జనవరి 9 నుంచి పాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-22T18:08:19+05:30 IST

తమిళనాడు రాజకీయ ఒత్తిళ్లకు తలొంచి కేంద్రం ‘మేకెదాటు’ పథకానికి అనుమతులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. బెళగావి సువర్ణసౌధలో మంగళవారం కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ

జనవరి 9 నుంచి పాదయాత్ర

- సీఎల్పీ నిర్ణయం 

- 15 శాసనసభ నియోజక వర్గాలు

- 169 కిలోమీటర్ల పయనం


బెంగళూరు: తమిళనాడు రాజకీయ ఒత్తిళ్లకు తలొంచి కేంద్రం ‘మేకెదాటు’ పథకానికి అనుమతులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. బెళగావి సువర్ణసౌధలో మంగళవారం కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత సిద్దరామయ్య అధ్యక్షత వహించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోపాటు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉభయనేతలు మీడియాతో మాట్లాడుతూ 2022 జనవరి 9 నుంచి మేకెదాటు పథకం అమలు కోసం కాంగ్రెస్‌ భారీ పాదయాత్రను ప్రారంభించాలని సమావేశంలో తీర్మానించిందన్నారు. ఈ పాదయాత్ర జనవరి 19వరకు కొనసాగుతుందన్నారు. పాదయాత్ర 169 కిలోమీటర్ల మేరకు 15 శాసనసభ నియోజకవర్గాల మీదుగా సాగుతూ జనవరి 19న బెంగళూరుకు చేరుకుంటుందన్నారు. ఈ పాదయాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు. కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో 66 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోందని దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు మేకెదాటు పథకాన్ని తీసుకు వచ్చారన్నారు. ఈ పథకం అమలులోకి వస్తే 440 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన వీలవుతుందన్నారు. 2003లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధమైందని, అప్పట్లో రూ.5,902 కోట్లుగా ఉన్న అంచనా ఖర్చు 2018 నాటికి 9,500 కోట్లకు చేరిందన్నారు. రాష్ట్ర బీ జేపీ ఎంపీలతో ఈ ప్రాజెక్టు అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. 


కేంద్రం అనుమతితో పథకాన్ని 

ప్రారంభిస్తాం : సీఎం బొమ్మై 

మేకెదాటు పథకానికి సంబంధించి డీపీఆర్‌ సిద్ధంగా ఉందని కేంద్ర జలవనరులశాఖ అనుమతి మంజూరు చేసిన తక్షణం పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. శాసనసభలో మంగళవారం కాంగ్రెస్‌ సభ్యుడు శరత్‌బచ్చేగౌడ అడిగిన ప్రశ్నకు జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ బదులిస్తుండగా సీఎం జోక్యం చేసుకున్నారు. మేకెదాటు పథకాన్ని రాజకీయాలకోసం వినియోగించుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తమిళనాడు రాజకీయాలకు తలొగ్గవద్దని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర జలనవరులశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ పథకానికి కేంద్రం అనుమతి దక్కడం తథ్యమన్నారు. 


Updated Date - 2021-12-22T18:08:19+05:30 IST