ముంబై : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల పాత్రపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) ఏర్పాటు చేసిన సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (Udhav Thackery) హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. జూన్ 15న ఢిల్లీలో ఈ సమావేశం జరగబోతుండగా, అదే సమయంలో థాకరే అయోధ్య పర్యటనలో ఉంటారని తెలుస్తోంది.
ఎన్నికల కమిషన్ ప్రకటన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 18న జరుగుతుంది. ఈ ఎన్నికల విషయంలో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు మమత బెనర్జీ ఈ నెల 15న న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను (మొత్తం 22 మందిని) ఆమె ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఢిల్లీలో జూన్ 15న జరిగే సమావేశానికి ఉద్ధవ్ థాకరేకు ఆహ్వానం అందిందని చెప్పారు. తాము ఆ రోజున అయోధ్యలో ఉంటామని, అందువల్ల తమ పార్టీకి చెందిన ప్రముఖ నేత ఒకరు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.
ఉద్ధవ్ అయోధ్య పర్యటన గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. మమత బెనర్జీ ఆహ్వానించినవారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణకు గొప్ప అవకాశమని మమత తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వాములవడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలకు వీలుకలుగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి