సినిమా పాటకు సరిపోననుకున్నా

ABN , First Publish Date - 2020-02-09T06:12:08+05:30 IST

ఒరిస్సాలోని జయపూర్‌ మా స్వస్థలం. చదువంతా అక్కడే పూర్తి చేశా. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే పిచ్చి. శ్రీకాకుళం సమీపంలో...

సినిమా పాటకు సరిపోననుకున్నా

  • రచయిత బల్లా విజయ్‌కుమార్‌

ఒరిస్సాలోని జయపూర్‌ మా స్వస్థలం. చదువంతా అక్కడే పూర్తి చేశా. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే పిచ్చి. శ్రీకాకుళం సమీపంలో అమ్మమ్మగారిల్లు ఉండటంతో శ్రీకాకుళం పదజాలం, యాస, నానుళ్లు బాగా అలవాటయ్యాయి.  జానపదాలు, గజల్స్‌, ఒరియాలో ట్రైబల్‌ సాంగ్స్‌ ఎక్కువ ఇష్టపడేవాణ్ణి. ఒరిస్సాలో భారతీయ సాంస్కృతిక సంఘం ఉండేది. దానిలో యాక్టివ్‌ మెంబర్‌గా, కార్యదర్శిగా పనిచేశా. 1988లో ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌ఐసీ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అందులో ఐటీ సెక్టర్‌లో మేనేజర్‌, సేల్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేశా. సొంతూరులో ఉన్నప్పుడు చందు సుబ్బారావు, చాగంటి సోమయాజులు, చాగంటి తులసి వంటి ఉద్దండులతో పరిచయం ఉంది. ఓ సందర్భంలో మహాకవి శ్రీశ్రీని కలిశా. వీరందరి ప్రభావంతోనే పాటలు, సాహిత్యం మీద ఆసక్తి పెరిగింది. ‘మహా ప్రస్థానం’ గేయాల్ని అందరూ కవితలుగా పాడుకుంటే నేను ట్యూన్లు కట్టుకుని పాడేవాణ్ణి. నాటకాల పిచ్చి కాస్త ఎక్కువ. కానీ పెళ్లయ్యాక వదిలేశా. పాటల్ని మాత్రం వదిలిపెట్టలేదు. 

‘లుంగీ డాన్స్‌’ పాటలు రాయలేను...

విశాఖ తీరాన్ని కుదిపేసిన హుద్‌హుద్‌ తుపాను సమయంలో ‘సంకల్ప గీతం’ ఒకటి రాశా. ఆకాశవాణి రెయిన్‌బో ఎఫ్‌ఎమ్‌లో ఆ పాటను పాడమనడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. ఎలాంటి పాట అయినా ఒకటి రెండు రోజుల్లో రాయడం అలవాటైంది. సినిమా పాటలు ఎప్పుడూ ట్రై చేయలేదు. ‘నా సాహిత్యం సినిమాకు పనికొస్తుందా? నేనలా రాయగలనా?’ అన్న అనుమానంతో దానికి దూరంగా ఉన్నా. పైపెచ్చు ‘లుంగీ డాన్స్‌’, ‘కెవ్వు కేక’ వంటి పదాలతో నేను పాటలు రాయలేను. అది నా బలహీనత. అందుకే ‘సినిమా పాటలకు నేను తగను’ అని దూరంగా ఉన్నా. 

‘అల’ అవకాశం వచ్చిందిలా!

నా దార్లో నేను ఉద్యోగం చేసుకుంటూ, పాటలు అంటూ ముందుకు సాగుతుంటే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సోదరుడు, నా మిత్రుడు అయిన సి.వి.ఆర్‌ శాస్త్రి ‘సినిమా పాటలు రాయొచ్చు కదా’ అని సలహా ఇచ్చారు. నేను రాసిన ‘హుద్‌హుద్‌’ పాట ఆయనకు చాలా ఇష్టం. ‘నువ్వు ఎలాంటి పాటైనా రాయగలవు మిత్రమా!’ అనేవారు. ఆయనే సిరివెన్నెలగారి అబ్బాయి యోగికి నా గురించి చెప్పారు. యోగి ‘అల వైకుంఠపురములో’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆనంద్‌కు నన్ను పరిచయం చేశారు. ఆ సమయంలోనే ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర స్టైల్‌లో ఓ పాట కావాలని త్రివిక్రమ్‌ అడిగారని చెప్పి..  నాకు సినిమాలోని సిచ్యుయేషన్‌ వివరించారు.


నాతో అవుతుందో, అవ్వదో అని ‘బద్రి’ కూర్మారావుగారికీ, నాకు తెలిసిన మరో నలుగురు రచయితలకూ ‘ఫలానా తరహా పాట త్రివిక్రమ్‌కి కావాలి’ రాసి పంపిస్తారా అని అడిగా! వారంతా రాసి పంపారు. కానీ ఆయనకు ఇంకా ఏదో కావాలనిపించింది. నేను కాస్త వ్యంగ్యంగా, హీరో ఫెయిల్‌ అవుతున్నట్లు ఓ పాట రాసి పంపా. దాన్ని చూసి ఆయన హీరో సెంట్రిక్‌గా, అన్నింటిలోనూ సక్సెస్‌ అవుతున్నట్లు రాయమన్నారు. అంతే.. గంటన్నరలో మళ్లీ రాసి పంపాను. అయినా నా మనసు ఒప్పుకోక మళ్లీ నాలుగు వెర్షన్స్‌ రాసి పంపా. నేను మొదట ఏదైతే రాశానో అదే ఫైనల్‌ చేశారు. ఈ సంభాషణ అంతా సెప్టెంబర్‌ 18న ఫోన్‌లో జరిగింది. 22న పాట షూటింగ్‌ జరిగిపోయింది. 24న త్రివిక్రమ్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.  ‘ఆయన మిమ్మల్ని కలవాలంటున్నారు’ అని!.. కన్ఫర్మ్‌ చేసుకునేందుకు ‘రేలా రేలా’ జానకీరావుకి ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పగానే ‘ఈ మధ్యనే సూరన్న హైదరాబాద్‌ వెళ్లాడు. ఈ పాట కోసమే అనుకుంటా’ అని సూరన్నతో మాట్లాడమన్నారు. అయితే సినిమా బృందం ఆ పాటను కాస్త సీక్రెట్‌ ఉంచమన్నారన్న కారణంతో సూరన్న చెప్పడానికి సంశయించారు. జానకీరావు పట్టుబట్టడంతో ‘సిత్తరాల సిరపడు’ పాట పాడి వచ్చాను’ అని సూరన్న చెప్పగానే చాలా ఆనందించా. అప్పటికే సి.వి.ఆర్‌ శాస్త్రి ఇచ్చిన హింట్‌తో నా పాట సినిమాలో ఉందన్న నమ్మకం కలిగింది. 


‘దూకుడు’లో బ్రహ్మానందం సీన్‌ గుర్తొచ్చింది

పాటకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాక  ‘త్రివ్రికమ్‌ మీతో మాట్లాడతానంటున్నారు’ అని ఆయన ఆఫీస్‌ నుంచి మరోసారి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ తీసుకుని మాట్లాడాను. ‘ఎప్పుడైనా హైదరాబాద్‌ వస్తే మా ఇంటికి కాఫీకి రండి’ అని ఆఫర్‌ చేశారు. అంత పెద్ద డైరెక్టర్‌ ఫోన్‌ చేసి మాట్లాడడం, ఇంటికి రమ్మని ఆహ్వానించడం ఆశ్చర్యంగా అనిపించినా, భరించలేనంత ఆనందం కలిగింది. ‘దూకుడు’ సినిమాలో నాగార్జున గొంతుతో శివారెడ్డి బ్రహ్మానందంకి ఫోన్‌ చేసి మాట్లాడిన సీన్‌ గుర్తొచ్చింది. సెప్టెంబర్‌ 27న ఎల్‌ఐసీ కాన్ఫరెన్స్‌ ఉండడం వల్ల హైదరాబాద్‌ వెళ్లి, అది పూర్తయ్యాక త్రివిక్రమ్‌ని కలిసా. రెండున్నర గంటలపాటు ఆయన నాతో మాట్లాడారు. తర్వాత నా పాటను వినిపించారు. సినిమా పాటల మీద అంత అవగాహన లేకపోవడంతో పాట కాస్త స్లోగా ఉందనిపించింది. ‘సినిమా వాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా’ అనుకున్నా. కానీ ఆ స్లోనెస్‌ పాటకు ఎంత అందం తీసుకొచ్చిందో సినిమా చూశాక తెలిసింది. పాట స్లోగా ఉండడం వల్లే పాటలో ప్రతి పదం జనాలకు చేరువైంది. నేను రాసిన సాహిత్యానికి తమన్‌ చక్కని బాణీలు సమకూర్చారు. సూరన్న, సాకేత్‌ కొమాండూరి  తమ గొంతుతో పాటకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చారు.  సినిమా క్లైమాక్స్‌కు నా పాట కీలకం కావడం ఎంత ఆనందాన్ని కలిగించిందో మాటల్లో చెప్పలేను.

అదే పెద్ద కాంప్లిమెంట్‌...

పాట విన్నవాళ్లు, పాడుకున్న వాళ్లు కవితాత్మకంగా ఉందని చెబుతుంటే ‘అంత పొయిటిక్‌గా నేనేం రాశానా?’ అనిపించింది. ముఖ్యంగా యువత నుంచి వస్తున్న ఆదరణ చూస్తే కడుపు నిండిపోతోంది. ‘అతి తక్కువ టైమ్‌లో అద్భుతమైన పాట ఇచ్చారు’ అని త్రివిక్రమ్‌ అనడమే నాకొచ్చిన పెద్ద కాంప్లిమెంట్‌. అయితే ఇప్పటి వరకూ నా ఏజ్‌ గ్రూప్‌ వాళ్లే నాకు స్నేహితులున్నారు. ఈ పాట రాశాక యువతకు బాగా చేరువయ్యా. చాలామంది ఆ పాటలో కొన్ని పదాలకు అర్థాలు అడుగుతున్నారు. నాటకం వేయాలన్న నా కోరిక ఈ పాటతో తీరింది.



Updated Date - 2020-02-09T06:12:08+05:30 IST