జపాన్ చిన్నారుల ఆరోగ్య రహస్యాలివే..

ABN , First Publish Date - 2022-04-07T17:52:46+05:30 IST

జపాన్ చిన్నారులు ప్రపంచంలోనే అత్యంత...

జపాన్ చిన్నారుల ఆరోగ్య రహస్యాలివే..

జపాన్ చిన్నారులు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులుగా గుర్తింపుపొందారు. మెడికల్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం ప్రకారం జపాన్‌లో పుట్టిన వారు ఆరోగ్యంగా ఉండమే కాకుండా దీర్ఘాయువును కలిగి ఉంటారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది వారి జీవన విధానం, రెండవది వారి ఆహార విధానం. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఊబకాయం, మధుమేహం కేసులు పెరుగుతున్నాయి, అయితే పలు రికార్డులను పరిశీలిస్తే జపాన్‌లో అటువంటి కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. జపాన్ చిన్నారుల ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు నిపుణులు ప్రయత్నించి పలు వివరాలు వెల్లడించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్ చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి అతి పెద్ద కారణం వారి ఆహారమే. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, అక్కడి పిల్లల ఆరోగ్య రహస్యం.. వారికి పాఠశాలలో ఇచ్చే మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనంలో తక్కువ క్యాలరీలు కలిగినవి, పోషకాలు ఎక్కువగా ఉండేవి, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇస్తారు. వారి మధ్యాహ్న భోజనంలో కాల్చిన చేపలు, స్వీట్ కార్న్, సూప్, పాలు వంటివి ఉంటాయి. వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. జపాన్‌లో వంటకాలను ఉడకబెట్టడం, ఆవిరి చేయడం లేదా బేకింగ్ చేయడం ద్వారా తయారుచేస్తారు. 


నూనె మసాలాల వాడకం తక్కువ. వారి ఆహారంలో తక్కువ కొవ్వు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇవే కాకుండా స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు ఉంటాయి. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, జపనీస్ పిల్లల ఆహారంలో పిజ్జా లేదా పాస్తాకు బదులుగా  బ్రౌన్ రైస్ ఉంటుంది. ఇది ఎంతో ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. జపాన్‌లోని కాజీ సకురా నర్సరీ స్కూల్‌లోని పోషకాహార నిపుణుడు టోమోమీ టకాసాషి మాట్లాడుతూ ఆహారం, పానీయాల విషయంలో, పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదని, వారికి తగినంత విశ్రాంతి నివ్వాలని, చక్కని వాతావరణాన్ని కల్పించాలని  తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నానన్నారు. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజుకు ఒక్కసారైనా పిల్లలతో కలిసి కూర్చొని భోజనం చేయాలని తకాషాషి తెలిపారు. దీని వల్ల పిల్లలకు ఆహారం తినడంపై ఉత్సాహం ఉంటుందన్నారు. అలాంటి వాతావరణం కల్పించినప్పుడు వారు తినడానికి ఇష్టపడతారన్నారు. ఫలితంగా చిన్నారులు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారన్నారు. జపనీస్ పిల్లల ఆరోగ్య రహస్యం వారి ఆహారం మాత్రమే కాదు, వారి శారీరక శ్రమ కూడా. ఇక్కడ 98.3 శాతం మంది పిల్లలు కాలినడకన లేదా సైకిల్‌పై స్కూలుకు వెళ్తున్నారని పరిశోధకులు తమ పరిశోధనలో గుర్తించారు. ఫలితంగా వారిలో ఊబకాయం సమస్య ఉండదు. ఇంతేకాకుండా పాఠశాలలో శారీరక శ్రమకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. 



Updated Date - 2022-04-07T17:52:46+05:30 IST