ఈటల హుజోర్‌

ABN , First Publish Date - 2021-11-03T07:19:47+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది.

ఈటల హుజోర్‌

-హుజూరాబాద్‌లో వికసించిన కమలం

- 23,865 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్‌ ఘన విజయం

- డిపాజిట్‌ దక్కని కాంగ్రెస్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. ఐదు నెలలుగా ప్రచారాలతో హోరెత్తిన హుజూరాబాద్‌ ఈటల రాజేందర్‌కు పట్టం కట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేశారు. అనంతరం ఆయన పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఐదు నెలల క్రితమే ఆయన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ కూడా పోటీగా ప్రచారం నిర్వహించి రాజకీయాలను వేడెక్కించింది. అధికార పార్టీ నిధుల వరద పారించినా, దళితబంధు పథకం ప్రవేశ పెట్టినా ఫలితం లేకపోయింది. ఈటల రాజేందర్‌ తనకున్న ప్రజాభిమానాన్ని నిరూపించుకుంటూ ఘన విజయాన్ని సాధించారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 1,04,840 ఓట్లను పొంది విజయం సాధించిన ఆయన ఈసారి 1,07,022 ఓట్లను కైవసం చేసుకున్నారు. ఉమ్మడి  జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఏడు వరుస విజయాలను సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ 83,167 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలువగా 3,014 ఓట్లను మాత్రమే పొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి బల్లూరి వెంకటనర్సింగారావు డిపాజిట్‌ కోల్పోయారు. 2,05,236 ఓట్లు పోల్‌కాగా 777 మంది వృద్దులు, వికలాంగులు పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. బీజేపీకి 1,06,780 ఓట్లు పోల్‌కాగా, 242 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లభించాయి. 1,07,022 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ విజేతగా నిలిచారు. టీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థికి 82,712 ఓట్లు పోల్‌ కాగా, 455 పోస్టల్‌ ఓట్లు లభించాయి. 83,167 ఓట్లతో ఆ పార్టీ ద్వితీయ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్‌కు 3,012 ఓట్లు రాగా మరో రెండు పోస్టల్‌ ఓట్లు లభించాయి. 23,855 ఓట్ల ఆధిక్యతతో ఇక్కడ ఈటల రాజేందర్‌ విజయం సాధించారు.

నిజమైన ఎగ్జిట్‌ పోల్స్‌

 పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఈటల రాజేందర్‌నే విజయం వరిస్తుందని చెప్పినా అధికారపక్షం మాత్రం గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో 8,11వ రౌండ్లలో మినహా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఆధిక్యతను పొందలేక పోయారు.    

సంఘ్‌ పరివార్‌ అండతో..

టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఈటల వెంట ఉన్న నాయకులు తర్వాత ఒక్కొక్కరుగా దూరమయ్యారు. మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగి తమ కేడర్‌ మొత్తాన్ని తిరిగి టీఆర్‌ఎస్‌ వైపు వచ్చేలా చూశారు. ఒకదశలో ఒంటరిగా మిగిలిన ఈటల రాజేందర్‌కు సంఘ్‌ పరివార్‌ అండగా నిలిచింది. ఆర్‌ఎస్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను రంగంలోకి దింపింది. వారు గ్రామాల్లో పర్యటించి జాతీయ భావాలు ఉన్న యువతీ, యువకులను సమీకరించి వారి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు పెట్టుకొని ఓటర్లుగా మలుచుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించి వారి మద్దతు కూడగట్టారు. ప్రతి కుటుంబాన్ని కనీసం మూడుసార్లు కలిసి బీజేపీ మద్దతివ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో పది కుటుంబాలకు ఒక ఇన్‌చార్జిని నియమించి నిత్యం వారితో టచ్‌లో ఉంటూ అధికార పార్టీవైపు మళ్లకుండా చూశారు. ఓటరు జాబితాలోని ఒక పేజీకి ఒక కమిటీని నియమించి దానిని పన్నా కమిటీగా పేర్కొన్నారు. ఆ కమిటీ తమ పరిధిలోని ప్రతి ఓటరును నిత్యం కలుస్తూ పార్టీ ఓటరుగా మార్చుకొని పోలింగ్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఓటు  వేయించుకునేంత వరకు బాధ్యతను అప్పగించారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలుగా, సంఘ్‌పరివార్‌, ఏబీవీపీ కార్యకర్తలుగా పనిచేసి ఇప్పుడు దూరంగా ఉంటున్నవారిని కూడా సమీకరించి ఈటల రాజేందర్‌ గెలుపు కోసం కృషి చేశారు. పోలింగ్‌ రోజు పెద్ద ఎత్తున యువకులు మోహరించి ఎవైనా అక్రమాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే అక్కడికి చేరుకుని నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. 

ఓటమి ఎరుగని నేత

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా మారారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఆయన కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి 2004లో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిపై 19,619 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత కేసీఆర్‌ పిలుపు మేరకు రాజీనామా చేసి 2008 ఉప ఎన్నికలో దామోదర్‌రెడ్డిని 22,284 ఓట్ల తేడాతో ఓడించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వి కృష్ణమోహన్‌రావుపై గెలుపొందారు. ఉద్యమ కాలంలోనే రాజీనామావ చేసి 2010 ఉప ఎన్నికలో ముద్దసాని దామోదర్‌రెడ్డిపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ తిరిగి ఇక్కడి నుంచే పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించారు. 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో 23,855 ఓట్ల ఆధిక్యతతో  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌పై గెలుపొందారు.

Updated Date - 2021-11-03T07:19:47+05:30 IST