అదనపు భత్యం ఇచ్చేనా?

ABN , First Publish Date - 2022-02-27T06:15:05+05:30 IST

ఉపాధిహామీ కూలీలకు వేసవిలో అదనపు భత్యం ఉంటుందా, ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అదనపు భత్యం ఇచ్చేనా?


- ‘ఉపాధి’ కూలీలకు ఇప్పటి వరకు ప్రకటించని ప్రభుత్వం

- భత్యం ఇవ్వకుంటే పనులు తగ్గే అవకాశం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉపాధిహామీ కూలీలకు వేసవిలో అదనపు భత్యం ఉంటుందా, ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఏటా వేసవి కాలంలో అదనంగా ప్రకటించే భత్యం వివరాలను ప్రభుత్వం జనవరిలోనే ప్రకటిస్తుంది. ఫిబ్రవరి ముగింపు దశకు వస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటన చేయక పోవడం గమనార్హం. అధికారులేమో ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచాలని ఒత్తిళ్లు తీసుకు వస్తున్నారు. కానీ అదనపు భత్యం లేకపోవడంతో ఆ పనులపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 1,19,068 కూలీలకు జాబ్‌ కార్డులను జారీ చేశారు. ఇందులో 2,56,873 మంది కూలీలు ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 23లక్షల 92వేల 851 పనిదినాలను కల్పించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం 59 లక్షల పనిదినాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరొక నెలరోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మార్చిలో ఉపాధి పనులకు రోజుకు 6 నుంచి 10 వేల మంది వచ్చినా 2 నుంచి 3 లక్షల పని దినాలను పూర్తి చేయగలుగుతారు. దీనికి తోడు వేసవిలో ప్రభుత్వం అదనంగా ఇచ్చే భత్యాన్ని ఇవ్వకపోవడంతో పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గవచ్చని తెలుస్తున్నది. ప్రతి ఏటా రాష్ట్రంలో వేసవిలో ఉపాధి పని దినాలను పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అదనపు భత్యాన్ని అందజేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక రోజుకు గరిష్టంగా 247 రూపాయల కూలి ఇస్తున్నది. పని చేసిన కూలీలు ఆ రోజు పొందే కూలిలో ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనపు భత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వరకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ను మిగతా అన్ని జిల్లాల్లో ఉపయోగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసి ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అదే సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినప్పుడు మాత్రం వేసవిలో అదనంగా ఇచ్చే భత్యం సొమ్మును ఆటోమేటిక్‌గా అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అదనపు భత్యం గురించి ఉత్తర్వులు వెలువరించలేదని తెలుస్తున్నది. 

- మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులతో..

గత ఏడాది ఫిబ్రవరి చివరలో అదనపు భత్యం గురించి ప్రకటన చేసినప్పటికీ, ఫిబ్రవరిలో ఉపాధి కూలీ పనులు చేసిన కూలీలకు మాత్రం అదనపు భత్యాన్ని చెల్లించింది. వాస్తవానికి జిల్లాలో జూన్‌, జూలై, ఆగస్టు వరకు కూలీలు వ్యవసాయ కూలీలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ మూడు మాసాల్లో విత్తనాలు వేయడం, వరి నాట్లు వేయడం, కలుపుతీత పనులు విరివిగా ఉండడంతో కూలీలు ఉపాధి పనులకు ఎక్కువగా వెళ్లరు. సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు కూడా వరి కోతలు, పత్తి ఏరడం, మళ్లీ యాసంగి వరి నాట్లు వేయడం వంటి పనులు చేయడం వల్ల కూలీలకు చేతినిండా పనులు ఉంటున్నాయి. ఉపాధి కూలీ పనులకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే మాసాల్లో కూలీలు అత్యధికంగా వస్తుంటారు. ఈ సమయంలో పనికి వచ్చే వారి సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం  ఆరేళ్లుగా అదనపు భత్యాన్ని ఇస్తూ వస్తున్నది. కూలీలు నిర్ధేశిత లక్ష్యాల పనులు చేస్తారో, ఆ మేరకు 40 శాతం నిధులను మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులు చేసుకునేందుకు నిధులను కేటాయిస్తుంది. కూలీ పనులు తక్కువైతే మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులు తక్కువ అవుతాయి. మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులతో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు వంటి వాటిని నిర్మించారు. మెటీరియల్‌ కంపోనెంట్‌ నిధులు పెరిగేందుకైనా ఈ వేసవిలో కూడా ఎప్పటిలాగానే అదనపు భత్యం చెల్లించాలని ఉపాధిహామీ కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


Updated Date - 2022-02-27T06:15:05+05:30 IST