ఉపాధికి దూరం

ABN , First Publish Date - 2020-04-08T12:16:30+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో చిరు వ్యాపారులకు పెద్ద కష్టమే వచ్చింది. ప్రతిరోజూ దుకాణం తెరవనిదే.. స్టాల్‌ తీయనిదే కాలం గడవని వారు

ఉపాధికి దూరం

చిరు వ్యాపారులకు కష్టం

మూతపడిన ఐస్‌ ఫ్యాక్టరీలు, జ్యూస్‌ సెంటర్లు

వేసవి వ్యాపారమంతా బంద్‌


(పార్వతీపురం): లాక్‌డౌన్‌ ప్రభావంతో చిరు వ్యాపారులకు పెద్ద కష్టమే వచ్చింది. ప్రతిరోజూ దుకాణం తెరవనిదే.. స్టాల్‌ తీయనిదే కాలం గడవని వారు జిల్లా వ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. గత నెల 22 నుంచి ఉపాధి లేక వారంతా దిగులు చెందుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంపైనే ఆధారపడి వ్యాపారాలు చేసుకొనే ఐస్‌ కర్మాగారాలు, జ్యూస్‌ కేంద్రాలు, ఐస్‌ను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించే చిరు వ్యాపారులు ఈ ఏడాది ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం వంటి ప్రధాన నగరాలతో పాటు చీపురుపల్లి, గజపతినగరం, రామభద్రపురం, నెల్లిమర్ల, ఎస్‌.కోట తదితర ప్రాంతాల్లో వందలాది ఐస్‌ తయారీ కర్మాగారాలు ఉన్నాయి.


ఈ కర్మాగార కార్మికుల సేవలను వేసవిలోనే ఎక్కువగా యాజమాన్యాలు వినియోగించుకుంటాయి. మిగిలిన కాలాల్లో పెద్దగా పని ఉండదు. విద్యుత్‌ చార్జీలు, ఫ్యాక్టరీ నిర్వహణకు కూడా ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అన్నిచోట్లా 10 నుంచి 20 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ వేసవి కాలంలో జరిగే వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన కాలంలో నష్టం వచ్చినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో లాక్‌డౌన్‌ కారణంగా ఐస్‌ కర్మాగారాలు మూతపడ్డాయి. యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1700 మంది కార్మికులు 150 ఐస్‌ కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. 


వేసవిలో శీతల పానియాల తయారీ దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న వారు జిల్లాలో వేలాది కుటుంబాలు ఉన్నాయి. జూస్‌ సెంటర్లు, లస్సీ కేంద్రాలు, నిమ్మ సోడా తయారీ తోపుడు బళ్లు, ఇలా వివిధ రకాల వ్యాపారులు వేసవిలోనే చేసుకుంటూ ఏడాది పాటు జీవనం సాగించే వేలాది కుటుంబాలకు ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి కాలంలో ఐస్‌లను అమ్ముకొని జీవనం సాగించే అనేక కుటుంబాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వేసవిలో ఐస్‌లు విక్రయించే వ్యాపారులు నేటికీ జిల్లాలో వందలాది మంది ఉన్నారు. వేసవిలోనే చేపట్టే వ్యాపారాల్లో కర్భూజా మరొకటి.


వచ్చే పంటను వ్యాపారులు లెక్క కట్టుకుని ముందుగానే కొనుగోలు చేసుకొనే పరిస్థితి జిల్లాలో ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ వ్యాపారులు అనేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం పెట్టుబడి అయినా దక్కని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లాక్‌డౌన్‌తో వేసవిలో ఉపాధి కోల్పోయిన వారు అనేక రంగాల్లో ఉన్నారు. 

Updated Date - 2020-04-08T12:16:30+05:30 IST