పిటీ.. జెట్‌ సిటీ!

ABN , First Publish Date - 2020-06-01T09:21:34+05:30 IST

అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత.. ఆర్థిక రాజధానిని కూడా..

పిటీ.. జెట్‌ సిటీ!

ఆర్థిక నగరాన్ని ఏమి చేస్తారు?

ఏడాదిలో ప్రాధాన్యతను తగ్గించేశారు 

పురోగతికి నోచుకోని జెట్‌ సిటీ 

తలపెట్టిన ఇళ్లూ అసంపూర్తిగానే! 

100 ఎకరాల్లో విస్తరణ ప్రణాళికలు హుష్‌కాకి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిష్‌ (జెట్‌) సిటీ పరిస్థితి దయనీయంగా మారింది. వైసీపీ ఏడాది పాలనలో ఈ ప్రాజెక్టు పనులు అంగుళం కూడా ముందుకు కదలలేదు సరికదా దీని భవితవ్యం గందరగోళంగా మారింది. గృహ నిర్మాణం, ఇండస్ర్టియల్‌ కాంప్లెక్స్‌లు, రిక్రియేషన్‌ ఇతర మౌలిక సదుపాయాలు, జెట్‌ సిటీ విస్తరణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో జెట్‌  సిటీ భవితవ్యాన్ని నిర్దేశించే అంశాలేవీ చర్చకు రాకపోవటం గమనార్హం. అమరావతిని దృష్టిలో ఉంచుకుని జెట్‌ సిటీకి ప్రాధాన్యత లేకుండా చేస్తారా? రానున్న రోజుల్లో  ఈ ఆర్థిక నగరం అలంకారంగా మారిపోతుందా? వీటికి సమాధానాలు ఎవరు చెబుతారు? 


అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత.. ఆర్థిక రాజధానిని కూడా నిర్మించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం జెట్‌సిటీకి రూపకల్పన చేసింది. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్థిక నగర ప్రాజెక్టు. దీని కోసం జక్కంపూడిలో 235 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. రూ.3200 కోట్లతో తొలి దశ నిర్మాణం తలపెట్టాలని భావించారు. ఇందులో భాగంగా 18 వేల మందికి ఇళ్ల నిర్మాణం, లైట్‌ - గ్రీన్‌ ఇండస్ర్టీస్‌ ఏర్పాటు, కమర్షియల్‌, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గృహ నిర్మాణంలో ముందుగా పేద, మధ్య తరగతి వర్గాల వారికి చోటు కల్పించాలని నిర్ణయించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా 28,152 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.


ఈ ఇళ్లను కూడా జెట్‌సిటీలో నిర్మించాలని నిర్ణయించారు. జెట్‌సిటీ కోసం సిద్ధం చేసిన 235 ఎకరాల్లో 50 ఎకరాలు కొండచుట్టూ గృహ నిర్మాణానికి అనుకూలంగా ఉంది. దీంతో కొండ చుట్టూ 10,624 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. దాదాపు ఏడు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మిగిలిన టెండర్‌ బ్యాలెన్స్‌డ్‌ ఇళ్లతోపాటు మరో 15 వేల ఇళ్లు నిర్మించటానికి 250 ఎకరాలకు పైగా భూములు అవసరమని భావించారు. జక్కంపూడి, వేమవరం, షాబాద గ్రామాల్లో మరో 106 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో తీసుకోవాలని నిర్ణయించారు.


ఎకరానికి రూ.కోటి పరిహారం చెల్లించటానికి కూడా గత ప్రభుత్వం సిద్ధపడింది. నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల అనంతరం  అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టణ ఇళ్లలో అక్రమాలంటూ విజిలెన్స్‌ ఎంక్వయిరీ వేయించింది. కొద్ది కాలం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఈ పనులు పట్టాలెక్కటానికి చాలా నెలల సమయం పట్టింది. దాదాపు తుది దశకు చేరుకున్న ఇళ్ల నిర్మాణం పట్టాలెక్కినట్టే ఎక్కి నిధుల కొరతతో సాగుతోంది. 28 వేల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 


తలపెట్టిన ఏడు వేల ఇళ్ల నిర్మాణాలపైన మాత్రమే ఆసక్తి చూపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఉన్నా.. తలపెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. రైతుల నుంచి తీసుకోవాలని భావించిన 106 ఎకరాల విషయంలో కూడా ప్రభుత్వం విముఖతతో ఉంది. గతంలో స్వాధీనం చేసుకున్న పట్టాలను కూడా తిరిగి రైతులకు ఇచ్చేశారు. 

Updated Date - 2020-06-01T09:21:34+05:30 IST