Uttar Pradesh Electios Result: 2017 ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందా..?

ABN , First Publish Date - 2022-03-10T13:03:25+05:30 IST

కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Uttar Pradesh Electios Result: 2017 ఫలితాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందా..?

లక్నో: కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అత్యధిక అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కలిగి ఉంది. 403 అసెంబ్లీ, 80 లోక్‌సభ స్థానాలు యూపీ సొంతం. అందుకే ఈ రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే యూపీలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి దేశం మొత్తం ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ రాష్ట్రంలో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది కేవలం 47 సీట్లకు పరిమితమైన బీజేపీ 2017లో ఏకంగా 312 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. దీంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను సీఏం పీఠంపై కూర్చొబెట్టింది. 


అటు అంతకుముందు అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) 224 స్థానాల నుంచి కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్‌పీ) కూడా 80 స్థానాల నుంచి 19 స్థానాలకు పడిపోయింది. రెండేళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 62 స్థానాలు కైవసం చేసుకుని తనకు తిరిగేలేదని మరోసారి నిరూపించింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా వ్యూహం బాగా పని చేయడంతో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. ఇక 2017 ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా చాలా వరకు నిజం అయ్యాయి. ముఖ్యంగా దైనిక్ భారత్(309), టూడేస్ చాణక్య(285), యాక్సిస్(251-279) వంటి పోలింగ్ ఏజెన్సీలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసలు ఫలితం 312కు దగ్గరగా రావడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే 2017లో బీజేపీ హవా కొనసాగింది. అయితే, 2022 ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందా? యూపీలో బీజేపీ మళ్లీ గెలుస్తుందా? లేక ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ చేతికి అధికారం వెళ్తుందా? బీఎస్పీ కింగ్‌మేకర్ కానుందా? ఈ ప్రశ్నలన్నింటీకి మరికొన్ని గంటల్లోనే సమాధానం రానుంది. 


అంతకంటే ముందు ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే పట్టం కట్టడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. మళ్లీ బీజేపీదే అధికారమని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చేశాయి. సీట్ల పరంగా సమాజ్‌వాదీ పార్టీ గత ఎన్నికల కంటే ఈ సారి భారీగా పుంజుకున్నా.. సీఎం కుర్చీ మాత్రం అఖిలేశ్‌కు అందని ద్రాక్షేనని చెప్పాయి. ఇక మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. అతి కష్టమ్మీద రెండంకెల సీట్లు తెచ్చుకుంటుందని, హస్తం పార్టీకైతే అది కూడా కష్టమేనని వెల్లడించాయి. అయితే, ఆత్మసాక్షి అనే సంస్థ మాత్రం విభిన్నమైన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను విడుదల చేసింది. యూపీలో బీజేపీ 138-140 సీట్లతో సరిపెట్టుకుంటుందని వెల్లడించింది. అటు ఎస్పీ కూటమికి 235-240 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, యూపీలో అధికారం చేపట్టేందుకు కావాల్సిన సీట్లు 202. ఈ మ్యాజిక్ మార్క్‌ను అందుకున్న పార్టీ యూపీ గద్దె ఎక్కుతుంది. ఈ మ్యాజిక్ ఫీగర్‌ను ఈసారి కూడా బీజేపీ చాలా ఈజీగా అందుకుంటుందనేది తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న మాట. మరి చూడాలి.. 2017 మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? లేక అవి తారుమారై యూపీలో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగులుతుందా? ఇది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడక తప్పదు.  

Updated Date - 2022-03-10T13:03:25+05:30 IST