కన్నుల పండువగా జగన్నాథ శోభాయాత్ర

ABN , First Publish Date - 2022-07-05T06:02:12+05:30 IST

పట్టణంలో కన్నులపండువగా జగన్నాథ శోభా యాత్ర సోమవారం కొనసాగింది. ఒక వైపు భక్తుల కోలాటాలు, మరోవైపు హరే రామా హరే కృష్ణ భజన సంకీర్తనలతో ఆదిలాబాద్‌ పట్టణం మార్మోగింది. భక్తులు భక్తిపారవశ్యంలో మైమరిచి పోయారు. దీనిలో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన జగన్నాథుడి రథయాత్రతో పట్టణంలో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

కన్నుల పండువగా జగన్నాథ శోభాయాత్ర
జగన్నాథ శోభాయాత్ర నిర్వహిస్తున్న భక్తులు

ఆదిలాబాద్‌ అర్బన్‌, జూలై 4: పట్టణంలో కన్నులపండువగా జగన్నాథ శోభా యాత్ర సోమవారం కొనసాగింది. ఒక వైపు భక్తుల కోలాటాలు, మరోవైపు హరే రామా హరే కృష్ణ భజన సంకీర్తనలతో ఆదిలాబాద్‌ పట్టణం మార్మోగింది. భక్తులు భక్తిపారవశ్యంలో మైమరిచి పోయారు. దీనిలో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన జగన్నాథుడి రథయాత్రతో పట్టణంలో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జిల్లాకేంద్రంలోని మధుర జిన్నింగ్‌ నుంచి జగన్నాథుని రథయాత్ర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జగన్నాథుని ఉత్సవ  విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి రథోత్సవాన్ని చేపట్టారు. భక్తులు తాడును లాగుతూ రథాన్ని ముందుకు తీసుకెళ్లారు. పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌, దేవిచంద్‌చౌక్‌మీదుగా రథయాత్ర సాగింది. ఎమ్మెల్యే జోగు రామన్న ఉత్సాహంగా యాత్రలో పాల్గొనడం ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్‌, ప్రమోద్‌కుమార్‌ ఖత్రి, బండారి దేవన్నలతో పాటు పెద్దసంఖ్యలో ఇస్కాన్‌ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:02:12+05:30 IST