Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంత నిర్లక్ష్యమా.. జారి పడిన స్టీల్‌రాడ్‌.. Car ధ్వంసం.. అదే టూ వీలర్‌పై పడుంటే.. వామ్మో..!

హైదరాబాద్ సిటీ/మాదాపూర్‌ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా చేపట్టిన వంతెనల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. పలుచోట్ల కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తుండడం.. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోంది. తాజాగా కొండాపూర్‌లో నిర్మిస్తున్న వంతెన వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. జెమ్‌ మోటార్స్‌ సమీపంలో వంతెన పైన కార్మికులు పని చేస్తుండగా, స్టీల్‌ రాడ్‌ జారి ఆ మార్గంలో వెళ్తున్న ఓ కారుపై పడింది. దీంతో కారు ధ్వంసమైంది. వాహనంలో ఉన్నవారికి తృటిలో ప్రమాదం తప్పింది. కారు యజమాని సత్య ప్రవీణ్‌ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనదారులు ఆందోళన చెందారు. ద్విచక్ర వాహనదారులపై పడి ఉండే పెద్ద ప్రమాదం జరిగేదని పౌరులు మండిపడుతున్నారు.

పర్యవేక్షణ మరిచి.. 

నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డులో పని చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని దాదాపు 16 ప్రాంతాల్లో ప్రస్తుతం ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా వంతెనలు, అండర్‌పా‌స్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనుల పర్యవేక్షణను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించిన జీహెచ్‌ఎంసీ, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు తనిఖీలు, బిల్లులపై సంతకాలకే ఇంజనీరింగ్‌ ప్రాజెక్టుల విభాగం అధికారులు పరిమితమవుతున్నారు.

Advertisement
Advertisement