‘సిత్తరాల సిరపడు...’ గంటన్నరలో పాడేశా!

ABN , First Publish Date - 2020-02-09T06:08:43+05:30 IST

‘‘మాది శ్రీకాకుళం జిల్లాలోని మందసాని మండలంలో భైరి సారంగిపురం. నా అసలు పేరు వెంకన్న. పల్లెటూరిలోని పేద కుటుంబంలో...

‘సిత్తరాల సిరపడు...’ గంటన్నరలో  పాడేశా!

‘సిత్తరాల సిరపడు... సిత్తరాల సిరపడు... 

పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు’ - ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందీ పాట! గేయ రచయితగా బల్లా విజయ్‌కుమార్‌కు గుర్తింపు తెచ్చిందీ పాట!! ఉత్తరాంద్ర ప్రజలకు తెలిసిన గాయకుడు సూరన్నను ప్రేక్షకులందరికీ పరిచయం చేసిందీ పాట!!! విశేషం ఏంటంటే... వీళ్లిద్దరికీ ఇదే తొలి సినిమా పాట. జానపదాలకు పరిమితమైన వీళ్లను చిత్రసీమకు తీసుకొచ్చింది ‘అల... వైకుంఠపురములో’ సినిమా! ఈ పాట రాత, గీత వెనుక కథలు వాళ్ల మాటల్లోనే...


- గాయకుడు సూరన్న

‘‘మాది శ్రీకాకుళం జిల్లాలోని మందసాని మండలంలో భైరి సారంగిపురం. నా అసలు పేరు వెంకన్న. పల్లెటూరిలోని పేద కుటుంబంలో పుట్టాను. మేం నలుగురు అన్నదమ్ములం. ఒక అక్క. అబ్బాయిల్లో నేనే పెద్ద. చిన్న తమ్ముడు ఏడాదిన్నర, రెండేళ్ల వయసులో చనిపోయాడు. నాకు 15, 16 ఏళ్ల వయసు నుండి మా పక్క గ్రామం రాజపురంలో చేనుకోత, మోత, దమ్ము, ఊడ్పులకు వెళ్లేవాణ్ణి. అక్కడ మజ్జి బయ్యన్న పరిచయమయ్యారు. ఆయనే నా గురువు. ప్రజాకవి వంగపండుగారు రాసిన ‘భూమి భాగోతం’ నాటకాన్ని మాకు నేర్పారు. అందులో నాకు హీరో సూరన్న పాత్ర ఇచ్చారు. అదే నా పేరుగా స్థిరపడింది. ఆధార్‌, పాన్‌, రేషన్‌ కార్డుల్లో అదే పేరు ఉంటుంది.


చదువుకోలేదు. కానీ, పాట రాశా!

మా గురువుగారు నేల మీద కూర్చుని పాడితే... స్టేజి మీద 13మంది నటించేవాళ్లం. అయితే... ‘నేను ఏ రోజు అందరి చేతా గురువుగారు అనిపించుకుంటాను?’ అని పట్టుదలతో కూడిన కోరిక ఏర్పడింది. గురువుగారి దగ్గరకు వెళ్లి ఒక్కో పాట నేర్చుకున్నాను. ఆయన పాటలూ రాసేవారు. నాకు చదువు రాదు. కానీ, నేనూ పాటలు రాయాలనుకున్నా. ‘అనాదిగా ఆడది’ చిత్రంలో ‘నువ్వు వట్టి మనిషివి అసలే కాదు... ఊరుకో వదినమ్మా’ అని పాట ఉంది. ఆ ట్యూనులో ‘నువ్వు సత్యమైన ఇలవేల్పువమ్మా... సంతోషీమాత’ అని పాట కూర్చాను. అది విని బయ్యన్న చాలా ఆనందించారు. అలా ఒక్కో పాట కూరుస్తూ ఉండేవాణ్ణి. గురువుగారు బయటకు వెళ్తున్నప్పుడు... నాటకంలో కథ, మాటలు నన్ను అనమనేవారు. అందులో 70 పాటలుంటాయి. ఆ పాటలు, డైలాగులు... రాత్రి తొమ్మిదింటికి ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ చేస్తే తెల్లవారుజామున ఏడింటికి పూర్తయ్యేది. రెండేళ్లలో నాకు అవన్నీ కంఠతా వచ్చేశాయి. ఈ రోజుకీ నాకు చదువు లేదు. సంతకం అడ్డదిడ్డంగా చేస్తా. ఓ గంట కష్టపడి నేర్చుకున్నా.


ఒక్క రోజులో 36 పాటలు రికార్డు చేశా!

తొమ్మిదేళ్ల క్రితం విశాఖపట్టణంలోని ‘శ్రీమాత మ్యూజిక్‌ హౌస్‌’ వాళ్లు నా ప్రోగ్రామ్స్‌ చూశారు. ‘ఈ పాటలన్నీ మేం రికార్డింగ్‌ చేస్తాం. వైజాగ్‌ రా’ అన్నారు. ఒక డ్రమ్‌, సైడ్‌ డ్రమ్స్‌, రెండు గిలకలు పట్టుకుని తొమ్మిదిమంది వెళ్లాం. ఒక్క రోజులో 36 పాటలు చేశాం. నెల తర్వాత విడుదల చేశారు. అందులో ‘అల్లుడా గారెలు వండాలా... బూరెలు వండాలా?’ పాట ప్రపంచం మొత్తం వెళ్లింది. మారుమూల గ్రామాల ప్రజలు ఫోనులు చేస్తే... సొంత డబ్బులతో క్యాసెట్లు, సీడీలు కొని... కొరియర్‌లో పంపాను. రెండేళ్ల తర్వాత మళ్లీ ఓ క్యాసెట్‌ చేశా. వాద్యాలు, తొల్లాలు పెట్టకుండా కొంచెం పాపులర్‌ అవుతుందని క్యాషియో, తబలా పెట్టాం. అది సక్సెస్‌ అవ్వలేదు.


‘తితిలీ...’ పాట నెట్టింట మోగింది!

మా శ్రీకాకుళం జిల్లాలో తితిలీ తుపాను బాగా దెబ్బ కొట్టింది. ఆ రోజు రాత్రంతా నేను నిద్రపోలేదు. ఇల్లు మొత్తం బీటలు వారింది. నా దగ్గర పెద్ద ఎద్దు ఉంది. తెల్లవారుజామున ఐదున్నరకు ఎద్దు సచ్చిపోయిందేమోనని బయటకొస్తే... 70-80కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఎద్దు ఏడుస్తోంది. అప్పుడు ‘తితిలీ తితిలీ తుఫాను వచ్చి ఊరు వాడ వల్లకాడు అయితే శ్రీకాకుళం జిల్లా చిన్నబోయింది’ అని పాట రాశా. యూట్యూబ్‌లో పెద్ద హిట్‌ అది.


18మంది... 30 వేలు!

దేవుడి దయవల్ల మా జిల్లాలో, ఒరిస్సాలో తెలుగు గ్రామాల్లో నాకు మంచి పేరొచ్చింది. దాదాపుగా ఓ రెండొందల పాటలు రాశా. మా గురువుగారి దగ్గర 150 పాటలు తీసుకున్నా. మొత్తం 350 పాటలు పాడతా. డ్యాన్స్‌, కామెడీ, కథ ఉండేలా స్టేజి షో చేస్తా. మొత్తం 18 మంది టీమ్‌గా వెళతాం. ఒక్కో షోకి 30 వేలు తీసుకుంటాం.


‘అల్లుడా గారెలు వండాలా...’  టు ‘అల...’ వరకు

‘తితిలీ...’ పాట విడుదలైన తర్వాత... 12 రోజులకు నా చేత ‘అల్లుడా గారెలు వండాలా...’ పాట మళ్లీ పాడించి, యూట్యూబ్‌లో పెట్టారు. పాపులర్‌ అయింది. దర్శకుడు చిన్నికృష్ణగారు నాకు ఫోన్‌ చేసి... హైదరాబాద్‌ రమ్మన్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో దిగాక... నేరుగా హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియో తీసుకువెళ్లారు. ‘అల... వైకుంఠపురములో’ చిత్రీకరణ జరుగుతోంది. త్రివిక్రమ్‌గారితో చిన్నికృష్ణ నా గురించి చెప్పారు. ‘నువ్వేం బాగా పాడతావ్‌?’ అని త్రివిక్రమ్‌ అడిగారు. ‘జానపదాలు’ అని చెప్పా. ఏదొకటి పాడమన్నారు. ‘ఇంటి మొగుడుకి ఇగురు కూర... పై మొగుడికి రొయ్యిల కూర’ అని ఓ పాట పాడాను. వెంటనే ఫకాలున నవ్వేశారు. మరో పాడ పాడమన్నారు. ‘అల్లుడా గారెలు వండాలా’ పాడాను.

‘చిన్నీ! ఈ వాయిస్‌ హైదరాబాద్‌లో గానీ, ముంబయ్‌లో గానీ ఎవరికీ లేదు’ అన్నారు త్రివిక్రమ్‌. వెంటనే జేబులో సెల్‌ తీసి ‘సిత్తరాల సిరపడు’ లైన్‌ వినిపించి, ‘తెల్లవారుజామున తమన్‌ దగ్గరకు తీసుకువెళ్లి ఈ పాటను ఇతడితో పాడించండి’ అని చెప్పేశారు. రెండో రోజు ఉదయమే పార్క్‌ హయత్‌లో తమన్‌గారి స్టూడియోకి తీసుకువెళ్లారు. అప్పటికి త్రివిక్రమ్‌గారు అక్కడే ఉన్నారు. తమన్‌ని చూడగానే నాకు భయమేసింది. సింగర్‌ శ్రీకృష్ణగారు నాకెంతో ధైర్యం చెప్పి నాతో పాడించారు. గంటా ఇరవై నిమిషాల్లో పాట తేల్చేశాను. ‘హైదరాబాద్‌, చెన్నై, ముంబయ్‌ నుండి పెద్ద పెద్ద సింగర్స్‌ వస్తారు. నీ అంత వేగంగా ఎవరూ పాడలేరు’ అని తమన్‌, శ్రీకృష్ణ ఒకేసారి అన్నారు. పదిలక్షలు ఇస్తే ఎంత సంతోషపడతారో... అంతకన్నా ఎక్కువ సంతోషపడ్డా.

‘అల...’లో సముద్రఖని పాత్రకు నాతో డబ్బింగ్‌ చెప్పించే ప్రయత్నం చేశారు. ఎక్కడో నా వాయిస్‌ తేడా కొట్టింది. నా దురదృష్టమది. పాటకు మంచి పేరొచ్చింది. నా అదృష్టమది. నాకు అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌, తమన్‌కి రుణపడి ఉంటా. నాకు దారి చూపించిన చిన్నకృష్ణను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా.


సిత్తరాల సిరపడు.. పాట రచయిత బల్లా విజయ్‌కుమార్‌ ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి..

Updated Date - 2020-02-09T06:08:43+05:30 IST