టీఎంసీలో మమత వర్సెస్ అభిషేక్?

ABN , First Publish Date - 2022-02-12T16:32:27+05:30 IST

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో లుకలుకలు బయటపడుతున్నట్లు

టీఎంసీలో మమత వర్సెస్ అభిషేక్?

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో లుకలుకలు బయటపడుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మధ్య విభేదాలు పొడసూపాయని చెప్తున్నారు. అభిషేక్ బెనర్జీ వర్గం ‘ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాల’నే నినాదాన్ని వినిపిస్తుండటంతో మమత బెనర్జీ శనివారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీరిద్దరి మధ్యలోకి ఓ ట్వీట్‌ కారణంగా ప్రశాంత్ కిశోర్ కూడా ప్రవేశించడం గమనార్హం. 


అధికారం కోసం మమత, అభిషేక్ మధ్య జగడం జరుగుతోందనే ఊహాగానాలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు రెండు, మూడు పదవులను చేపడుతుండటాన్ని అభిషేక్ వర్గం వ్యతిరేకిస్తోంది. ఓ మంత్రి కూడా మంత్రి పదవితోపాటు, మేయర్ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. దీనిని అభిషేక్ వర్గం తప్పుబడుతోంది. 


అభిషేక్ వర్గీయులు శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో తాము ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానానికి అనుకూలమని పేర్కొన్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేల విషయంలో ఈ నిబంధనను మమత బెనర్జీ సడలించారు. ఆ ఎమ్మెల్యేల్లో కొందరు కోల్‌కతా నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేశారు. ఫిర్హాద్ హకీమ్ మంత్రి పదవిని, కోల్‌కతా మేయర్ పదవిని నిర్వహిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానానికి అనుకూలంగా ట్వీట్లు చేసిన అభిషేక్ వర్గీయుల్లో ఆయన కజిన్స్ ఆకాశ్ బెనర్జీ, అగ్నిష బెనర్జీ, అదితి గాయేన్ కూడా ఉన్నారు. ఈ విధానానికి అనుకూలంగా మంత్రి చంద్రిమ భట్టాచార్య శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ట్వీట్ చేశారు. అదే రోజు మధ్యాహ్నం 4.05 గంటలకు దానిని తొలగించారు. తనకు తెలియకుండా తన తరపున I-PAC ఈ ట్వీట్ చేసిందని వివరణ ఇచ్చారు. దీంతో మమత వర్సెస్ అభిషేక్ వివాదంలోకి I-PAC వచ్చింది. 


ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని I-PAC వివరణ ఇచ్చింది. తాను టీఎంసీకి లేదా ఆ పార్టీ నేతలకు సంబంధించిన డిజిటల్ ప్రాపర్టీస్‌ను నిర్వహించడం లేదని తెలిపింది. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు టీఎంసీ, ప్రశాంత్ కిశోర్ మధ్య సత్సంబంధాలు లేవని కొందరు చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. 


ఇదిలావుండగా, రాష్ట్రంలోని 112 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో రెండు జాబితాలు బయటకు వచ్చాయి. ఒకదానిపై టీఎంసీ నేత పార్థ ఛటర్జీ, సుబ్రత బక్షి సంతకాలు చేశారు. మరొకదాన్ని టీఎంసీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. సంతకాలు చేసినదే సరైన జాబితా అని మమత స్పష్టం చేశారు. 


శనివారం సాయంత్రం అత్యవసర సమావేశానికి హాజరుకావాలని మమత బెనర్జీ నుంచి ఆదేశాలు అందినవారిలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ, ఆ పార్టీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ సుబ్రత బక్షి, మంత్రులు ఫిర్హాద్ హకీం, ఆరూప్ బిశ్వాస్, చంద్రిమ భట్టాచార్య ఉన్నారు. 


Updated Date - 2022-02-12T16:32:27+05:30 IST