గ్రామాల్లో తీర్థాల సందడి

ABN , First Publish Date - 2021-01-16T05:45:44+05:30 IST

ఊరూరా.. తీర్థాల సందడి ఆరంభమైంది. సంక్రాంతి మొదలుకుని సుమారు మూడు నెలలపాటు ప్రతి గ్రామంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

గ్రామాల్లో తీర్థాల సందడి
లోవపాలెం తీరంలో పరశురామన్న తీర్థానికి హాజరైన భక్తులు

రాంబిల్లి, జనవరి 15 : ఊరూరా.. తీర్థాల సందడి ఆరంభమైంది. సంక్రాంతి మొదలుకుని సుమారు మూడు నెలలపాటు ప్రతి గ్రామంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రాంబిల్లి మండలంలోని  మత్స్యకార గ్రామమైన లోవపాలెంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం పరశురామన్న తీర్థం గురువారం నేత్రపర్వంగా సాగింది.  సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న కొండపై వెలసిన ఈ స్వామి దర్శనానికి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా భక్తులు విచ్చేశారు. నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే, దిమిలిలో సంతోషిమాత తీర్థం నిర్వహించారు. అదేవిధంగా కట్టుబోలులో శుక్రవారం పేరంటాలు తల్లి తీర్థం ఘనంగా జరిగింది. ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌ ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు దిన్‌బాబు, ధూళి రంగనాయకులు  తదితరులు పాల్గొన్నారు.


పాయకరావుపేట రూరల్‌ : పెదరామభద్రపురంలో లక్ష్మణస్వామి కొండపై వెలసిన కోదండరామస్వామి తీర్థం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. 


నక్కపల్లి : కనుమ సందర్భంగా శుక్రవారం ఉపమాకలో పెద్ద ఎత్తున తీర్థం సాగింది. పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి పిల్లలకు కావల్సిన ఆట వస్తువులు విక్రయించారు. వివిధ స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. పలు గ్రామాల నుంచి భక్తులు ఈ వేడుకను వీక్షించేందుకు తరలివచ్చారు.  


గొలుగొండ : కొమిర, జోగంపేట, పాకలపాడు, పుత్తడిగైరంపేట, పొగచెట్లపాలెం, రావణాపల్లిలలో తీర్థాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు స్థానిక నాయకులు బహుమతులు అందజేశారు.

నర్సీపట్నం అర్బన్‌ : మండలంలోని ధర్మసాగరం, దుగ్గాడ, గురందొరపాలెం, చెట్టుపల్లి, నీలంపేట, వేములపూడి, అమలాపురం, ఎరకన్నపాలెంలలో శుక్రవారం తీర్థాలు అత్యంత ఘనంగా జరిగాయి.

మునగపాక : మండలంలోని రామగిరిలో కోదండరామస్వామి తీర్థం శుక్రవారం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.  టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావుతో పాటు బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి శ్రీనివాసరావు, దాడి ముసిలినాయుడు, కె.వీరరాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:45:44+05:30 IST