జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-03-02T19:31:32+05:30 IST

నగరపాలక సంస్థలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను నేతలు విడుదల చేశారు. జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల జాబితా విడుదల

విజయవాడ: నగరపాలక సంస్థలో జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల జాబితాను నేతలు విడుదల చేశారు. జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు. జనసేన నుంచి 38 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.


ఈ సందర్భంగా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ... జనసేన జాబితాని పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ రిలీజ్ చేశారని చెప్పారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి అధిష్టానం సీట్లు కేటాయించిందని తెలిపారు. టీడీపీ, వైసీపీకి ధీటుగా జనసేన అభ్యర్థులు పోటీ పడుతున్నారన్నారు. కరోనా సమయంలో ఆ రెండు పార్టీలు ఎక్కడా కనిపించ లేదని చెప్పారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. సొంత వనరులతో ఎంతోమందికి కడుపు నింపారన్నారు. టీడీపీలో ఒకరికొకరు కొట్టుకోవడంతోనే సరి పోతుందని యెద్దేవా చేశారు. అవినీతి, నేర చరిత్ర కలిగిన వారికే వైసీపీలో టిక్కెట్‌లు ఇచ్చారని వారే చెబుతున్నారన్నారు. ఇప్పటి వరకు విజయవాడలో‌ వైసీపీ చేసిన అభివృద్ధి ఏమిటో‌ చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పధకాలకు కూడా కోత వేసి, పస్తులు పెట్టారని మండిపడ్డారు. రేషన్ కార్డు, బియ్యం కార్డు పేరు చెప్పి ముప్పై లక్షల మందికి రేషన్ రద్దు చేశారన్నారు. సంక్షేమ పధకాల కోతల‌ ప్రభుత్వం ఇది అని విమర్శించారు. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి, రాష్ట్ర అభివృద్ధిని ఆపేశారన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు తమ ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీలకు ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు ఇచ్చినట్లే అని అన్నారు. జనసేనకు ఓటేస్తే... అభివృద్ధికి ఓటేసినట్లే అని... ప్రజలు కూడా  ఆలోచించాలని పోతిన  వెంకటమహేష్ తెలిపారు. 


చెల్లబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్, మనోహర్‌ల ఆమోదంతో అభ్యర్థులను నిలబెట్టామని తెలిపారు. పొత్తులో భాగంగా జనసేన 38,  బీజేపీ 26 చోట్ల పోటీ పడుతున్నారని చెప్పారు. ప్రజల నుంచి మంచి ఆదరణ తమకు ఉందన్నారు. మెజారిటీ స్థానాలను కైవసం‌ చేసుకుంటామని భావిస్తున్నామన్నారు. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు బీజేపీకి కేటాయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. జన సైనికులు అర్థం చేసుకుని పార్టీ విజయానికి పని చేయాలని కోరారు. 


అక్కల గాంధీ మాట్లాడుతూ...బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా 64 డివిజన్లలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీ  చేస్తున్నారని తెలిపారు. 38చోట్ల జనసేన అభ్యర్థులతో పాటు, బీజేపీ అభ్యర్థుల గెలుపుకి అందరూ కృషి చేయాలని కోరారు. పోటీగా నామినేషన్లు వేసిన వారు విత్ డ్రా చేసుకోవాలని కోరుతున్నామన్నారు. పార్టీ లైన్‌ను అందరూ గౌరవించి..‌ ఆచరించాలని కోరారు. విజయవాడ కార్పొరేషన్‌ను కైవసం‌ చేసుకుంటామనే నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీగా తామంతా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తామన్నారు. 


Updated Date - 2021-03-02T19:31:32+05:30 IST