గత సర్కారుకు కొమ్ము కాశారని రాజద్రోహం కేసులా?

ABN , First Publish Date - 2021-08-27T08:00:38+05:30 IST

ప్రభుత్వాలు మారినపుడు గత ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులపై రాజద్రోహం వంటి కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

గత సర్కారుకు కొమ్ము కాశారని రాజద్రోహం కేసులా?

  • పోలీసులే ఈ పరిస్థితిని మార్చాలి
  • చట్టానికి బద్ధులై వ్యవహరించాలి
  • ఛత్తీస్‌గఢ్‌ ఐపీఎస్‌ కేసులో సుప్రీం వ్యాఖ్య
  • అరెస్టు చేయకుండా నాలుగు వారాల రక్షణ

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారినపుడు గత ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులపై రాజద్రోహం వంటి కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితిని పోలీసు అధికారులే మార్చాలని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చట్టానికి బద్ధులై వ్యవహరించాలని సూచించింది. ఛత్తీస్‌గఢ్‌లో సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌సింగ్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది. దేశంలో ప్రబలుతున్న ఆందోళనకర ధోరణి పట్ల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌సింగ్‌ బీజేపీ ప్రభుత్వ హయాం లో రాయ్‌పూర్‌, దుర్గ్‌, బిలా్‌సపూర్‌ జిల్లాల ఐజీగా పని చేశారు. సస్పెన్షన్‌ సమయానికి పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా అదనపు డీజీ హోదాలో పని చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్జీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు, ఆర్థిక నేరాల కేసులను నమోదు చేసింది. వాటికితోడు తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ప్రజల్లో శత్రుభావనను కల్పిస్తున్నారని ఆరోపిస్తూ రాజద్రోహం కేసును పెట్టింది. 


రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలకు సంబంధించి ఆయన ఇంట్లో ఉన్న పత్రాలను ఆధారంగా చూపింది. తనపై రాజద్రోహం కేసును కొట్టివేసేందుకు హైకోర్టు తిరస్కరించడంతో గుర్జీందర్‌ పాల్‌ సింగ్‌ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. గతంలో బీజేపీ ప్రభుత్వం తరఫున తాను పని చేసినందుకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ తనను వెంటాడుతోందని, తనపై ఎఫ్‌ఐఆర్‌ లు రద్దు చేయాలని ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు గుర్జీందర్‌ను అరెస్టు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని గుర్జీందర్‌కు చెప్పింది. ‘‘దేశంలో తీవ్రంగా కలవరపరచే ధోరణి నెలకొంది. ఇందులో పోలీసు శాఖ బాధ్యత కూడా ఉంది. ఒక పార్టీ అధికారానికి వచ్చినపుడు కొందరు పోలీసు అధికారులు ఆ పార్టీకి కొమ్ము కాస్తారు. కొత్త పార్టీ అధికారానికి రాగానే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటుంది. ఈ పరిస్థితి మారాలి. పోలీసు అధికారులు చట్టానికి బద్ధులై పని చేయాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గుల్జీందర్‌ కూడా గత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించి ఉంటాడని అభిప్రాయపడింది. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులపై రాష్ట్ర పోలీసులు కేసుల మీద కేసులు పెట్టి వెంటాడుతున్న నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Updated Date - 2021-08-27T08:00:38+05:30 IST