Abn logo
Jul 27 2021 @ 15:44PM

Jeff bezos: రూ.15 వేల కోట్ల డిస్కౌంట్ ఇస్తా.. ఆ కాంట్రాక్ట్ నాకివ్వండి..!

వాషింగ్టన్: అంతరిక్షంపై ప్రైవేటు సంస్థల దృష్టి పడ్డాక అక్కడ కూడా విపరీతమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్, ఈలాన్ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ మధ్య పోటీ తారస్థాయికి చేరుకుంది. అయితే.. తొలి అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేసి జోరు మీదున్న జెఫ్ బెజోస్ తాజాగా తన దూకుడు మరింత పెంచారు. స్పేస్ ఎక్స్ సంస్థకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇచ్చిన కాంట్రాక్ట్‌ను తనకు ఇవ్వాలని కోరుతూ.. బెజోస్ నాసాకే బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్‌ తనకు దక్కితే ఏకంగా 2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 15 వేల కోట్లు) డిస్కౌంట్ ఇస్తానంటూ నాసాకు బహిరంగ లేఖ రాశారు. దీంతో..బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ మధ్య పోటీ మునుపెన్నడూ చూడని స్థితికి చేరుకుంది. 

చంద్రుడిపైకి తొలిసారిగా మహిళను, ఓ శ్వేతజాతీయేతరుడిని పంపించాలనుకున్న నాసా.. ఆర్టిమిస్ పేరుతో ఓ అంతరిక్ష కార్యక్రమాన్ని  2017లో ప్రారంభించింది. 2024 నాటికి చంద్రుడిపై దిగాలని డెడ్ లైన్ విధించుకుంది. ఈ క్రమంలోనే.. మూన్ ల్యాండర్‌ అనే వ్యోమనౌకను నిర్మించేందుకు సంకల్పించింది. మరోవైపు.. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో మూన్‌ల్యాండర్ డిజైన్, నిర్మాణ పనుల కోసం నాసా ప్రైవేటు సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. 

ఈ క్రమంలోనే ఈలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్‌తో పాటూ బ్లూ ఆరిజిన్ కూడా బిడ్లు దాఖలు చేశాయి. డిఫెన్స్ కాంట్రాక్టర్ డైనెటిక్స్‌, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలతో కలిసి బ్లూ ఆరిజిన్ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. చివరికి..ఈ కాంట్రాక్ట్ స్పేస్ ఎక్స్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై అమెజాన్ అధినేత అప్పట్లోనే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ ఖర్చును మరోమారు సవరించే అవకాశాన్ని స్పేస్ ఎక్స్‌కు ఇచ్చి కాంట్రాక్ట్ ఆ సంస్థకే దక్కేలా నాసా చేసిందని ఆరోపించారు. ఇది అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. అమెరికా గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీసుకు(జీఏఓ) కూడా ఫిర్యాదు చేశారు. ఆగస్టు తొలినాళ్లలో జీఏఓ.. బెజోస్ ఫిర్యాదుపై తుది నిర్ణయం వెలువరిస్తుందని సమాచారం. మరోవైపు.. నాసా తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకుంది. అంతరిక్షయాత్రలు చేపట్టడంలో స్పేస్ ఎక్స్‌కు ఉన్న అనుభవం, నాసాకున్న బడ్టెట్ పరిమితుల దృష్ట్యా కాంట్రాక్ట్‌ను ఆ సంస్థకే ఇవ్వాల్సొచ్చిందని తేల్చి చెప్పింది. 

ఇక..తొలి అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసి మంచి ఊపుమీదున్న బెజోస్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నిర్ణయించారు. ఈ కాంట్రాక్ట్‌ తనకు ఇస్తే..15 వేల కోట్ల రూపాయల డిస్కౌంట్ ఇస్తానంటూ నాసా ముందుకు ఓ ప్రతిపాదన తెచ్చారు. ఇదిలా ఉంటే.. జీఏఓ తీర్పు నాసాకు అనుకూలంగా ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే..బెజోస్ నాసాకు భారీ డిస్కౌంట్ ఇచ్చారని సమాచారం. ఈ కాంట్రాక్ట్‌ తన సంస్థకు దక్కితే నాసా చెల్లించాల్సిన బిల్లులో 2 బిలియన్ డాలర్ల మేర తగ్గిస్తానని ప్రకటించారు. ఇందుకు బదులుగా తనకు కాంట్రాక్ట్‌ను దీర్ఘకాలం పాటూ కొనసాగించాలంటూ ఓ కండిషన్ పెట్టారు. ‘‘బడ్జెట్ పరిమితుల కారణంగా..నాసా మరో దారిని ఎంచుకుంది. రెండు సంస్థలకు ఇవ్వాల్సిన కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు ఇచ్చింది. నాసా సమస్యను ఈ ఆఫర్ పరిష్కరిస్తుంది’’ అని ఆయన కామెంట్ చేశారు. మరోవైపు.. బెజోస్ లేఖపై స్పందించేందుకు నాసా నిరాకరించింది. ఇక బెజోస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.