అమ్మో! వాళ్ల స్ట్రాటజీని లైట్‌ తీసుకోలేం!

ABN , First Publish Date - 2020-03-10T01:52:00+05:30 IST

ప్రతీ పేరున్న స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఏడాదికోసారో రెండు సార్లో - ఓ గొప్ప ఫోన్‌ని రిలీజ్‌ చేస్తుంది.

అమ్మో! వాళ్ల స్ట్రాటజీని లైట్‌ తీసుకోలేం!

ప్రతీ పేరున్న స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఏడాదికోసారో రెండు సార్లో - ఓ గొప్ప ఫోన్‌ని రిలీజ్‌ చేస్తుంది. ఇండస్ట్రీలో అప్పటివరకూ ఉన్న టెక్నాలజీ ని మించి, సరికొత్త ఫీచర్లతో - లేదా ఉన్న వాటిలోనే ఎక్కువ స్థాయి స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్లు తయారవుతాయి.


వీటిని ఫ్లాగ్‌ షిప్‌ (Flagship) ఫోన్లు అంటూ ఉంటాం. ఈ ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్ల రేట్లు ఆకాశంలో ఉంటాయి. అయినా వీటిని జనం ఎగబడి కొంటూనే ఉంటారు. ఫోన్లో కనిపించే గొప్ప ఫీచర్లన్నీ తాము వాడినా వాడకపోయినా, అవి తమకి అవసరం ఉన్నా లేకపోయినా - జనం వీటి పట్ల క్రేజ్‌ ప్రదర్శించడం మనం చూస్తుంటాం. ఎందుకంటే - కంపెనీలు వాటికి ఇచ్చే ప్రచారం అటువంటిది మరి!


అయితే కంపెనీలు లాభాల కోసం మరిన్ని కొత్త దారులు తొక్కుతున్నాయి. తాము ఎంతో ప్రచారం ఇచ్చినా - ఆకాశంలో రేట్లున్న తమ ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్లని కొనలేని జనం అసంతృప్తికి గురవుతుండడాన్ని అవి గమనించాయి. కొనాలనే ఆసక్తి అయితే వాళ్ల మనసుల్లో నాటగలుగుతున్నాయి కంపెనీలు. కానీ తీరా చూస్తే ఆ కస్టమర్ల జేబులో డబ్బు కొంచెమే ఉంటుంది. పాపం, వాళ్ల ఆర్థిక స్తోమత అదీ! కాబట్టి క్రియేట్‌ చేసిన ఇంట్రస్ట్‌ని ఆధారంగా చేసుకుని కస్టమర్ దగ్గరున్న ఆ నాలుగు డబ్బులూ లాగేయాలంటే ఏం చేయాలి? దానికో మార్గం కనిపెట్టాయి కంపెనీలు. అదే లైట్‌ వెర్షన్‌ ( Light కాదు, Lite ) టెక్నిక్‌..


ఇంతకీ ఈ లైట్‌ వెర్షన్‌ టెక్నిక్‌ ఏంటి?  సింపుల్‌. ఉదాహరణకి ఓ గొప్ప బ్రాండ్ - తను రిలీజ్‌ చేయబోయే ఓ గొప్ప మోడల్‌ పేరుని జనంలోకి బాగా తీసుకుపపోతుంది. జనం దాని ఫీచర్లు చూసి మురిసిపోతారు. దాని రేటు అరవయ్యో నలభయ్యో వేలుంటుంది. కొనగలిగినవాళ్లు కొంటారు. కొనలేని వాళ్లు - రేటు చూసి అసంతప్తి తో నోళ్లు వెళ్లబెట్టి చూసేలోపు - అదే మోడల్‌ పేరుతో ఇంకో చిన్న ఫోన్‌ రిలీజవుతుంది. దానికి అసలు మోడల్‌ పేరే పెడతారు. కానీ చివర్లో లైట్‌ ( Lite ) అని ఓ ట్యాగ్ తగిలిస్తారు. ఆ మెయిన్‌ ఫోన్‌లో ఉన్న  ఫీచర్లను - బాగా క్రిపుల్ చేసి ( తగ్గించి ), చిన్న ఫోన్‌ తయారుచేస్తారు.  ప్రాసెసర్‌ పవర్, ఇంటర్నల్‌ మెమొరీ, ర్యామ్‌, స్క్రీన్ సైజ్‌ - ఇలా ఏది వీలైతే అది తగ్గించి పారేస్తారు.  ఆ విధంగా ఆకాశంలో ఉన్న ఫోన్‌ రేటుని కాస్త అందుబాటులోకి తెచ్చి చూపిస్తారు. ఇంకేం? కస్టమర్‌ ఆలోచిస్తాడు.  బ్రాండ్‌ చూస్తే పెద్దది.. మోడల్‌ చూస్తే కొత్తది.. ప్రచారంతో మార్కెట్లో క్రేజ్‌ తెచ్చుకున్న పేరు! పైగా తన స్తోమతకి తగినట్టు - అందుబాటు ధరలో వస్తోంది. మరింకేం? మధ్యతరగతే అయినా - మనిషి తన జేబు గుల్ల చేసుకోవడం ఖాయం! కంపెనీకి మాత్రం పెద్ద ఖర్చుండదు. మెయిన్‌ ఫోన్‌కి ఖర్చయినదాంట్లో కేవలం కొంత ఫ్రాక్షన్‌ ఖర్చుపెడితే చాలు. వాళ్లు ఫోన్‌ తయారుచేసేయగలుగుతున్నారు.


ప్రస్తుతం ఇదే పెద్ద పెద్ద ఫోన్‌ కంపెనీలు అనుసరిస్తున్న స్ట్రాటజీ! అసలు చాలా ఫోన్‌ కంపెనీలు.. తమ ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్ల మెయిన్‌ వెర్షన్ల అమ్మకాల కంటే -  ఈ లైట్‌ వెర్షన్ల ఆధారంగానే  జనాన్నించి ఎక్కువ డబ్బులాగుతున్నాయట. ఇటీవల ఒక మార్కెటింగ్‌ సర్వే ఈ విషయాన్నే పరిశోధించి చెప్పింది. అంటే - అసలు ఫోన్ల కంటే ఈ కొసరు ఫోన్లతోనే కస్టమర్లకి రంగు పడుతోందన్నమాట! కాబట్టి ఈ సారి ప్రచారాలకి భ్రమపడిపోయి లైట్‌ వెర్షన్లు కొనేముందు - కాస్త ఆగిచూడండి. ఆ లైట్‌ వెర్షన్లో ఎన్ని ఫీచర్లు క్రిపుల్‌ అయ్యాయో!

Updated Date - 2020-03-10T01:52:00+05:30 IST