అది బెంగాల్‌ టైగర్‌

ABN , First Publish Date - 2022-07-28T05:00:26+05:30 IST

పులి సంచారం రెండు మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రివేళ సంచరిస్తూ బెంబేలెత్తిస్తోంది. పాదముద్రలను చూసి జనం హడలెత్తిపోతున్నారు.

అది బెంగాల్‌ టైగర్‌
పులి భయంతో కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్న పణుకువానివలస గ్రామస్థులు

పాద ముద్రలను గుర్తించిన అటవీ అధికారులు
రెండు మండలాల ప్రజల్లో భయం.. భయం

పులి సంచారం రెండు మండలాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాత్రివేళ సంచరిస్తూ బెంబేలెత్తిస్తోంది. పాదముద్రలను చూసి జనం హడలెత్తిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులి సంచారాన్ని ధ్రువీకరించారు. కొత్తవలస ప్రాంతంలో తాజాగా తిరుగాడుతున్న పులి బెంగాల్‌ టైగర్‌ జాతికి చెందినదని వారు చెబుతున్నారు. పరిసర గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే మెంటాడలో కూడా ఇదే పులి సంచరిస్తోందా? అని మాత్రం నిర్ధారణకు రాలేకపోతున్నారు.

లక్కవరపుకోట(కొత్తవలస)/మెంటాడ, జూలై 27: కొత్తవలస మండలం దిగువ ఎర్రవాణిపాలెం నుంచి చీడివలస, సుందరయ్యపేట, కోటవానిపాలెం మీదుగా వియ్యంపేట తోటల్లోకి పులి ప్రవేశించినట్లు జిల్లా అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ కేవీఎన్‌ రాజు తెలిపారు. పులి వెళ్తున్న మార్గంపై అటవీ శాఖ ట్రాకర్‌ అమర్నాథ్‌ను అడిగి తెలుసుకున్నారు. పాదముద్రలను బట్టి బెంగాల్‌ జాతి టైగర్‌గా నిర్ధారణకు వచ్చారు. ఇది ఒకచోట ఉండదని, రాత్రి వేళ తిరుగుతూ ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సంచరిస్తుంటుందని, కనీసం ఆరు కిలోమీటర్ల దూరంప్రయాణం చేస్తుందన్నారు. కాకినాడ, అనకాపల్లి ప్రాంతంలో చిక్కాల్సి ఉందని, అక్కడ తప్పించుకొని ఇటువైపు వచ్చిందని వెల్లడించారు. ఇవి అడవిలో వేటకు వెళ్లినట్టు మైదాన ప్రాంతంలో వేటాడవని చెప్పారు. ఏపీలో 43 పైగా బెంగాల్‌ టైగర్‌ జాతి పులులు ఉన్నాయని తెలిపారు. కాగా పులి మారిక కొండల్లోకి వెళ్లే యోచనలో ఉన్నట్టు ట్రాకర్‌ అమర్నాథ్‌ అంచనా వేస్తున్నారు.

 కొత్తవలస మండలంలో పులిసంచరించడంపై జిల్లా అటవీశాఖ అధికారులు అప్రమత్తమై మండలస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వియ్యంపేట పరిసరాల్లో పులి ఉన్నందున దేవాడ, వియ్యంపేట, వీబీ పురం, మశివాణిపాలెం, కోటవానిపాలెం, తుమ్మికాపల్లి, కరిచిన్నయ్యపాలెంప్రజలను అప్రమత్తం చేయాలని కొత్తవలస పోలీసులకు సూచించారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు కొత్తవలస-దేవరాపల్లి వెళ్లేమార్గంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు. అటవీశాఖ అధికారులు ప్రసాదరావు, కేశవ, రాజేశ్వరి తదితరులు కూడా పులి అడుగులను బుధవారం పరిశీలించారు.


పణుకువానివలసలో పాదముద్రలు
మెంటాడ మండలం పణుకువానివలస వద్ద పులి పాదముద్రలను అటవీశాఖ సేకరించింది. గ్రామస్థుల సమాచారంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది కొన్నిచోట్ల పులి అడుగులను పరిశీలించారు. ఏప్రిల్‌లో చింతలవలస సమీపంలో చిరుత పులిని కొందరు చూశారు. అప్పట్లో కూడా అటవీశాఖాధికారులు పాదముద్రలు పరిశీలించి నిర్ధారించారు. అనంతసాగరం సమీపంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు పులి అధికారులు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆ తర్వాత పులి సంచారం గురించి మర్చిపోయారు. ఈ తరుణంలో సోమవారం రాత్రి జీటిపేట పంచాయతీ మధుర పణుకువానివలస సమీపాన పులి పాదముద్రలను గుర్తించారు. రాత్రి పశువులు బిగ్గరగా అరిచాయని కొందరు చెబుతున్నారు. మంగళవారం ఉదయం పశువుల శాల సమీపంలో పులి పాదముద్రలు ఉన్నట్లు అటవీశాఖకు ఫొటోలు పంపారు. ఫారెస్ట్‌సెక్షన్‌ అధికారి పాపారావు బుధవారం సిబ్బందితో వచ్చి పులి సంచరించిన ప్రదేశానికి వెళ్లి నమూనాలను సేకరించారు. అయితే మంగళవారం నుంచి పణుకువానివలస, రాభ, రొంపల్లి గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గ్రామస్థులు గుంపుగా చేరి పులి అడుగుల వెంబడి కర్రలు పట్టుకుని వెళ్తూ పెద్దపెద్ద కేకలు వేసి శబ్దాలు చేశారు. ఆయా గ్రామాలకు ఆనుకొని కొండలు ఉన్నాయి. అటువైపు పులి వెళ్లి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం తెలిసి రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పాదముద్రలు పరిశీలిస్తున్నామని ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పాపారావు చెప్పారు.



Updated Date - 2022-07-28T05:00:26+05:30 IST