23 లోపు ఖాళీ చేయాల్సిందే....

ABN , First Publish Date - 2022-08-11T05:39:50+05:30 IST

దశాబ్దాలుగా పట్టా భూములను ఆక్రమించి వాజ్‌పేయినగర్‌లో ఏర్పాటు చేసుకున్న గృహాలను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేసి తీరాల్సిందేనని... లేకుంటే పోలీసులతో బలవంతంగా బుల్‌డోజర్‌పెట్టి భవనాలు కూల్చుతామని ఆర్‌డీవో శ్రీనివాసులు హెచ్చరించారు.

23 లోపు ఖాళీ చేయాల్సిందే....
అధికారులతో మాట్లాడుతున్న ఆర్‌డివో శ్రీనివాసులు

ప్రొద్దుటూరు అర్బన్‌, ఆగస్టు 10: దశాబ్దాలుగా పట్టా భూములను ఆక్రమించి వాజ్‌పేయినగర్‌లో ఏర్పాటు చేసుకున్న గృహాలను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేసి తీరాల్సిందేనని... లేకుంటే పోలీసులతో బలవంతంగా బుల్‌డోజర్‌పెట్టి భవనాలు కూల్చుతామని ఆర్‌డీవో శ్రీనివాసులు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వాజ్‌పేయినగర్‌లో పట్టభూముల ఆక్రమణదారులనుఖాళీ చేయించే విషయంపై మున్సిపల్‌, రెవెన్యూ , పోలీసు, విద్యుత్‌ అధికారులతో ఆర్డీవో చర్చించారు. ఈ సందర్బంగా ఆర్‌డీవో మాట్లాడుతూ గత 30 ఏళ్ళకు పైగా టూటౌన్‌ బైపా్‌సరోడ్డు ప్రొద్దుటూరు పొలంలోని సర్వేనెంబరు 578, 579-1 ,603లలో సుమారు 1.23 ఎకరాల పట్టా భూములను ఆక్రమించి వందకు పైగా గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నారన్నారు. 2013లో పట్టా భూముల యజమానులు ల్యాండ్‌ గ్రాబింగ్‌కోర్టులో వాజ్యము వేశారన్నారు. ఆగస్టు 5,2015 లోనే ల్యాండ్‌ గ్రాబింగ్‌కోర్టు ఆక్రమణదారులనుంచి ఖాళీ చేయించాలని తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై భూ ఆక్రమణదారులు జిల్లా కోర్టు తీర్పును అమలు చేయవద్దని కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ 23144- 2020 దాఖలు చేశారాన్నరు. హైకోర్టులో విచారణ తరువాత భూఆక్రమణదారులను ఖాళీ చేయించమని రెవెన్యూ డివిజనల్‌ అధికారికి జమ్మలమడుగు వారికి ఆదేశించిందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వాజ్‌వేయినగర్‌లోని భూ ఆక్రమణదారులతో అనేక దఫాలుగా చర్చలు జరిపామన్నారు. వారికి ఖాళీ చేస్తే ప్రభుత్వం సొంత ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మిస్తుందని తెలిపామన్నారు. అయినా వారు ముందుకు రాకుండామొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. హైకోర్టు ఇచ్చి న 6 నెలల గడువు ఆగస్టు 23తో ముగుస్తుందని... ఆలోపు ఖాళీ చేయాలని లేకుంటే పోలీసు బలగాలతో వచ్చి బుల్‌డోజర్లతో ఆక్రమిత కట్టడాలు తొలగిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలను దిక్కరించి అడ్డుకోవాలని చూస్తే చట్టప్రకారం కేసు లు పెడతామన్నారు. రేపటి నుండే తహసీల్దారు కార్యాలయంలో వాజ్‌పేయి నగర్‌ వాసులకు ప్రత్యేక కౌంటర్‌ పెడుతున్నామని ఇంటిస్ధలాలు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో ఇంటి స్ధలం పట్టాను జారీ చేస్తామన్నారు. గృహ నిర్మాణ మంజూరు చేస్తామన్నారు. 109 కు  టుంబాలకు ఒకే చోట స్థలాలు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేపటి నుండే ఆ ప్రాంత వాసులకు విద్యుత్‌, నీటి సరఫరాను నిలిపివేయాలని మున్సిపల్‌ ట్రాన్స్‌కో అధికారులను ఆర్‌డీవో ఆదేశించారు. సమావేశంలో తహసీల్దారు నజీర్‌అహ్మద్‌, డిప్యూటీ తహసీల్దారు మనోహర్‌ రెడ్డి, మున్సిపల్‌ ఈఈ సాయి క్రిష్ణ ,టూటౌన్‌ సీఐ ఇబ్రహీం, ట్రాన్స్‌కో ఏడీఈ ప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T05:39:50+05:30 IST