మూసీ నీరు ఆరుతడికేనా?

ABN , First Publish Date - 2021-12-18T06:28:48+05:30 IST

ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు నుంచి సాగునీటిని యాసంగి ఆరుతడి పంటలకు ఇస్తారా?

మూసీ నీరు ఆరుతడికేనా?
నిండుకుండలా ఉన్న మూసీ జలాశయం

 నేడు నీటి విడుదల

అధికారికంగా ఖరారుకాని నీటి షెడ్యూల్‌

కేతేపల్లి, డిసెంబరు 17: ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు నుంచి సాగునీటిని యాసంగి ఆరుతడి పంటలకు ఇస్తారా? లేక వరి సాగుకు అనుమతిస్తారా? అనేది అధికారులు పూర్తిస్థాయిలో స్పష్టం చేయడంలేదు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేయాలని ప్రభుత్వ స్పష్టం చేయగా, రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గుచూపుతున్నారు. ఆరుతడి పంటలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ఆయకట్టు లో రెండు దశాబ్దాలకు పైగా వరి సాగే ప్రధానంగా ఉంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలోనూ ఆయకట్టు రైతులు వరినే సాగు చేస్తూవస్తున్నారు. మెట్ట రైతులు సైతం భూములను అచ్చుకట్టి వరి సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో వరి సాగు చేస్తే ధాన్యం కొనేది లేదని ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సందిగ్ధం లో పడింది. మరోవైపు మూసీ ఆయకట్టులోని 30వేల ఎకరాల్లో మొదటి జోన్‌లోని 2వేల ఎకరాల్లోనే వరి సాగుకు అనుమతిస్తారని, మిగిలిన 28వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేయాల్సిందేనని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని ఏడు మండలాల్లో కుడి, ఎడమ కాల్వల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ఇప్పటికే కొంత మంది రైతులు దొడ్డురకం వరి నార్లు పెంచుతుండగా, మరికొందరు పూజ, చింట్లు, హెచ్‌ఎంటీల వంటి సన్నరకాల నార్లు పెంచుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల నాట్లుకూడా పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా, యాసంగి సీజన్‌ నీటి ప్రణాళికను ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు సమర్పించి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

నేడు ఆయకట్టుకు నీటి విడుదల

మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ఈ నెల 18 నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిరేక ల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటిని విడుదల చేయనున్నారని ఆయన పేర్కొన్నా రు. ప్రభుత్వం వరి సాగు వద్దంటున్న నేపథ్యంలో ఆయకట్టులోని 30వేల ఎకరాల్లో మొ దటి జోన్‌కు చెందిన కేవలం 1687ఎకరాల్లో వరి, మిగిలిన 28313 ఎకరాల్లో ఆరుతడి పం టలకు నీటి వినియోగానికి అనుమతించనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఏ పంటలకు ఎన్ని రోజులు నీటిని విడుదల చేస్తారనే షెడ్యూల్‌ను మాత్రం ప్రకటించ లేదు. ఈ విషయమై ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌ను సంప్రదిస్తే శాఖాపరంగా షెడ్యూలు ఖరారుకాలేదని తెలిపారు. కాగా, 645 అడుగులు (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఉన్న మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 644.70అడుగులు (4.38టీఎంసీలు) వద్ద నిలకడగా ఉంది. 151 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు 11వ నెంబర్‌ క్రస్ట్‌గేటును అర అడుగు మేర ఎత్తి 1089 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. 

Updated Date - 2021-12-18T06:28:48+05:30 IST