భయపడ్డారా... మనకెందుకులే అనుకున్నారా..!

ABN , First Publish Date - 2021-11-28T04:01:01+05:30 IST

పంచాయతీ ఖాతాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పుంచులు నోరుమెదపలేదు.

భయపడ్డారా... మనకెందుకులే అనుకున్నారా..!
మాట్లాడుతున్న ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య

15వ ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపుపై నోరుమెదపని సర్పంచులు

సమావేశానికి కీలకశాఖల అధికారుల డుమ్మా

జలదంకి, నవంబరు 27: పంచాయతీ ఖాతాల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పుంచులు నోరుమెదపలేదు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం మండల పరిషత్‌ మొదటి సర్వసభ్య సమావేశం ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య అధ్యక్షతన జరిగింది. ముందుగా ఇటీవల ఉప ఎన్నికలో జలదంకి-2 ఎంపీటీసీగా ఎన్నికైన వెంగమ్మ, అనారోగ్యంతో ఎంపీపీ ఎన్నికకు హాజరుకాని వేములపాడు ఎంపీటీసీ సభ్యుడు గొర్రెపాటి యలమందారెడ్డితో ఎంపీడీవో భాస్కర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో అధికారులు తమతమ శాఖలలో జరిగే అభివృద్ధిని వివరించారు. అయితే కీలకమైన రెవెన్యూ, ఇరిగేషన్‌, పీఆర్‌, విద్యుత్‌ శాఖలకు సంబంధించిన మండలస్థాయి అధికారులు సమావేశానికి డుమ్మా కొట్టడంతో గ్రామాల్లో సమస్యలపై సభ్యులు ప్రశ్నించలేకపోయారు. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచిపంచాయతీలకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచుల బ్యాంకు ఖాతాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకున్నా ఏ ఒక్క సర్పంచు మాట్లాడలేకపోవడం చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయనుకుని భయపడ్డారా..? లేక మనకెందుకులే అనేకున్నారో తెలియదు గానీ ఎవరూ ఆ ఊసే ఎత్తలేదు. లేక మండలంలోని 17 పంచాయతీల్లో 16 పంచాయతీల సర్పంచులు అధికార వైసీపీ మద్దతుదారులు కావడంతో వీరు ప్రశ్నించలేదో గానీ పంచాయతీల అభివృద్ధిని మాత్రం గాలికొదిలేశారు. కానీ సమావేశానికి ముందు ఇదే విషయమై సర్పంచులు సీఎం చర్యలను ఎండగడుతూ చర్చించుకున్నారు తప్ప సమావేశంలో ఆ ఊసే లేకుండా నిమ్మకుండిపోవడం కొసమెరుపు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మేదమమెట్ల శివలీల, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు పాలవల్లి మాలకొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T04:01:01+05:30 IST