ధరాఘాతం

ABN , First Publish Date - 2021-01-19T05:36:08+05:30 IST

ఇది ఒక్క సుబ్బారావు పరిస్థితే కాదు.. సామాన్యుల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకూ ఎదుర్కొంటున్న సమస్య. ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా ప్రతి ఒక్కరికీ పెరిగిన ధరలు తలాభారంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా ఇనుము, సిమెంటు ధరలకు రెక్కలొచ్చాయి.

ధరాఘాతం

చుక్కల్లో ఇనుము, సిమెంటు ధరలు

రెండు నెలల్లో టన్ను స్టీలుపై రూ.20 వేలు పెరుగుదల

రికార్డు స్థాయిలో సిమెంటు ధర - బస్తా రూ.415

చదరపు అడుగుకు రూ.300 నుంచి రూ.400 పెరుగుదల

ఇల్లు కట్టేదెలా?


కడప నగరం కో-ఆపరేటివ్‌ కాలనీకి చెందిన సుబ్బారావు (పేరు మార్చాం) ఇటీవలనే ఉద్యోగ పదవీ విరమణ చేశారు. ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో కాలం గడిపారు. కనీసం రిటైర్‌ అయిన తరువాత సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. ఓ బిల్డర్‌ను కలిశాడు. డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌ ఎంత పడుతుందో తెలుసుకున్నాడు. సంక్రాంతి తరువాత కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల బిల్డర్‌కు ఫోను చేసి ఫ్లాట్‌కు డబ్బులు ఇస్తానని చెప్పాడు. మీకు గతంలో చెప్పిన ధరకు ఫ్లాట్‌ రాదు.. అన్నాడు. అదేంటి నెలకిందటనే కదా.. మీతో మాట్లాడింది అన్నాడు. ఇప్పుడు ఇనుము ధరలు పెరిగాయి. రెండు నెలల వ్యవధిలో టన్నుపై రూ.20 వేలు పెరిగింది. సిమెంటు ధర కూడా అదే పరిస్థితి ఉంది. చదరపు అడుగుపై రూ.300 నుంచి రూ.400 నిర్మాణ వ్యయం పెరిగింది. అప్పటి ధరకు ఇవ్వలేనని చెప్పేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అదనంగా డబ్బులు చెల్లిస్తానని బిల్డర్‌తో మాట్లాడుకున్నాడు. 


(కడప - ఆంధ్రజ్యోతి): 

ఇది ఒక్క సుబ్బారావు పరిస్థితే కాదు.. సామాన్యుల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకూ ఎదుర్కొంటున్న సమస్య. ఇల్లు కొనుక్కోవాలన్నా, కట్టుకోవాలన్నా ప్రతి ఒక్కరికీ పెరిగిన ధరలు తలాభారంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా ఇనుము, సిమెంటు ధరలకు రెక్కలొచ్చాయి. ఇసుక కూడా సక్రమంగా దొరక్కపోవడంతో దానిని కూడా బ్లాక్‌లో కొనాల్సిన దుస్థితి నెలకొంది. కూలీ రేట్లు కూడా పెరిగాయి. వెరశి ఫ్లాట్‌, వ్యక్తిగత ఇల్లు కట్టుకునే వారికి చదరపు అడుగుపై రూ.300 నుంచి రూ.400 వరకు భారం పడుతున్నట్లు చెబుతున్నారు. ఇసుక కొరతతో కొద్దిరోజులు, కరోనాతో మరికొద్దిరోజులు నిర్మాణరంగం కుదేలైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో స్టీల్‌, సిమెంటు ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. కడప నగరంలో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణం పెద్ద సంఖ్యలో సాగుతోంది. ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, బద్వేలు, పులివెందుల, పోరుమామిళ్ల, మైదుకూరుతో పాటు మరికొన్ని పట్టణాల్లో కూడా నిర్మాణరంగం సాగుతోంది.


చుక్కల్లో స్టీలు ధరలు

గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేని విధంగా స్టీలు ధరలు పెరిగినట్లు వ్యాపారులు, బిల్డర్లు చెబుతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే  టన్నుపై రూ.20 వేలకు పెరిగింది. నెలన్నర క్రితం వైజాగ్‌ స్టీలు 12, 20, 25 ఎంఎం వైజాగ్‌ స్టీలు రూ.68 వేలకు చేరింది. 10 ఎంఎం రూ.69,200, 8 ఎంఎం రూ.70,500 చేరింది. మరో ప్రముఖ కంపెనీ 8 ఎంఎం రూ.78 వేలు, 10 ఎంఎం రూ.76,200, 12, 16, 25 ఎంఎం రూ.75 వేలకు చేరింది. నెలన్నర క్రితం వైజాగ్‌ స్టీలు రూ.48 వేలకు దొరికేది. ఇప్పుడున్న ధరలు చూస్తే టన్ను ధర రూ.లక్షకు చేరుతుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరులో 25 టన్నులు రూ.13.5 లక్షలు పలికేది. ఇప్పుడు రూ.18.30 లక్షలకు చేరింది.


సిమెంటుదీ అదే దారి

గత ఏడాది మార్చిలో సిమెంటు బస్తా రూ.240కి దొరికేది. ఇప్పుడు రూ.415కు చేరింది. సిమెంటు ధరలో హెచ్చుతగ్గులు ఉంటే ఎమ్మార్పీ కూడా తగ్గుతుండేది. అయితే రికార్డు స్థాయిలో ధర తగ్గలేదని చెబుతున్నారు. వివిధ బ్రాండ్ల సిమెంటు బస్తా ధర రూ.410 నుంచి రూ.415 మధ్య ఉంది. ఇంతవరకు ఎప్పుడూ ఈ ధరలు చూడలేదని వ్యాపారస్తులు, బిల్డర్స్‌ చెబుతున్నారు. సిమెంటు ధరలపై ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇసుక ధరకు కూడా రెక్కలొచ్చాయి. దీంతో ఇల్లు కట్టుకునేందుకు రెండు నెలల క్రితం వేసుకున్న బడ్జెట్‌ ప్లానకు పెరిగిన ధరలు శరాఘాతంగా మారాయి. 



Updated Date - 2021-01-19T05:36:08+05:30 IST