మోదీకి ప్రత్యామ్నాయం సాధ్యమా?

ABN , First Publish Date - 2021-04-07T05:44:08+05:30 IST

భారత దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై, ప్రజాస్వామ్యంపై భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన దాడులను ఎదుర్కొనేందుకు....

మోదీకి ప్రత్యామ్నాయం సాధ్యమా?

భారత దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య స్ఫూర్తిపై, ప్రజాస్వామ్యంపై భారతీయ జనతా పార్టీ, మోదీ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన దాడులను ఎదుర్కొనేందుకు భావసారూప్యత గల పార్టీలన్నీ ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాసిన సమయం సంగతి ఎటున్నా, ఆ లేఖలో ఆమె పేర్కొన్న అంశాలన్నిటిపై ఇప్పుడు దేశంలో చర్చ జరుగుతోంది. పశ్చిమబెంగాల్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా మమతా బెనర్జీ భారతీయ జనతాపార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారనడంలో సందేహం లేదు. ఒక జాతీయ పార్టీ సర్వశక్తులొడ్డి రంగంలోకి దిగి తూర్పున ఉన్న ఒక రాష్ట్రంపై అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న తీరు చరిత్ర పుటల్లో ఒక దండయాత్రనో, అశ్వమేధపర్వాన్నో తలపిస్తోంది. ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మమతా బెనర్జీ దేశంలో ఇతర బిజెపి పార్టీలకు సంకేతం పంపారంటే ఎన్నికల తదనంతర ఘట్టానికి సమాయత్తం కావాలని సూచిస్తున్నారన్నట్టే. 2019 సార్వత్రక ఎన్నికల ముందు కూడా ఆమె ఆ ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఒక విఫల యత్నం చేశారు. నిజానికి మమతా బెనర్జీ కంటే ముందుగానే బిజెపి ఉధృతిని, ఊపును దేశంలో ఇతర పార్టీలకంటే ముందుగా గమనించి వివిధ రాష్ట్రాలకు వెళ్లి చర్చలు సాగించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేశారు. కాని బిజెపి విజృంభణ శక్తిని తక్కువ అంచనా వేయడం, తమను బిజెపి ఏమీ చేయలేదనే ధీమా ఉండడం వల్ల కనీసం ప్రాంతీయ పార్టీలన్నా కలిసికట్టుగా కార్యాచరణ చేయాలన్న అభిప్రాయాన్ని ఆచరణలో పెట్టలేకపోయారు. ఇప్పుడు మమతా బెనర్జీ తన చాపక్రిందికి నీరు వస్తున్న సమయంలో దేశంలో ఇతర పార్టీలవైపు చూస్తున్నారంటేనే ఆమె ఒక అభద్రతా భావానికి లోనవుతున్నారనుకోవడానికి కూడా ఆస్కారం ఉన్నది. పశ్చిమబెంగాల్‌లో ఆమె ఒంటరిపోరు చేస్తుండగా ఒకటి రెండు ప్రాంతీయ పార్టీల నేతలు ఆమెకు మొక్కుబడిగా సంఘీభావం ప్రకటించడం మినహా బిజెపిని ఎదుర్కోగల ఒక సమైక్య శక్తిగా వ్యవహరించలేకపోతున్నారు. మమతా బెనర్జీ లేఖ అందుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా పలు రాష్ట్రాల్లో బిజెపి ఉధృతిని తట్టుకోలేకపోతున్నది, రెండు తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బిజెపిని ఎదుర్కోవడానికి నానా అగచాట్లు పడుతున్నాయి. మమతా బెనర్జీ లేఖలో రాసినట్లు జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయం ఏర్పరిస్తే తప్ప బిజెపిని ఎదుర్కోవడం అంత సులభం కాదు.


బిజెపిని ఎదుర్కొనేందుకు వివిధ పార్టీలు కార్యాచరణ రూపొందించే విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందా అన్నది చర్చనీయాంశం. గతంలో ప్రత్యామ్నాయం రూపొందించడం ఒక చారిత్రక అవసరంగా ప్రజలు భావిస్తున్న తరుణంలో వివిధ కూటములు ముందుకు వచ్చాయి. ప్రజా వ్యతిరేకతను అందిపుచ్చుకున్నాయి. జనతాపార్టీ, నేషనల్ ఫ్రంట్, యుపిఏ, ఎన్డీఏ లు సమయానికి అనుగుణంగా వ్యవహరించినందువల్లనే ప్రత్యామ్నాయంగా అవతరించగలిగాయి. 2019 ఎన్నికలకు ముందు బిజెపిని ఓడించాలన్న లక్ష్యం కంటే కొందరు నేతలకు తమ నాయకత్వంపైనే అధిక దృష్టి ఉండేది. బిజెపి తిరిగి అధికారంలోకి రాదని వారు భ్రమించి ఆ పార్టీని తక్కువ అంచనా వేశారు. బిజెపి తిరిగి అధికారంలోకి రావడంతో రాహుల్ గాంధీ వంటి నేతలు అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చింది. కాని ఇవాళ దేశంలో పరిస్థితులు పూర్తిగా దిగజారినప్పటికీ, ప్రజల్లో అశాంతి రేగినప్పటికీ, కేంద్రం పట్ల అసంతృప్తి తీవ్రంగా పొడసూపుతున్నప్పటికీ బిజెపియేతర పార్టీల్లో అంతగా చలనం కనపడడం లేదు. తమ ప్రభుత్వాలను తాము కాపాడుకుంటే చాలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. సరైన సమయంలో సరైన కార్యాచరణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా, లేక ఆయా పార్టీలు తమ అంతర్గత కారణాల వల్ల, బలహీనతల వల్ల కేంద్రాన్ని ఎదిరించలేకపోతున్నాయా, తమ విశ్వసనీయత కోల్పోతున్నాయా అన్న అంశాల గురించి చర్చించడం అవసరం.


మమతా బెనర్జీ ప్రకారం బిజెపి దేశంలో ప్రతిపక్ష పార్టీలనన్నిటినీ ఆత్మరక్షణలో పడేసింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను బలహీనపరచడమో, కూలగొట్టడమో జరిగింది. కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి నాయకులు ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేసింది. బిజెపీయేతర పార్టీలు తమ రాజ్యాంగ హక్కుల్ని, స్వేచ్ఛల్ని అనుభవించడం అసాధ్యంగా మారింది. దేశమంతటా ఒకే పార్టీ నియంతృత్వ పాలన క్రిందకు తీసుకురావడమే మోదీ ఉద్దేశం అని మమత అభిప్రాయపడ్డారు.


కర్ణాటక, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయిన తీరు, ఆయా రాష్ట్రాల్లో నేతలపై కేంద్రసంస్థలు నిర్వహిస్తున్న దాడులు, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పెంచడం, వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపరచడం వంటి పరిణామాలు మమతా బెనర్జీ ఆరోపణలను ధ్రువపరుస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లో బిజెపిని ఆమె అడ్డుకుని విజయం సాధిస్తే ఆమె ఊహించిన విధంగానే దేశంలో బిజెపియేతర పార్టీలకు ఒక అత్మవిశ్వాసం కలుగుతుంది. ప్రాంతీయ స్థాయిలో ఒక పార్టీని తాము అడ్డుకోగలిగినప్పుడు జాతీయ స్థాయిలో తాము కలిసికట్టుగా పోరి అడ్డుకోగలగమన్న ధైర్యం కలుగుతుంది. ఒకవేళ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో బిజెపిని అడ్డుకోలేకపోయినా దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం ఏర్పడే అవకాశాలు మృగ్యమైపోతాయని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు.


పశ్చిమబెంగాల్‌లో ఫలితాలు ఎలా ఉన్నా, బిజెపి ఇప్పటికీ దేశవ్యాప్త పార్టీ కాదు. 545స్థానాలున్న లోక్ సభలో బిజెపికి 303 సీట్లున్నంత మాత్రాన రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించే హక్కు ఆ పార్టీకి లేదు. ఎందుకంటే ఇవాళ దేశంలోని పలు రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి బలహీనంగా ఉన్నది, దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల సంఖ్యాబలం 4036 కాగా వీరిలో బిజెపి ఎమ్మెల్యేలు కేవలం 1374 మంది మాత్రమే. దేశంలో 55 శాతం ఎంపీలు బిజెపికి ఉండొచ్చు కాని ఎమ్మెల్యేలు 30 శాతం మాత్రమే. ఈ ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా,  బిహార్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలకే అధికంగా పరిమితం. బిహార్, నాగాలాండ్, మిజోరం లలో సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి భాగస్వామికాగా, మిగతా వన్నీ గోవా, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర వంటి చిన్నా చితక రాష్ట్రాలే. అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడులలో బిజెపి కేవలం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నది. బిజెపి అత్యధిక శాతం అంటే దాదాపు 50 శాతం, అంతకుమించి ఓట్లు సాధించిన రాష్ట్రాలు అయిదే- అవి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్. ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 41.35 శాతం ఓట్లు సాధిస్తే 2019లో లోక్‌సభ ఎన్నికల్లో నాటికి అది దాదాపు 50 శాతానికి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 41.02 శాతం ఓట్లు రాగా అది 2019 లోక్‌సభ ఎన్నికల్లో 58 శాతానికి పెరిగింది. కర్ణాటకలో కూడా 36 శాతం నుంచి51 శాతానికి, గుజరాత్‌లో 49 శాతం నుంచి 62 శాతానికి, రాజస్థాన్‌లో 29 శాతం నుంచి 58 శాతానికి బిజెపి తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బిజెపి ఓటు శాతం అటు అసెంబ్లీలోనూ, ఇటు లోక్‌సభలోనూ 20 శాతం లోపే ఉన్నది. ఉదాహరణకు కేరళలో బిజెపికి దాదాపు 13 శాతం ఓట్లు వస్తే తమిళనాడులో 3.66 శాతం మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఓటు శాతం కేవలం 0.96 శాతం మాత్రమే.


దేశంలోని ఎమ్మెల్యేల సంఖ్యలో మూడోవంతు కూడా బిజెపికి లేరు. లోక్‌సభలో బిజెపి వచ్చిన సీట్లలో 90 శాతం సీట్లు కేవలం పది రాష్ట్రాల్లోనే వచ్చాయి. అత్యధిక రాష్ట్రాల్లో బిజెపికి 20 శాతం లోపే ఓట్లు లభించాయి, కొన్ని రాష్ట్రాల్లో 1 నుంచి 5 శాతం లోపే ఓట్లు ఉన్నాయి. అటువంటప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు బిజెపిసర్కార్‌కి ఎక్కడి నుంచి వచ్చింది? ఉదాహరణకు ఏపీలో కేవలం ఒక శాతం లోపే ఓట్లున్న బిజెపికి ఆంధ్రుల పోరాటంతో ఆవిర్భవించిన విశాఖ ఉక్కు కర్మాగారం లాంటి సంస్థను అమ్మే నైతిక హక్కు ఉన్నదా?సమాఖ్య స్ఫూర్తితో కాక కేవలం దుందుడుకు ఆధిపత్య భావజాలంతోనే మోదీ సర్కార్ తనకు దేశమంతా ఆమోదయోగ్యత లేకపోయినా దేశ ప్రజలకు సంబంధించి సర్వహక్కులను తనకు ధారాదత్తం చేసుకున్నది. నిజానికి దేశ ప్రజలంతా నూటికి నూరు శాతం మోదీకి ఓట్లు వేసినా తీసుకోకూడని దౌర్జన్య పూరిత నిర్ణయాలను ఆయన సర్కార్ తీసుకున్నదనడంలో సందేహం లేదు. మమతా బెనర్జీ అనుకున్నట్లుగా దేశంలో వివిధ పార్టీలు జాతీయస్థాయిలో ఏకమైనా మోదీని ఎదుర్కోవడం అంత సులభం కాకపోవచ్చు. మోదీకన్నా, మోదీ భావజాలానికి ప్రత్యామ్నాయ భావజాలం రూపొందించినప్పుడే ప్రజల విశ్వసనీయత చూరగొనడం సాధ్యమవుతుంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-04-07T05:44:08+05:30 IST