‘కారు’లో కుదుపులు

ABN , First Publish Date - 2022-07-06T04:49:14+05:30 IST

కారు జోరుకు బ్రేకులు పడుతున్నాయి. ఇన్నాళ్లూ జోరుమీదున్న

‘కారు’లో కుదుపులు

  • పార్టీ లైన్‌ దాటుతున్న ముఖ్యనేతలు
  • పక్కచూపులు చూస్తున్న మాజీ ఎమ్మెల్యేలు
  • అసంతృప్త నేతలకు కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ గాలం
  • మంత్రి సబితారెడ్డిపై తీగల ఫైర్‌కి కారణమిదే!
  • తీగల కాంగ్రెస్‌లో చేరుతారంటూ ఊహాగానాలు
  • ఆయన బాటలో మరికొందరు మాజీలు
  • రేపోమాపో బహిరంగంగా గళం విప్పేందుకు సిద్ధం


కారు జోరుకు బ్రేకులు పడుతున్నాయి. ఇన్నాళ్లూ జోరుమీదున్న టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. నేతల మధ్య సమన్వయం దెబ్బతిన్నది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. కొందరు నేతలు ఇక ఈ పార్టీలో పనిచేయలేమన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో పక్కదారులు వెతుక్కునే పనిలో పడ్డారు. వీరిలో ఎక్కువమంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.


(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి,  జూలై 5) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిన్నమొన్నటి వరకు ఒకమాట... ఒకేబాటగా ఉన్న టీఆర్‌ఎ్‌సలో రాజకీయ అలజడి మొదలైంది. మాకు ఎవరూ పోటీ కాదు.. మాకు మేమే సాటి అంటూ జోరుగా వెళుతున్న కారు స్పీడ్‌కు బ్రేకులు పడుతున్నాయి. కిక్కిరిసి ఉన్న కారులో ఉక్కబోత భరిస్తూనే నిన్నమొన్నటి వరకు గప్‌చి్‌పగా ఉన్న నేతలంతా ఇపుడు స్వరం పెంచుతున్నారు. ఇక ఈ ఉక్కబోత భరించలేం బయటకు పోతామంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు చాపకింద నీరులా ఉన్న నేతల్లో అసంతృప్తి ఒక్కసారిగా బయటకు వస్తుండడంతో అధికార టీఆర్‌ఎ్‌సలో గుబులు మొదలైంది. పైకి గంభీరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపల పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. రెండు రోజుల కిందట బడంగ్‌పేట మేయర్‌ పారిజాతా నర్సింహారెడ్డి తన అనుచర కార్పోరేటర్లతో కలిసి కాంగ్రె్‌సలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి సబితారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేకెత్తించాయి. మంత్రి సబితారెడ్డి ప్రోత్సాహంతో కబ్జాలు జరుగుతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే పద్ధతి ప్రకారం ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. స్కూళ్లు, చెరువుల సంరక్షణ కోసం అవసరమైతే నిరహార దీక్షకు దిగుతానని, ప్రాణత్యాగానికి కూడా వెనుకాడనని హెచ్చరించారు. ఈ విషయాలన్నింటిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సబితారెడ్డి వైఖరి కారణంగానే బడంగ్‌పేట మేయర్‌ పారిజాతారెడ్డి టీఆర్‌ఎ్‌సను వీడారని ఆరోపించడం గమనార్హం.  తీగల వ్యాఖ్యలపై మంత్రి సబితారెడ్డి కూడా అదేస్థాయిలో స్పందించారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద ఇష్యూనే కాదు.. ఆయన్ను ఎవరో మిస్‌గైడ్‌ చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. తాను భూ కబ్జాలకు పాల్పడితే ముఖ్యమంత్రి విచారణ చేపట్టి తనపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్న తీగల కృష్ణారెడ్డి ఒక్కసారిగా మంత్రిపై విరుచుపడడం టీఆర్‌ఎ్‌సలో కలకలం రేకెత్తించింది. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన కాంగ్రె్‌సలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన ఈ ప్రచారాన్ని కొట్టేస్తున్నారు. టీఆర్‌ఎ్‌సలో ఉండే తాను పోరాటం చేస్తానని.. నా గొంతులో ప్రాణమున్నంత వరకు తాను టీఆర్‌ఎ్‌సను కేసీఆర్‌ను వీడేదిలేదని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆయన గతంలో టీడీపీనీ వీడే సమయంలో కూడా చివరి క్షణం వరకు ఇదే విధంగా ఖండించారు. 


తీగల బాటలో మరికొందరు మాజీలు!

టీఆర్‌ఎ్‌సపై అసంతృప్తిగా ఉన్న అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు కాస్తా ముందుగానే తమ దారి చూసుకోవాలనుకుంటున్నారు. వీరికి కాంగ్రెస్‌, బీజేపీలు కూడా గాలం వేస్తున్నాయి. అయితే ఎక్కువ మంది కాంగ్రె్‌సవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి,. కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పార్టీ అఽధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కూడా పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకుంటే తిరుగుబాటుకు మహేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. మహేందర్‌రెడ్డి తిరుగుబావుటా ఎగురవేస్తే టీఆర్‌ఎ్‌సకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.


రంగంలోకి రేవంత్‌!

టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తిగా ఉన్న నేతలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేరుగా మాట్లాడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొడంగల్‌, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం, ఎల్‌బీ నగర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో ఇప్పటికే రేవంత్‌రెడ్డి మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. అలాగే మేడ్చల్‌ జిల్లాలోని మేడ్చల్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల నుంచి కొందరు ముఖ్యనేతలతో ఆయన టచ్‌లో ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా చేరికలను ఉధృతం చేసే పనిలో పడింది. హైదరాబాద్‌ బహిరంగ సభ తరువాత జోష్‌లో ఉన్న బీజేపీ వివిధ పార్టీల్లోని అసంతృప్తి నేతలతో భేటీలు జరుపుతోంది. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న ఆయన ఈ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థులను రంగంలో దింపే విధంగా వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే ఆయన సర్వేలు నిర్వహించారు. టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తిగా ఉన్న నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. అయితే హైదరాబాద్‌ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎ్‌సను కానీ.. సీఎం కేసీఆర్‌పైన కానీ ఎలాంటి విమర్శలు చేయకపోవడంతో  తటస్థంగా ఉన్న కొందరు నేతలు బీజేపీ వైపు వెళ్లే విషయంలో పునరాలోచనలో పడ్డారు. 


Updated Date - 2022-07-06T04:49:14+05:30 IST