14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌

ABN , First Publish Date - 2022-08-07T07:25:59+05:30 IST

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి..

14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌

మార్గరెట్‌ అల్వాపై ఘనవిజయం

పోలైన ఓట్లు 725.. చెల్లనివి 15

ధన్‌ఖడ్‌కు 528, అల్వాకు 182

346 ఓట్ల ఆధిక్యంతో ధన్‌ఖడ్‌ గెలుపు

అభినందించిన ప్రధాని, విపక్ష నేతలు

పార్లమెంట్‌ ఉభయ సభలను నడిపేది రాజస్థానీలే..

న్యాయవాద వృత్తి నుంచి.. ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. ఆ వెంటనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 725(92.94%) ఓట్లు పోలయ్యాయి. నిజానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య 788 కాగా.. 8 ఖాళీలున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయినా.. ఆ పార్టీకి చెందిన శిశిర్‌ కుమార్‌ అధికారి, దివ్యేందు అధికారి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా వాటిల్లో ధన్‌ఖడ్‌కు 528, యూపీఏ బలపరిచిన అభ్యర్థి మార్గరేట్‌ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధన్‌ఖడ్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది.


ధన్‌ఖడ్‌ గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.ఫలితాలు వెలువడగానే.. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ముర్ము కూడా ఆయన్ను అభినందిస్తూ.. ధన్‌ఖడ్‌ ఎన్నికతో దేశ ప్రజలకు లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్‌ రాహుల్‌ గాంధీ, యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరేట్‌ అల్వా తదితరులు కూడా ధన్‌ఖడ్‌కు నేరుగా.. ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. నిజానికి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఆశావహుల్లో గానీ, ఎన్డీయే పరిశీలనలో ఉన్న జాబితాలో గానీ, తొలుత జగదీప్‌ పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడినే మరోసారి కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లోత్‌లలో ఒకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది.


వీరెవరినీ కాకుండా జగదీప్‌ పేరును బీజేపీ అధిష్ఠానం ఖరారు చేయడం గమనార్హం. ‘కిసాన్‌ పుత్ర’ పేరుతో ఆయన్ను బరిలో దింపినట్లు బీజేపీ స్పష్టం చేసింది. ఇలా అనూహ్యంగా బరిలో నిలిచినా.. ధన్‌ఖడ్‌ విజయం మాత్రం నల్లేరుపై నడకే అయ్యింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య పదవీకాలం ఈ నెల 10న ముగుస్తుంది. ఆ తర్వాతి రోజే ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీలోని 1, త్యాగరాజ్‌ మార్గ్‌లో ప్రభుత్వం కేటాయించిన మరో బంగళాలోకి మారనున్నారు. 


రాజకీయ నేపథ్యం..

ధన్‌ఖడ్‌ 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామంలో ఓబీసీ వర్గానికి (జాట్‌) చెందిన కుటుంబంలో.. గోఖల్‌ చంద్‌, కేసరి దేవి దంపతులకు జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు. రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. పారి్‌సలోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టులో సభ్యుడిగా సేవలందించారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్‌(జేడీ) తరఫున ఎంపీగా గెలుపొందారు. 1990లో కేంద్రమంత్రి(పార్లమెంటరీ వ్యవహారాలు)గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రె్‌సలో చేరారు. 1993-98 మధ్య అజ్మీర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2008లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 నుంచి.. ఈ ఎన్నిక వరకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగారు. గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన పలుమార్లు మమత ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసి, వార్తల్లో నిలిచారు. చిన్నతనంలో ఆయన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌, రాజస్థాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌లకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆధ్యాత్మికత, ధ్యానాన్ని చిరుప్రాయం నుంచే అలవర్చుకున్నారు.




నడిపేది రాజస్థానీలు!

ధన్‌ఖడ్‌ ఎన్నికతో రాజస్థాన్‌ రాష్ట్రం మరో అరుదైన ఘనతను సాధించింది. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా రాజస్థానీ కాగా.. ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన ధన్‌ఖడ్‌ రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇక.. రాజస్థాన్‌ నుంచి ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో వ్యక్తి ధన్‌ఖడ్‌. ఇంతకు ముందు రాజస్థాన్‌కు చెందిన భైరాంసింగ్‌ షెకావత్‌ ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన విషయం తెలిసిందే. ధన్‌ఖడ్‌ విజయం పట్ల రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-08-07T07:25:59+05:30 IST