మాట్లాడుతున్న గాదె వెంకటేశ్వరరావు
ఉద్యోగులను నట్టేట ముంచిన ప్రభుత్వం
ధ్వజమెత్తిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె
గుంటూరు, జనవరి 21: సీఎం జగన్‌కు పాలించే సమర్ధత, అర్హత లేదని, వెంటనే ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నమ్మి గెలిపించుకున్న ప్రభుత్వ ఉద్యోగులను అధికారంలోకి రాగానే నట్టేట ముంచిన ఘనత జగన్‌కే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే వీరి సమస్యపై స్పందించాల్సిన ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారో తెలియడంలేదన్నారు. రాజధాని పరిరక్షణకు అమరావతిలో రైతులు, ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు విశాఖలో కార్మికులు, గిట్టుబాటు ధర కోసం రైతులు, ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అందరూ రోడ్డెక్కడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.