టింది పేరుగా మారిన మాజీ ఎంపీ

ఫలితాలిస్తోన్న రాజకీయ ఎత్తుగడలతో అధిష్ఠానం గురి

మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్‌ఎంసీ, నేడు హుజూరాబాద్‌ బైపోల్‌ బాధ్యతలు

కలిసొస్తున్న జాతీయ నాయకుల సాన్నిహిత్యం


మహబూబ్‌నగర్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజకీయాల్లో విలక్షణతను ప్రదర్శించే మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డిపై బీజేపీ కీలక బాధ్యతలు మోపుతోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు టర్నింగ్‌ పాయింట్‌గా భావిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల గెలుపు బాధ్యతలను బీజేపీ జితేందర్‌రెడ్డి భుజాలపై మోపింది. బీజేపీ అధిష్ఠానంతో పాటు పార్టీ రాష్ట్ర నాయకత్వం జితేందర్‌పై నమ్మకంతో పార్టీ దిశాదశను నిర్దేశించే హుజూరాబాద్‌ ఎన్నిక బాధ్యతను ఆయనకు అప్పగించిందని భావిస్తున్నారు. 2014-19లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించిన జితేందర్‌రెడ్డికి గత ఎన్నికల్లో కేసీఆర్‌ టిక్కెట్‌ నిరాకరించడంతో, 2019లో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభకు పోటీ చేసేందుకు టిక్కెట్‌ రాకపోయినా పార్టీ అభ్యర్థి డీకే అరుణ తరఫున ప్రచారం చేశారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని గద్దెదింపడమే లక్ష్యంగా తనవంతు కృషి చేస్తాననే శపథంతో బీజేపీలో చేరిన జితేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై ఒక అస్త్రంలా దూసుకుపోతున్నారు.


రాజకీయాల్లో మొదటి నుంచి భిన్నశైలి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలోని పెద్దఆముదాల పాడుకు చెందిన జితేందర్‌రెడ్డి రాజకీయాల్లో మొదటి నుంచి భిన్నత్వాన్నే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఐపీఎస్‌ అధికారైన తండ్రి రాంచంద్రారెడ్డి దివంగత సీఎం ఎన్టీఆర్‌కు సన్నిహితుడవడం, ఎన్టీఆర్‌ సూచన మేరకు ఆయన జితేందర్‌రెడ్డిని రాజకీయాల్లో ప్రోత్సహించారు. తొలుత 1996లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ(ఎన్టీఆర్‌) అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా ఇదే స్థానం నుంచి పోటీచేసి కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్‌పై విజయం సాధించారు. 2004లో ఓటమిపాలయ్యారు. 2009లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ జైపాల్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.


ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన జితేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్‌కు సన్నిహితునిగా మారారు. 2014లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. 2019లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ నిరాకరించడంతో పోటీ చేయకుండా, బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఎంపీగా రెండు పర్యాయాలు పనిచేసిన సమయంలో జాతీయ నాయకులతో పార్టీలకతీతంగా స్నేహం పెంపొందించుకున్నారు. బీజేపీలో పాతపరిచయాల నేపథ్యానికి తోడు, టీఆర్‌ ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేతగా ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు నేరుగా పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యం జితేందర్‌రెడ్డికి దక్కింది.

Updated Date - 2021-09-14T04:17:47+05:30 IST