చిన్న రాకెట్‌.. పెద్ద మార్కెట్‌

ABN , First Publish Date - 2022-08-06T06:54:24+05:30 IST

బాహుబలి లాంటి (జీఎస్‌ఎల్వీ-మార్క్‌3) 630 టన్నుల బరువు కలిగిన రాకెట్లను అలవోకగా అంతరిక్షంలోకి పంపిస్తున్న ఇస్రో ఇప్పుడు 120 టన్నుల బుల్లి రాకెట్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) వైపు గురిపెట్టింది.

చిన్న రాకెట్‌.. పెద్ద మార్కెట్‌

బాహుబలి నుంచి బుల్లి రాకెట్‌ వైపు

అంతరిక్ష వాణిజ్యం దిశగా ఇస్రో అడుగులు


బాహుబలి లాంటి (జీఎస్‌ఎల్వీ-మార్క్‌3) 630 టన్నుల బరువు కలిగిన రాకెట్లను అలవోకగా అంతరిక్షంలోకి పంపిస్తున్న ఇస్రో ఇప్పుడు 120 టన్నుల బుల్లి రాకెట్‌ (ఎస్‌ఎ్‌సఎల్వీ) వైపు గురిపెట్టింది. ప్రపంచ అంతరిక్ష వాణిజ్యాన్ని గుప్పిటపట్టే ప్రయత్నం చేస్తోంది.  ఈ క్రమంలోనే తొలిసారిగా స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్వీ)ను ఈ నెల 7న రోదసిలోకి పంపిస్తోంది. ఈ సందర్భంగా సరికొత్త బుల్లి రాకెట్‌పై ప్రత్యేక కథనం...



శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 5: 43 ఏళ్ల క్రితం 1979లో ఇస్రో 17 టన్నుల శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్వీ)తో ఉపగ్రహాలను రోదసిలోకి పంపే కసరత్తు ప్రారంభించింది. అంచెలంచెలుగా 40 టన్నుల ఎఎ్‌సఎల్వీ, 320 టన్నుల పీఎ్‌సఎల్వీ, 414 టన్నుల జీఎ్‌సఎల్వీ, 630 టన్నుల జీఎ్‌సఎల్వీ-మార్క్‌3 రాకెట్లను ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ఇలా ఈ రాకెట్ల ద్వారా ఈ 43 ఏళ్లల్లో 427 ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసింది. వీటిలో 345 విదేశీ ఉపగ్రహాలే కావడం విశేషం. అయితే పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌(పీఎ్‌సఎల్వీ) రాకెట్‌ అందుబాటులోకొచ్చిన తర్వాతే ఇస్రో ప్రయోగాల్లో వేగం, కచ్చితత్వం పెరిగాయి. విదేశీ ఉపగ్రహాలను పీఎ్‌సఎల్వీతోనే సురక్షితంగా కక్ష్యల్లోకి చేరవేసింది. ప్రపంచంలో కారుచౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసే దేశంగా పేరొందింది. ఇప్పుడు మరింత చౌకగా, మరింత వేగంగా విదేశీ ఉపగ్రహాలను ప్ర యోగించే దిశగా అడుగులేస్తోంది. దీనికోసం పీఎస్‌ఎల్వీ తరహాలోనే అతితక్కువ ఖర్చుతో ఎస్‌ఎస్‌ఎల్వీని రూపొందించింది.


  • 2016లో బెంగళూరులోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అ డ్వాన్డ్‌ స్టడీ వ్యవస్థాపకులు రాజారామ్‌ రాజప్ప చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు చిన్న రాకెట్‌ అవసరాన్ని గుర్తించి ఇస్రోకు నివేదించారు. అదే ఏడాది నేషనల్‌ స్పేస్‌ సైన్స్‌ సింపోజియంలో అప్పటి ఇస్రో ఎల్‌పీఎ్‌ససీ సెంటర్‌ డైరెక్టర్‌(ప్రస్తుత ఇస్రో చీఫ్‌) ఎస్‌.సోమనాథ్‌ చిన్న రాకెట్‌ అవసరాన్ని ప్రస్తావించి.. తయారీకి శ్రీకారం చుట్టేలా చేశారు. 
  • 2018లో 4 దశల మోటార్లతో ఈ రాకెట్‌ డిజైన్‌ను విక్రమ్‌ సారాబాయి స్పేస్‌ సెంటర్‌ రూపొందించింది. 
  • 2020 నుంచి ఈ రాకెట్‌కు వివిధ భూస్థిర పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం రోదసిలోకి ప్రయోగిస్తున్నారు. 
  • ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ తయారీ ప్రయోగాల కోసం రూ.169 కోట్లు ఖర్చు చేశారు. రూ.30 కోట్లతో ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ను తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు. 

జీఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీలతో పోలిస్తే.. 

  • జీఎస్‌ఎల్వీ రాకెట్‌ తయారీకి రూ.130 కోట్ల నుండి 200 కోట్ల వరకు ఖర్చయితే.. ఎస్‌ఎస్‌ఎల్వీకి రూ.30 కోట్లే అవుతుంది. 
  • పీఎస్‌ఎల్వీ రాకెట్‌ తయారీకి 3 నుంచి 4 మాసాలు పడుతుంది. ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌ తయారీకి 7 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది.  
  • పీఎ్‌సఎల్వీ రాకెట్‌ అనుసంధానానికి 35 రోజులు పడుతుంది. ఎస్‌ఎ్‌సఎల్వీకి 24 నుంచి 74 గంటలు సరిపోతాయి.
  • పీఎస్‌ఎల్వీ ప్రయోగానికి 600 మంది అవసరం. ఎస్‌ఎస్‌ఎల్వీ ప్రయోగాన్ని ఆరుగురితో నిర్వహించవచ్చు. 

భవిష్యత్తులో ప్రైవేట్‌ రంగం ద్వారా

ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ తయారీతోపాటు ప్రయోగ సన్నాహాలు, ఇస్రో వాణిజ్య విభాగం ఎన్‌ఎ్‌సఐఎల్‌ (న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశీయ ప్రైవేట్‌ రంగ సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఈ రాకెట్‌ను తయారు చేయించి ఇస్రో ద్వారా ఎన్‌ఎస్‌ఐఎల్‌ ప్రయోగించనుంది. ఎస్‌ఎస్‌ఎల్వీని షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ప్రయోగిస్తున్నా, రాబోయే రోజుల్లో ప్రత్యేక వేదికలు సమకూర్చుకుంటున్నారు. దీనికి ఎస్‌ఎస్‌ఎల్‌సీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌) నిర్మాణం షార్‌లో జరుగుతోంది. తమిళనాడులోని కులశేఖర పట్టణంలో నిర్మిస్తున్న ప్రయోగ కేంద్రం సిద్ధమైన తదుపరి ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్లను అక్కడి నుంచే ప్రయోగిస్తారని సమాచారం. 


బుల్లి రాకెట్‌లో చిన్నారి శాస్త్రవేత్తల శాటిలైట్‌ 

ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి థీమ్‌.. అంతరిక్షంలో మహిళలు. దానికి అనుగుణంగా చెన్నైకి చెందిన స్పేస్‌కిడ్జ్‌ ఇండియా మనదేశ బాలికలతో ఆజాదీశాట్‌ అనే ఉపగ్రహాన్నే తయారు చేయించింది. దేశవ్యాప్తంగా 75 పాఠశాలల్లో 8-12వ తరగతి చదివే 750 మంది విద్యార్థినులను ఎంపిక చేసింది. వారికి ఉపగ్రహ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. హేక్టావేర్‌ టెక్నాలజీ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత క్రింద రూ.58 లక్షలు ఈ బృహత్కార్యానికి సమకూర్చింది. ఎస్‌ఎ్‌సఎల్వీ రాకెట్‌లో 8 కిలోలున్న ఆజాదీశాట్‌ను కక్ష్యలోకి చేరవేయనున్నారు.


తెలుగురాష్ట్రాలకు చెందిన 8 పాఠశాలల విద్యార్థులు ఈ ఉపగ్రహ తయారీలో పాల్గొన్నారు. ఏపీలోని తిరుపతి జిల్లా నారాయణవనం జడ్పీ బాలికోన్నత పాఠశాల, తూర్పుగోదావరి జిల్లా వీరలంకపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులం, అనంతపురం జిల్లాలోని కురుగుండ ఏపీఎ్‌సడబ్ల్యూఆర్‌ స్కూల్‌ విద్యార్థులు తయారీలో భాగస్వాములయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులోని జడ్పీహెచ్‌ఎ్‌స బాలికోన్నత పాఠశాల, సికింద్రాబాద్‌లోని ఎస్‌టీ ఫ్రాన్సిస్‌ బాలికోన్నత పాఠశాల, వరంగల్‌ జిల్లా గుర్జకుంటలోని జడ్పీహెచ్‌ఎ్‌స ఎండి చెరియల్‌ స్కూల్‌, ఖమ్మం జిల్లా ఎర్రుపాళెంలోని టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఎ్‌స-జూనియర్‌ కాలేజీ,  హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎ్‌స స్కూల్‌ విద్యార్థులు పాలుపంచుకున్నారు. 


ఇస్రో తొలి ఎస్‌ఎస్‌ఎల్వీ ప్రయోగానికి శుక్రవారం రిహార్సల్స్‌ ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం ఈ రాకెట్‌ను ప్రయోగిస్తారు. ప్రథమ ప్రయోగవేదికపై ఉన్న రాకెట్‌కు షార్‌ జీరో పాయింట్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి 8 గంటలకోసారి రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-08-06T06:54:24+05:30 IST