వంతెన గతి అంతేనా?

ABN , First Publish Date - 2022-08-16T06:14:08+05:30 IST

కోటవురట్ల మండలంలో వరహానదిపై సుమారు 125 ఏళ్ల క్రితం జల్లూరు వంతెన నిర్మించారు.

వంతెన గతి అంతేనా?
శిథిలావస్థకు చేరిన జల్లూరు వంతెన


శిథిలావస్థకు చేరిన జల్లూరు బ్రిడ్జి

ఓ పిల్లర్‌ పక్కకు ఒరిగిపోయి ప్రమాదకర స్థితికి..

ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వాహనచోదకుల్లో భయాందోళన

కొత్త వంతెన పూర్తికాకపోవడంతో తప్పని ఇబ్బందులు


నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే కోటవురట్ల మండలం జల్లూరు వంతెన శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సుమారు 125 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా మరమ్మతులకు నోచుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొత్త వంతెన నిర్మాణ పనులు చేపట్టగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ముందుకు సాగడం లేదు. 

 

కోటవురట్ల, ఆగస్టు 15: కోటవురట్ల మండలంలో వరహానదిపై సుమారు 125 ఏళ్ల క్రితం జల్లూరు వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంతో జల్లూరు నుంచి నర్సీపట్నం, రేవుపోలవరం వెళ్లడానికి మార్గం సుగమమైంది. జల్లూరు నుంచి ఈ వంతెన మీదుగా తొమ్మిది కిలోమీటర్లు  ప్రయాణిస్తే నర్సీపట్నం చేరుకోవచ్చు. ఈ వంతెన లేకపోతే సుమారు 22 కిలో మీటర్లు ప్రయాణించి నర్సీపట్నం వెళ్లాల్సి వస్తుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ వంతెన పైనుంచి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సుమారు 500 మంది విద్యార్థులు, ఉద్యోగులు నిత్యం దీనిపై నుంచే వెళుతుంటారు. కాగా నీలం తుఫాన్‌ సమయంలో వరహానది ఉధృతికి వంతెనకు సంబంధించిన ఒక పిల్లర్‌ పక్కకు ఒరిగింది. అంతే కాకుండా వంతెన శ్లాబ్‌ బీటలు వారి కుంగిపోయి శిథిలావస్థకు చేరింది. వంతెన బలహీన పడిన కారణంగా ఆర్‌ అండ్‌ బీ అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే భారీ వాహనాల డ్రైవర్లు పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు కూడా చూడనట్టే వ్యవహరిస్తున్నారు. 


2014లో కొత్త వంతెన పనులకు శ్రీకారం


వంతెన శిథిలావస్థకు చేరడంతో 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో దీని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి రూ.4.5 కోట్లు మంజూరు చేసింది. వంతెన శ్లాబ్‌ వరకు నిర్మా ణ పనులు సాగాయి. ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన రూ.2.2 కోట్ల బిల్లును ఇటీవలే ప్రభుత్వం మంజూరు చేసింది. బిల్లులు రావడం ఆలస్యం కావడంతో వంతెన అప్రోచ్‌ రోడ్డు పనులు చేసేందుకు ఆ కాంట్రాక్టర్‌ ఆసక్తి చూపలేదు. దీంతో పాత టెండర్‌ రద్దు చేసి కొత్త టెండర్‌ పిలవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి రాలేదని తెలిసింది.


భారీ వాహనాల రాకపోకలతో ముప్పు


పాత వంతెనపై రోలుగుంట మండలం ఒడ్డుమెట్ట నుంచి రోజూ రాత్రి, పగలు రేవుపోలవరం సముద్రతీరంలో కారిడార్‌ కంపెనీ నిర్మాణానికి 40 టన్నుల బరువు ఉండే నల్లరాయిని భారీ ట్రక్కులతో రవాణా చేస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న ఈ వంతెనపై అధిక బరువుతో ట్రక్కులు తిరుగుతుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు స్పందించి పాత వంతెనకు మరమ్మతులు చేయించాలని, కొత్త వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.


Updated Date - 2022-08-16T06:14:08+05:30 IST