వానా.. రావా!

ABN , First Publish Date - 2022-08-07T05:15:36+05:30 IST

వరుణుడు మొహం చాటేశాడు. కొద్దిరోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి తప్ప.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో వరుణుడు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వేసిన వరినారు మడులు ఎండిపోతుండడంతో.. వాటిని కాపాడుకునేందుకు తాపత్రయం పడుతున్నారు. ఆగస్టు నెల వారం రోజులు గడిచినా.. ఇప్పటివరకు కొన్నిచోట్ల దమ్ములు, ఉబాలు చేపట్టకపోవడం.. ఈ ఏడాది వరికి గండమేనని రైతులు వాపోతున్నారు.

వానా.. రావా!
హరిపురం : బిడిమి ప్రాంతంలో ఎండినపోయిన వరినారు

కరుణించని వరుణుడు
ఎండుతున్న నారుమడులు
బీడు వారుతున్న పొలాలు
ఆందోళనలో రైతులు
(నరసన్నపేట/హరిపురం)

వరుణుడు మొహం చాటేశాడు. కొద్దిరోజులుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి తప్ప.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో వరుణుడు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వేసిన వరినారు మడులు ఎండిపోతుండడంతో.. వాటిని కాపాడుకునేందుకు తాపత్రయం పడుతున్నారు. ఆగస్టు నెల వారం రోజులు గడిచినా.. ఇప్పటివరకు కొన్నిచోట్ల దమ్ములు, ఉబాలు చేపట్టకపోవడం.. ఈ ఏడాది వరికి గండమేనని రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 7.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా సుమారు 5.28 లక్షల ఎకరాల్లో వరి సాగుకు సిద్ధమయ్యారు. 24వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 12వేల ఎకరాల్లో ఇతర వాణిజ్య పంటలు వేశారు. సుమారు 65 హెక్టార్లలో వరినాట్లు వేశారు. మిగతా ఎకరాల్లోక ఎదలు వేశారు. కాగా.. పదిహేను రోజులు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, లావేరు. శ్రీకాకుళం రూరల్‌, ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం, జి.సిగడాం, మందస, వజ్రపుకొత్తురు తదితర మండలాల్లో వరినారు, ఎదలు ఎండిపోతున్నాయి. పొలాలు బీడువారుతున్నాయి. దీంతో ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పైపులతో పొలాల్లో నారుమడులను తడుపుతున్నారు. వరుణుడు కరుణించాలని వేడుకుంటున్నారు.

ఉద్దానంలోనూ అంతే..  
మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల పరిధిలో సుమారు 30 శాతం వరకు ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల్లో ఉబాలు జరగక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాల్లో ఉబాలు వేసినా.. పొలాలు బీడువారాయి. వర్షాలు లేక వరినాట్లు ఎండిపోతున్నాయి. మందస మండలంలో గత నెలరోజుల్లో సాధారణ స్థాయికంటే 20నుంచి 30శాతం వర్షపాతం తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ అధికారుల తెలియజేశారు. వరిపంటకు ఆదిలోనే హంస పాదు ఎరురైందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

 

Updated Date - 2022-08-07T05:15:36+05:30 IST