శివారుకు అందేనా?

ABN , First Publish Date - 2022-07-31T05:45:19+05:30 IST

మండలంలోని వెంగళరాయసాగర్‌ జలాశయం నుంచి ఆదివారం సాగునీరు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 24,700 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ సారి కూడా శివారు ఆయకట్టుకు సాగునీరు అందుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

శివారుకు అందేనా?
వీఆర్‌ఎస్‌ జలాశయం

నేడు వెంగళరాయసాగర్‌ నుంచి సాగునీరు విడుదల

మూడేళ్లుగా కానరాని నిర్వహణ 

 కాలువల్లో  పేరుకుపోయిన పిచ్చిమొక్కలు 

ఆందోళనలో ఆయకట్టు రైతులు

 మక్కువ, జూలై 30: మండలంలోని వెంగళరాయసాగర్‌ జలాశయం నుంచి ఆదివారం సాగునీరు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల్లో 24,700 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ సారి కూడా శివారు ఆయకట్టుకు సాగునీరు అందుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం జలాశయం కుడి, ఎడమ ప్రధాన కాలువలు అధ్వానంగా మారాయి. గత మూడేళ్లుగా వాటిల్లో పూడికలు, పిచ్చిమొక్కలు తొలగించలేదు. దీంతో ఖరీఫ్‌ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఏటా కొంతమేర నీరు అందిస్తున్నా  మండలంలోని తూరుమామిడి, ఎస్‌ఆర్‌ పురం, బంగారువలస, కొయ్యానపేట, వెంకటభైరిపురం, కొండరాజేరు, కంచేడువలస గ్రామాలకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. శివారు ప్రాంత ఆయకట్టు గ్రామాలైన కోన, గోపాలపురం, శాంతీశ్వరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  వీఆర్‌ఎస్‌ జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసే క్రమంలో కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించి సాగునీరు సక్రమంగా అందేలా ఇంజనీరింగ్‌ అధికారులు చర్యలు చేపట్టాలి. అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో కొన్నిచోట్ల రైతులు ఏటా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పిచ్చిమొక్కలను తొలగించడం పరిపాటిగా మారింది.  ఇదిలా ఉండగా ప్రాజెక్టు ఆధునికీకరణకు జైకా నిధులు రూ.63 కోట్ల 50 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ ఏడాది కుడి, ఎడమ ప్రధాన కాలువల లైనింగ్‌ పనులు 20 శాతం మాత్రమే అయ్యాయి. వర్షాకాలం నేపథ్యంలో పనులు నిలిపివేశారు. నవంబర్‌లో పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పలుచోట్ల బలహీనంగా ఉన్న కాలువలు, గట్లు వరద ఉధృతికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 

 పనులు చేపడతాం 

 జలాశయం పరిధిలో సుమారు రూ. ఆరవై మూడున్నర కోట్లతో ఆధునికీకరణ పనులు చేపట్టాం. కుడి, ఎడమ ప్రధాన కాలువలు, గేట్లు మరమ్మతు పనులు 20 శాతం మేర పూర్తయ్యాయి. నవంబర్‌ నెలలో మిగతా పనులు  ప్రారంభిస్తాం. ప్రధాన కాలువల్లో  పూడికలు తీస్తున్నాం. జంగిల్‌ క్లియరెన్స్‌ చేపడతాం. చివరి ఆయకుట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.   

 -ఎం.రాజశేఖర్‌, ఏఈ, వెంగళరాయసాగర్‌ 

  

Updated Date - 2022-07-31T05:45:19+05:30 IST