జవానకు.. కిసాన భూమి..!

ABN , First Publish Date - 2022-06-06T06:15:42+05:30 IST

దేశ సేవకు ప్రాణాలొడ్డే జవాన్లకు ప్రభుత్వ భూమిని ఇస్తే ఎవరూ కాదనరు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.

జవానకు.. కిసాన భూమి..!
సాగులో భూమిలో యువరైతు ధనుంజయ రెడ్డి కుటుంబం

సాగులో ఒకరు.. ఆనలైనలో మరొకరు..

రెవెన్యూ అధికారుల తీరుతో రైతు కంటతడి

దేశ సేవకు ప్రాణాలొడ్డే జవాన్లకు ప్రభుత్వ భూమిని ఇస్తే ఎవరూ కాదనరు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. చాలా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రెవెన్యూ అధికారులకు ఇవేవీ కనిపించలేదు. ఓ రైతు కుటుంబం తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని ఓ మాజీ సైనికోద్యోగికి రాసిచ్చారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఉంటే.. ఆ పొలంలో బోరుబావి తవ్వించుకుని, పంటలు పండిస్తున్న అన్నదాత కుటుంబం వారికి కనిపించేది. కానీ.. కార్యాలయంలో కూర్చుని కాగితంపై సంతకం చేశారు. ఇప్పుడు అది ఆనలైనలోకి ఎక్కింది. దీంతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతం అవుతోంది. 


గార్లదిన్నె మండలం మర్తాడులో సర్వే నెంబరు 185-1ఏ, 185-3లో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఆదే గ్రామానికి చెందిన ధనుంజయ రెడ్డి కుటుంబం మూడు తరాల నుంచి సాగు చేసుకుంటోంది. రూ.లక్షలు వెచ్చించి బోరు బావులను తవ్వించి, విద్యుత కనెక్షన తీసుకున్నారు. ఆ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న భూమిని  రెవెన్యూ అధికారులు ఓ మాజీ సైనికోద్యోగికి ఇచ్చారు. ఇటీవల రెవెన్యూ రికార్డుల్లోకి పేరు నమోదు చేయించుకునేందుకు యువరైతు ధనుంజయరెడ్డి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లాడు. పరిశీలించిన అధికారులు, ఆ భూమి మరొకరి పేరిట ఉందని రికార్డులు చూపించారు. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. తరాల నుంచి తాము సాగులో ఉన్న భూమిని మరొకరికి ఇవ్వడం ఏమిటని ధనుంజయ కంటతడి పెట్టుకున్నాడు. రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరాడు. దీని గురించి తహసీల్దార్‌ భరత కుమార్‌ను వివరణ కోరగా, గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు తిరమల రెడ్డి అనే ఓ మాజీ సైనిక ఉద్యోగికి సాగు పట్టా ఇచ్చారని, ఇటీవల అడంగల్‌  నవీకరణలో భాగంగా అతని పేరిట భూమిని పొందుపరిచామని తెలిపారు. ధనుంజయరెడ్డి అనే రైతు సాగులో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయిలో విచారించి, సాగులో ఉన్న రైతుకు న్యాయం చేస్తామని అన్నారు.

- గార్లదిన్నె

Updated Date - 2022-06-06T06:15:42+05:30 IST