జూన్‌ 1న నీరు విడుదల

ABN , First Publish Date - 2022-05-19T06:43:47+05:30 IST

ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతుల పంటను కాపాడడం కోసం, ముందస్తు ఖరీఫ్‌కు జూన్‌ 1వ తేదీనే డెల్టా కాలువలకు నీరు విడుదల చేయమని సీఎం జగన్‌ నిర్ణయించారని, అందుకు అధికారులు, రైతులు సిద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

జూన్‌ 1న నీరు విడుదల

మంత్రి చెల్లుబోయిన వేణు
   రాజమహేంద్రవరం,మే 18(ఆంధ్రజ్యోతి) ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతుల పంటను కాపాడడం కోసం, ముందస్తు ఖరీఫ్‌కు   జూన్‌ 1వ తేదీనే డెల్టా కాలువలకు నీరు విడుదల చేయమని సీఎం జగన్‌ నిర్ణయించారని, అందుకు అధికారులు, రైతులు సిద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశపు హాల్‌లో బుధవారం జిల్లా నీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు వేణు, తానేటి వనిత హాజరయ్యారు.  మొదట ఇరిగేషన్‌ ఎస్‌ఈ రాంబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్లలో డెల్టా సిస్టమ్‌లో 75,678 ఎకరాలు ఆయకట్టు ఉందన్నారు. ఇంకా మధ్యతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలైన ఎర్రకాలువ, కొవ్వాడ కాలువ, చాగల్నాడు, తొర్రేడు పరిధిలోని పూర్తి ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉందన్నారు. ఏపీ ఎస్‌ఐడీసీ పరిధిలోని ప్రాజెక్టులు, పోలవరం ఎడమకాలువ పరిధిలోని పుష్కర, వెంకటనగరం, ముసురుమిల్లి, సూరంపాలెం రిజర్వాయర్ల ఆయకట్టుకు, పోలవరం కుడి కాలువ పరిధిలోని తాడిపూడి ఎత్తిపోతల పరిధిలోని ఆయకట్టుకూ నీరివ్వడం కోసం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మొత్తం 3 లక్షల 23 వేల ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. పాత ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ధవళేశ్వరం సర్కిల్‌ పరిధిలోని డెల్టా సిస్టమ్‌లో 8,96,533  ఎకరాల నికర ఆయకట్టు ఉందన్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి మాధవరావు మాట్లాడుతూ జిల్లాలో డెల్టా, బోర్లు, వర్షాధార ఆయకట్టు కూడా ఉందని, ఈ సీజన్‌లో  1021 సన్నాలు రకాలే సిఫార్సు చేశామన్నారు. మూడో పంట వేయాలనే లక్ష్యంతో ముందస్తు ఖరీఫ్‌కు వెళుతున్నామన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ముందస్తు మంచిదే కానీ, కాలువలలో సీల్ట్‌, తూడు తొలగించకుండా నీరు వదిలితే ఉపయోగం ఏమిటన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని, జూలై 15 నాటికి  నాట్లు మొదలవుతాయన్నారు. ఈసారి నారు వేయడం కన్నా, విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వెళితే ఎలా ఉంటుందో చూడాలన్నారు. డెల్టాలో వెదజల్లే పద్ధతి పనిచేయదని చిక్కాల తెలిపారు. ‘గత ఏడాది బొండాలు వేయవద్దన్నారు. ఇవాళ ధర పెరిగింది. మీ మాట విని సన్నాలు వేసినవాళ్లు నాశనమైపోయారు’ అని చిక్కాల చెప్పారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలోని పాబోలు కాలువ పరిధిలో పూడిక తీయాలని ఎప్పుడో ప్రతిపాదనలు పంపానని, రూ.12 లక్షలకు అప్రూవల్‌ లేక ఆగిపోయిందని, ఇవాళ అక్కడి రైతులు క్రాప్‌హాలిడేకు సిద్ధమవుతున్నారన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ కొవ్వాడ కాలువ వల్ల ఎప్పుడూ పంట మునిగిపోతోందని, ఏదో నాలుగైదు కోట్లు నష్టపరిహారం ప్రతీ ఏటా ఇస్తూ సరిపెట్టేస్తున్నారని, ఈసారి  ఇక్కడ పూడిక తీసి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ ఎర్రకాలువ వల్ల నిడదవోలు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలలో పంట దెబ్బతింటోందని, దీనికి సంబంధించి పనులు చేయాలన్నారు.  ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో నీటి సంఘాలు ఉండడం వల్ల   సమస్యలు వారే పరిష్కరించేవారని, ఇప్పుడు ప్రతీ సమస్యకు రైతులు ఎమ్మెల్యేల వద్దకు వస్తున్నారని అన్నారు. పుష్కర, చాగల్నాడు ఎప్పుడో నిర్మించినా, ఇప్పటికీ పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నారని, అవి లోకలైజేషన్‌ కాలేదన్నారు. సూరంపాలెం పరిధిలోని తన నియోజకవర్గం ఆయకట్టు  2800 ఎకరాలు ఉందని, సూరంపాలెం కోసం రైతులు భూములు త్యాగం చేసినా, ఇప్పటి వరకూ కణుపూరు, నర్సాపురం గ్రామాలకు ఒక చుక్క నీరివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  వెంకటనగరం పంపింగ్‌ స్కీమ్‌ అంతేనన్నారు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ  చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని అలానే వదిలేశారని, భీమోలు వద్ద దానికి భూసేకరణ సమస్య ఉందన్నారు. వీటిపై జాయింట్‌ మీటింగ్‌ పెట్టి, ఎత్తిపోతల పథకాలను ఒక కొలిక్కి తెద్దామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. ఎంపీ మార్గాని భరత్‌, ఎమెల్సీలు  ఇళ్ల వెంకటేశ్వరరావు,  షేక్‌ సాబ్జి, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జేసీ శ్రీధర్‌, కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఆర్డీవో  చైత్రవర్షిణి, జడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాల్‌, కవురు శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు,  జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్‌టీజీ గోవిందం, జిల్లా హౌసింగ్‌ అధికారి తారాచంద్‌, పౌరసరఫరాల శాఖ అధికారి టి.తులసి, సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్మెస్‌ శోభారాణి, ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, డీఈవో అబ్రహాం, ఉద్యానవనశాఖాధికారి రాధాకృష్ణ, డీఎంఅండ్‌హెచ్‌వో స్వర్ణలత, డీసీహెచ్‌ఎస్‌ సనత్‌కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:43:47+05:30 IST