విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్
కరెంట్ చార్జీల పెంపునకు రంగం సిద్ధం
టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద
అనకాపల్లి, జనవరి 28: ఆదాయం పెంచుకోవడానికి సామాన్యులను లక్ష్యంగా చేసుకుని సీఎం జగన్‌రెడ్డి ధరల మోత మోయిస్తున్నారని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే గ్యాస్, పెట్రోలు, డీజిల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలను పెంచారన్నారు. ఇప్పుడు కరెంటు చార్జీలు కూడా పెంచడానికి సిద్ధమవుతున్నారని ఆరోపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్త టారిఫ్ అమలులోకి వస్తే తొమ్మిది నెలల కాలానికి రూ.919.18 కోట్లు గృహ వినియోగదారునిపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వ రాయితీలు పెంచకపోతే మధ్యతరగతి వారిపై నెలకు రూ.280 వరకు అధికంగా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీడీసీఎల్ పరిధిలోని గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి ప్రస్తుత టారిఫ్ ప్రకారం రూ.2,999.66 కోట్లు వసూలవుతుందన్నారు. శ్లాబులు మార్చడం ద్వారా వినియోగదారులపై భారం మరింత పెరుగుతుందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాగా, పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియామకమైన షేక్ బాబర్‌ను సత్కరించారు. ఆయనకు గౌరీపరమేశ్వరుల చిత్రపటం అందించి అభినందనలు తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ కేవీకేవీఏ నారాయణరావు, నాయకులు ఉగ్గిన రమణమూర్తి, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనాల విష్ణుచౌదరి పాల్గొన్నారు.