Sri Lanka crisis: శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందన

ABN , First Publish Date - 2022-07-20T00:36:04+05:30 IST

శ్రీలంక సంక్షోభం (Sri Lanka crisis) వల్ల ఎదురయ్యే పర్యవసానాల

Sri Lanka crisis: శ్రీలంక సంక్షోభంపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందన

న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభం (Sri Lanka crisis) వల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తమవడం సహజమేనని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (S Jaishankar) అన్నారు. ఇది అత్యంత సమీప పొరుగు దేశానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఈ సంక్షోభంపై చర్చించేందుకు మంగళవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 


శ్రీలంక మనకు అత్యంత సమీపంలోని పొరుగు దేశమని, అందువల్ల అక్కడి సంక్షోభం ప్రభావం మనపై ఏ విధంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవడం సహజమేనని జైశంకర్ తెలిపారు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేవన్నారు. ఇది అత్యంత తీవ్రమైన సంక్షోభమని తెలిపారు. మత్స్యకారులకు సంబంధించిన సమస్య ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఈ సమావేశంలో మత్స్య శాఖ మంత్రి (Fisheries Minister) కూడా పాల్గొన్నారన్నారు. తప్పుడు సమాచారంతో శ్రీలంక, భారత దేశం మధ్య పోలికలు తేవడాన్ని మనం ఈ మధ్య గమనిస్తున్నామన్నారు. శ్రీలంక పరిస్థితులు మన దేశంలో కూడా వస్తాయని ప్రచారం చేస్తున్నారన్నారు. 


ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షత వహిస్తారని మొదట్లో ప్రకటించినప్పటికీ, ఆమె హాజరుకాలేకపోయారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. 


భారత్ సాయం

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రజల నిరసనలను తట్టుకోలేక దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) తన పదవికి రాజీనామా చేసి, సింగపూర్ (Singapore) పారిపోయారు. ఆయన స్థానంలో దేశాధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు బుధవారం జరుగుతాయి. కష్టాల్లో ఉన్న శ్రీలంకకు భారత దేశం సాయపడుతోంది. 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను రుణ ఒప్పందంలో భాగంగా ఇచ్చింది. 3.8 బిలియన్ డాలర్లను శ్రీలంకకు ఇచ్చినట్లు జైశంకర్ గత వారం చెప్పారు. 


Updated Date - 2022-07-20T00:36:04+05:30 IST