ప్రైవేటుకు జై

ABN , First Publish Date - 2021-02-25T06:49:59+05:30 IST

గడచిన నాలుగు వారాలుగా పదేపదే ప్రైవేటు మంత్రాన్ని జపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తన మాటలపై మరింత స్పష్టతనిచ్చారు.

ప్రైవేటుకు జై

  • 100 పీఎస్‌యూల విక్రయం.. 2.5 లక్షల కోట్ల ఆర్జన లక్ష్యం
  • ప్రైవేటుతోనే లాభాలు, సమర్థత, ఉద్యోగ కల్పన
  • ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడం, ఆఽధునికీకరించడమే మంత్రం
  • వ్యాపారం చేయడం ప్రభుత్వ పని కాదు
  • 4 వ్యూహాత్మక రంగాల్లో తప్ప అన్ని పీఎస్‌యూల్నీ అమ్మేస్తాం
  • తేల్చిచెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 
  • విశాఖ ఉక్కుపై కేంద్ర నిర్ణయం మారదని పరోక్ష సంకేతాలు


 న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): గడచిన నాలుగు వారాలుగా పదేపదే ప్రైవేటు మంత్రాన్ని జపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తన మాటలపై మరింత స్పష్టతనిచ్చారు.  ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదా ఆధునికీకరించడమే  తమ  లక్ష్యమని, ఈ దిశగా అవసరమైన విధాన నిర్ణయాలన్నీ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ‘‘ప్రభుత్వం వద్ద నిరుపయోగంగా, అసలే ఉపయోగించని ఆస్తులెన్నో ఉన్నాయి. వాటిలో ఓ వంద ఆస్తుల్ని గుర్తించి అమ్మేస్తున్నాం. వీటి విక్రయం ద్వారా రూ 2.5 లక్షల కోట్లను ఆర్జించాలన్నది ఉద్దేశం’’ అని ఆయన వెల్లడించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం తప్పదని తేల్చిచెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాల్లో అతి కొద్ది సంస్థల్ని తప్ప మిగిలిన అన్ని పీఎ్‌సయూలనూ అమ్మేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నాలుగు రంగాలు: (1) అణుశక్తి- రక్షణ-అంతరిక్ష రంగం, (2) రవాణా-టెలికమ్యూనికేషన్లు, (3) విద్యుత్‌-ఇంధన (చమురు, సహజవాయువులు, బొగ్గు)- వివిధ రకాల ఖనిజవనరులు, (4) బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఆర్థిక సేవలు... వీటిలో అతి తక్కువ స్థాయిలో ప్రభుత్వ ప్రమేయం ఉంటుందని మోదీ వివరించారు. 


‘వ్యాపారానికి, వాణిజ్యానికి ఊతమివ్వడమే ప్రభుత్వ విధి... వ్యాపారం చేయడం కాదు’ అని ఆయన ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, ప్రైవేటీకరణలపై ఏర్పాటైన ఓ వెబినార్‌లో స్పష్టం చేశారు. ‘అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. పన్ను చెల్లింపుదారుల (టాక్స్‌పేయర్ల) సొమ్ముతో వాటిని కొనసాగిస్తున్నాం. ఇది ఆర్థికరంగానికి పెద్ద భారంగా మారింది. అనేక ఏళ్ల కిందటి నుంచీ ఉందనో, వారసత్వంగా సంక్రమించిందనో, లేక ఎవరి మానసపుత్రికో అనో నష్టాలు భరిస్తూ పోలేం. పీఎ్‌సయూలు ఏర్పాటైన కాలంలో పరిస్థితులు వేరు. ఆనాటి అవసరాలూ వేరు. 50-60 ఏళ్ల కిందట అవి మంచివే. ప్రస్తుత పరిస్థితులు వేరు..  ఇపుడు మేం సంస్కరణలు తెచ్చాం. ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.




‘‘ప్రైవేటు రంగంతోనే లాభాలు సమకూరుతాయి, ప్రపంచస్థాయి ప్రమాణాలు సాధ్యం. పెట్టుబడులూ వస్తాయి. ఆయా రంగాల్లో సమర్థత పెరుగుతుంది. ఉద్యోగాలు కూడా లభిస్తాయి’’ అని మోదీ వివరించారు. దేశం అత్యధిక వృద్ధి సాధించేందుకు  బడ్జెట్‌లో  స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, దేశాభివృద్దిలో ప్రైవేట్‌ రంగ వినియోగంపై బడ్జెట్‌ బలంగా దృష్టి సారించిందని మోదీ చెప్పారు. ‘‘ప్రైవేటీకరణ ద్వారా,  పెట్టుబడలు ఉపసంహరణ ద్వారా వచ్చే ధనాన్ని ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి ప్రాజెక్టులకు వాడతాం.. ప్రజాధనాన్ని సరిగ్గా ఉపయోగించడమే సంస్కరణల అతిపెద్ద లక్ష్యం’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 


‘‘ దేనికైనా ఓ నిర్దిష్ట, స్థిరమైన విధానం ఉండడం అత్యవసరం.. అపుడే పోటీని పెంచేందుకు పారదర్శక విధానాలను అనుసరించగలం. అందుకే ప్రైవేటీకరణ విధానాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నాం.. మదుపరులతో సంబంధాలు ఏర్పర్చుకునేందుకు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వ కార్యదర్శులతో ఓ సాధికారిక బృందాన్ని ఏర్పరిచాం. ఒకే మార్కెట్‌ - ఒకే పన్ను వ్యవస్థదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది’’ అని మోదీ విశదీకరించారు.  





విశాఖ ఉక్కుపై  నిర్ణయం మారదా..?

వ్యూహాత్మక రంగాలను తప్ప అన్ని పీఎ్‌సయూలను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మోదీ స్పష్టం చేయడంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇక ఆగకపోవచ్చని, దీనిపై కేంద్ర వైఖరి మారకపోవచ్చని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను వివిధ పార్టీలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ప్రధాని వ్యాఖ్యలు అందరి ఆశలపై నీళ్లు జల్లాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో  ఓ భావోద్వేగ అంశంగా మారుతున్న ఈ వ్యవహారంపై కేంద్రానికి నచ్చచెప్పడానికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించడానికి సమాయత్తమవుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, ప్రధాని మోదీకి పరిస్థితిని వివరిస్తానని జగన్మోహన్‌రెడ్డి రెండ్రోజుల కిందటే చెప్పారు. అయితే కేవలం వారసత్వ కారణాల మీదో, ఎవరో ఎపుడో ప్రారంభించారనో చెప్పి నష్టాలు భరించలేమని మోదీ తేల్చిచెప్పడంతో ఏపీ ప్రభుత్వ యత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయన్నది సందేహమేనని అంటున్నారు.


Updated Date - 2021-02-25T06:49:59+05:30 IST