బిహార్ శాసన సభ ఎన్నికలు సకాలంలోనే జరగాలి : జేడీయూ

ABN , First Publish Date - 2020-08-09T20:31:41+05:30 IST

బిహార్ శాసన సభ ఎన్నికలు సకాలంలో జరుగుతాయని ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్

బిహార్ శాసన సభ ఎన్నికలు సకాలంలోనే జరగాలి : జేడీయూ

న్యూఢిల్లీ : బిహార్ శాసన సభ ఎన్నికలు సకాలంలో జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా చేసిన ప్రకటనకు జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) మద్దతిచ్చింది. ఓటమి భయంతోనే ఎన్నికల వాయిదాపై ప్రతిపక్షాలు ఆశపడుతున్నాయని ఎద్దేవా చేసింది.


జేడీయూ నేత కేసీ త్యాగి ఆదివారం మాట్లాడుతూ, బిహార్ ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని సీఈసీ సునీల్ అరోరా చెప్పారని, ఆ మాటలను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసినది రాజకీయ పార్టీలు కాదని, ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 


కోవిడ్-19 సమయంలో కూడా కొన్ని దేశాల్లో ఎన్నికలు జరుగుతుండటాన్ని కేసీ త్యాగి ప్రస్తావించారు. గత రెండు నెలల్లో దాదాపు అర డజను దేశాలు ఎన్నికలు నిర్వహించాయన్నారు. కొద్ది రోజుల క్రితమే  శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో 70 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ఉందని, అయినప్పటికీ ఆ దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఫ్లోరిడాలో వరదలు వచ్చినప్పటికీ, అక్కడ ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 


రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఉన్న పార్టీలే వాయిదా పడాలని కోరుకుంటున్నాయని మండిపడ్డారు. ఎన్నికలను సకాలంలో నిర్వహించవలసిన కర్తవ్యం ఎన్నికల కమిషన్‌కు ఉందని చెప్పారు. 


బిహార్ శాసన సభ పదవీ కాలం ఈ ఏడాది నవంబరు 29తో ముగుస్తుంది. ఎన్నికల ప్రక్రియను నవంబరు 28తో ముగించవలసి ఉంటుంది. లేనిపక్షంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. 


ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల సలహాలు కోరింది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల నిర్వహణపై సలహాలు, అభిప్రాయాలను ఈ నెల 11నాటికి తెలియజేయాలని కోరింది.


Updated Date - 2020-08-09T20:31:41+05:30 IST