Jallikattuకు పచ్చ జెండా

ABN , First Publish Date - 2022-01-11T14:22:24+05:30 IST

రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా తమిళుల ప్రాచీన సాహసక్రీడ జల్లికట్టుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొవిడ్‌ నిబంధనల నడుమ దీనిని జరుపుకోవచ్చని ప్రకటించింది. ఆ మేరకు ఆ క్రీడ నిర్వహించే చోట 300 ఎద్దులకు

Jallikattuకు పచ్చ జెండా

- 300ల ఎద్దులతో నిర్వహణకు అనుమతి

- క్రీడాకారులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి

- అలంగానల్లూరులో ముహూర్త స్తంభస్థాపన


చెన్నై: రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా తమిళుల ప్రాచీన సాహసక్రీడ జల్లికట్టుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొవిడ్‌ నిబంధనల నడుమ దీనిని జరుపుకోవచ్చని ప్రకటించింది. ఆ మేరకు ఆ క్రీడ నిర్వహించే చోట 300 ఎద్దులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనే యువకులందరూ రెండు డోస్‌లు వ్యాక్సినేషన్‌ వేసుకుని ఉంటేనే వాడివాసల్‌లో అడుగుపెట్టేందుకు అనుమ తించాలని స్పష్టం చేసింది. జల్లికట్టు జరగటానికి రెండు రోజులకు ముందు క్రీడాకారులందరూ కరోనా ముందస్తు వైద్యపరీక్షలు చేయించుకోవాలని కూడా షరతు విధించింది. దీంతో ఇప్పటివరకూ జల్లికట్టు నిర్వహణపై రేగుతున్న అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది. ఇదిలా వుండగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై జిల్లా అలంగానల్లూరులో జల్లికట్టు నిర్వహణ కోసం ముహూర్తపురాట ఏర్పాటు సోమవారం జరిగింది. అలంగ నల్లూరులోని వాడివాసల్‌ (ఎద్దులను పోటీకి వరుసగా విడిచే ప్రాంతం) వద్ద సోమవారం ఉదయం స్థానిక పురప్రముఖులు, జల్లికట్టు నిర్వాహకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో అక్కడి ముత్తాలమ్మనల్‌ ఆలయంలో ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ప్రతియేటా సంక్రాంతి రోజున అవనియాపురంలోను, మరుసటి రోజు పాలమేడులోను, తర్వాతి రోజు అలంగానల్లూరులోనూ జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. వీటిలో అలంగానల్లూరు జల్లికట్టు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అలంగానల్లూ జల్లికట్టు క్రీడను తిలకించేందుకు దేశ విదేశాల నుండి వేలాదిమంది పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ యేడాది కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్న కారణంగా ఈ క్రీడకు పలు కట్టుబాట్లు విధించారు. అవనియాపురంలో ఈ నెల 14న జల్లికట్టు నిర్వ హించేందుకు ముందస్తు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అక్కడి వాడివాసల్‌ వద్ద ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలను, కట్టెలతో కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15 పాలమేడులో, 16న అలంగానల్లూరులో జల్లికట్టు నిర్వహించేందుకు భారీ యెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జల్లికట్టు నిర్వాహకులు పోటీలకు ఎద్దులను ఎంపిక చేసే పనుల్లో తలమునకలయ్యారు. అదే విధంగా ఎద్దులను అదుపుచేసే సాహసవీరులకు ఎలాంటి బహుమతులివ్వాలనే అంశంపై కూడా చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో అలంగానల్లూరు వెటర్నరీ ఆస్పత్రిలో జల్లికట్టు పోటీలో పాల్గొనే ఎద్దులకు డాక్టర్‌ నవనీతకన్నన్‌ సహా వెటర్నరీ డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఇటీవల మంత్రి నాజర్‌ కరోనా నిరోధక కట్టుబాట్ల నడుమ జల్లికట్టు క్రీడలు జరుగుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-01-11T14:22:24+05:30 IST