వేసవిలో దుక్కి దున్నడం ఎంతో మేలు

ABN , First Publish Date - 2022-05-26T05:30:00+05:30 IST

వేసవిలో భూమి ఖాళీగా ఉండే సమయంలో బాగా లోతుగా నాగళ్లు లేదా ట్రాక్టర్లతోగానీ దుక్కి దున్నడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీంతో కీటకాల కోశస్థ దశలు, కలుపు మొక్కల దుంపలు, వేర్లు సూర్యకిరణాలకు మాడి మసైపోతాయి.

వేసవిలో దుక్కి దున్నడం ఎంతో మేలు
వర్షాకాలం పంట వేయడానికి దుక్కి దున్నుతున్న రైతు

  • కలుపు, చీడపీడల నివారణకు దోహదం 
  • భూమి కోత తగ్గడంతోపాటు నీటి నిల్వకు ఆస్కారం

తాండూరు రూరల్‌, మే 26 : వేసవిలో భూమి ఖాళీగా ఉండే సమయంలో బాగా లోతుగా నాగళ్లు లేదా ట్రాక్టర్లతోగానీ దుక్కి దున్నడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దీంతో కీటకాల కోశస్థ దశలు, కలుపు మొక్కల దుంపలు, వేర్లు సూర్యకిరణాలకు మాడి మసైపోతాయి. తర్వాత సాగుచేసే పైరుకు కలుపు, చీడపీడల బెడద తగ్గుతుంది. తొలకరి వర్షాన్ని త్వరగా పీల్చుకోవడం ద్వారా నేల త్వరగా పదునుకు వస్తుంది. దీంతో విత్తనం నాటుకోవడానికి వీలవుతుందని వ్యవసాయ శాస్త్రవ్తేలు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

వేసవి దుక్కి,  పొలం చదును చేయడంలాంటి పొలం పనులు వాలుకు అడ్డంగా నిర్వహించడం వల్ల వర్షాలకు నేలకోత తగ్గటమేకాక, వాననీరు భూమిలో  ఇంకి  పదును పెరుగుతుంది.

భూమి ఖాళీగా ఉండే వేసవిలో మట్టి నమూనాలు తీసి భూసార పరీక్షలు చేయించాలి. ఆ తర్వాత ఫలితాలననుసరించి పోషకాలను సమర్ధవంతంగా వినియోగిస్తే సేద్యం లాభాదాయకంగా  ఉంటుంది.

మనకు ఎంతో ప్రయోజనకరమైన అద్భుత వృక్షం వేపచెట్టు. కాగా, దాని నుంచి రాలిన వేపకాయలను పోగు చేసుకుని వేపకాయలు, గింజల నుంచి కషాయం తీసి, స్ర్పే చేస్తే పైర్లను ఆశించే వివిధ రకాల రసం పీల్చు పురుగుల ఉధృతిని అరికట్టడానికి బాగా ఉపయోగపడతాయి.

పంట ధాన్యాన్ని, కాయల్ని కోసిన తర్వాత ఆయా పంటల కాండం, ఆకులు మొదలగు అవశేషాలను ఒక గుంట తీసి, అందులో వేసి కుళ్లనిచ్చిన తర్వాత పొలాల్లో వేసుకోవాలి. దీంతో భూభౌతిక స్థితి మెరుగవ్వడంతోపాటు పంటల దిగుబడులు పెరుగుతాయి.

 మెట్ట భూములు కలిగిన రైతుల మాదిరిగానే పల్లం భూముల రైతులు కూడా వేసవిలో లోతుగా దుక్కి దున్నించుకుంటే ఆశించిన ఫలితాలు, ప్రయోజనాలు పొందగలుగుతారు.

మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష చేయించుకుని, ఆ ఫలితాలను అనుగుణంగా పోషకాలను వాడితే భూసార పరిరక్షణతోపాటు, అధిక దిగుబడులు  పొందేందుకు అవకాశం ఉంటుంది.

విత్తనాల సేకరణకు కూడా ఇదే అనువైన తరుణం. అంతేకాక, వరి తర్వాత ఏవైనా అపరాలు గానీ, జనుము, జీలుగ, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైరుగానీ వేయాలి. అనంతరం అవి పుష్పించకముందే దుక్కిని దున్నేసినట్లయితే భూసారం కాస్త మెరుగుపడుతుంది.

తొలకరి వర్షాలు పడగానే దుక్కిని దున్ని, జీలుగ లాంటి పచ్చిరొట్ట  పైరును వేస్తే వరినాట్లు వేసే నాటికి 4 నుంచి 5 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. ఆ తర్వాత సులభంగా దమ్ము చేసుకోవచ్చు.

ఎకరానికి 20 నుంచి 25 కిలోల జీలుగ విత్తనాలు చల్లటం ద్వారా జీలుగ మొక్కలు పీలగా, మృదువుగా పెరిగి తేలికగా దమ్ము చేసుకోవడానికి వీలవుతుంది. కాగా, తాండూరు మండల పరిధిలోని బెల్కటూర్‌, చంద్రవంచ, కరన్‌కోట్‌, ఓగీపూర్‌, మల్కాపూర్‌, సంగెంకలాన్‌, కోటబాస్పల్లి, మిట్టబాస్పల్లి ఉద్దండాపూర్‌, గుంతబాస్పల్లి, కొత్లాపూర్‌, సంకిరెడ్డిపల్లి, జినుగుర్తి తదితర గ్రామాల్లో నల్లరేగడి భూములు అధికంగా ఉన్నాయ. దీంతో ఈ పొలాల్లో దుక్కులు దున్నుకోవడానికి మంచి అవశాలుంటాయని వ్యవసాయాధిరారులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-05-26T05:30:00+05:30 IST