రెండున్నరేళ్లకు..!

ABN , First Publish Date - 2022-01-29T03:42:13+05:30 IST

సీతంపేట ఐటీడీఏ 77వ పాలకవర్గ సమావేశం సుమారు రెండున్నరేళ్ల తర్వాత నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ చైర్మన్‌, కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించనున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఇది రెండో పాలకవర్గ సమావేశం. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించా

రెండున్నరేళ్లకు..!
ఐటీడీఏ ప్రధాన కార్యాలయం

నేడు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం

కీలక శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత

పీహెచ్‌సీల్లో కానరాని 24/7 వైద్యం

అటవీ ఉత్పత్తులకు తగ్గిన మద్దతు ధర...  

సీతంపేట : సీతంపేట ఐటీడీఏ 77వ పాలకవర్గ సమావేశం సుమారు రెండున్నరేళ్ల తర్వాత నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ చైర్మన్‌, కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించనున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఇది రెండో పాలకవర్గ సమావేశం. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాల్సి ఉన్నా... కొన్నేళ్లుగా జరగడం లేదు. 2019 సెప్టెంబరు 11న 76వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన సమావేశాలు ఒక్కపూటలోనే ముగించేసేవారు. ఈసారైనా అన్ని శాఖలపై చర్చ జరుగుతుందో లేదో... జిల్లా ఇన్‌చార్జి మంత్రి హాజరవుతారో? లేదో? అనే సందేహం వ్యక్తమవుతోంది.   

అందని 24 గంటల వైద్యం..

ఐటీడీఏ పరిధిలో ఉన్న 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు 24 గంటల వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. వైద్యుల కొరతా వేధిస్తోంది. ఇక్కడి వైద్యులు సీహెచ్‌సీలకు, ఏరియా ఆసుపత్రులకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోవడంతో వైద్యం సరిగా అందక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే ఇద్దరు వైద్యాధికారులు ఉన్నారు. సీహెచ్‌సీల్లోనూ సిబ్బంది కొరత ఉంది. 

మద్దతు ధరలో కోత...

 అటవీ ఉత్పత్తుల మద్దతు ధరల్లో జీసీసీ కోత విధించింది. దీంతో గిరిజనులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో చింతపండు కిలో రూ.36కు జీసీసీ కొనుగోలు చేయగా... ఈ ఏడాది రూ.32గా మద్దతు ధర నిర్ణయించింది. అదేవిధంగా నరమామిడి చెక్క, కొండచీపురు, ఉసిరిక పప్పు, నల్లజీడి వంటి అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర తగ్గించడంతో గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

కీలకశాఖల్లో సిబ్బంది కొరత...

ఐటీడీఏలో కీలక శాఖలైన ఉద్యానవన, విద్య, ఇంజినీరింగ్‌, వైద్యం వంటి కీలక శాఖల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇన్‌చార్జిల పాలనతోనే గత రెండేళ్లుగా నెట్టుకొస్తున్నారు. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో అధికారి మూడేసి శాఖల బాధ్యతలు చూస్తున్నారు.

అనధికారికంగా అడ్వాన్సులు...

ఐటీడీఏ ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు నిబంధనలకు విరుద్ధంగా బినామీ కాంట్రాక్టర్లకు అనఽధికారికంగా అడ్వాన్సులు చెల్లింపులపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదిమ తెగకు చెందిన వారి అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ (సీసీడీపీ) నిధులు... వారికి ఖర్చు చేయకుండా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు రూ.3కోట్ల మేర చెల్లించారు. మెళియాపుట్టి, భామిని మండలాల్లో ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.24 కోట్లు  మంజూరు చేసింది. ఈ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా వాటి ద్వారా వచ్చే వడ్డీలోని మరో రూ.మూడు కోట్లు అడ్వాన్సుగా కాంట్రాక్టర్లుకు చెల్లించి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి రికవరీ జరగలేదు. ఈ నిధులు వినియోగంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై సమావేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఏనుగుల తరలింపేదీ?

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల దాడిలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిని ఈ ప్రాంతం నుంచి తరలించే చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. గిరిజనుల పంటలను ధ్వంసం చేస్తూ... మనుషుల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ప్రస్తావించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. 


Updated Date - 2022-01-29T03:42:13+05:30 IST