IPL వేలంలో 15 మంది హైదరాబాదీలు పోటీ.. మరోసారి హ్యాండిచ్చిన Sunrisers Hyderabad

ABN , First Publish Date - 2022-02-14T15:16:52+05:30 IST

లోకల్‌ టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి ఒక్క తెలుగు క్రికెటర్‌ను కూడా కొనుగోలు చేయకుండా వేలంను ముగించగా..

IPL వేలంలో  15 మంది హైదరాబాదీలు పోటీ.. మరోసారి హ్యాండిచ్చిన Sunrisers Hyderabad

  • ముగ్గురికే అవకాశం
  • మనోళ్లు మెరిసారు..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి) : ఐపీఎల్‌ 2022 క్రికెటర్ల వేలంలో ముగ్గురు హైదరాబాద్‌ క్రికెటర్లు తళుక్కుమని మెరిశారు. లోకల్‌ టీమ్‌  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి ఒక్క తెలుగు క్రికెటర్‌ను కూడా కొనుగోలు చేయకుండా వేలంను ముగించగా, ఇతర ఫ్రాంచైజీలు మాత్రం ముగ్గురు హైదరాబాదీలకు తమ బృందంలో స్థానమిచ్చాయి. ఆల్‌రౌండర్‌ ఎన్‌.తిలక్‌ వర్మను రూ.1.70 కోట్లకు, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ బుద్ధిని రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్‌ దక్కించుకోగా, మీడియం పేసర్‌ చామ మిలింద్‌ను రూ.25 లక్షలకు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు కొనుగోలు చేసింది. వేలంలో మొత్తం 15 మంది హైదరాబాదీలు పాల్గొనగా ఫ్రాంచైజీలు ఈ ముగ్గురి వైపే మొగ్గు చూపాయి.


వాహ్‌ తిలక్‌..

వర్థమాన క్రికెటర్లలో హైదరాబాద్‌ నుంచి త్వరలో టీమిండియా తలుపుతట్టే మెరుగైన అవకాశాలున్న ఆల్‌రౌండర్‌ తిలక్‌ వర్మ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. శేరిలింగంపల్లికి చెందిన తిలక్‌ కోసం తొలుత రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ బిడ్‌ చేశాయి. అయితే, అనూహ్యంగా ముంబై పోటీలోకి రావడంతో రూ.20 లక్షల కనీస ధర వద్ద ప్రారంభమైన వేలం రూ.కోటి దాటింది. ఆఖరికి రాజస్థాన్‌-చెన్నై వెనక్కి తగ్గడంతో ముంబై ఈ హైదరాబాదీని దక్కించుకొంది. 19 ఏళ్ల తిలక్‌ ఇప్పటివరకు 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడగా మూడు సెంచరీలు, అర్ధ సెంచరీలతో కలిపి 784 పరుగులు సాధించడం విశేషం.


ఆర్‌సీబీ కోటలో మిలింద్‌..

మూడేళ్లగా హైదరాబాద్‌ సీనియర్‌ క్రికెట్‌ టీమ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గచ్చిబౌలికి చెందిన చామ మిలింద్‌ కిందటి ఏడాది జరిగిన ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, విజయ్‌ హజారే టోర్నీల్లో అంచనాలకు మించి రాణించాడు. రెండు నెలల కిందట హజారేలో మిలింద్‌ జార్ఖండ్‌పై ఆరు వికెట్లు (6/63) తీసి అదరగొట్టగా, నవంబరులో జరిగిన ముస్తాక్‌ అలీలో టీ20 ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌పై ఎనిమిదే పరుగులిచ్చి ఐదు వికెట్ల నేలకూల్చి సంచలనం సృష్టించాడు. దీంతో ఈసారి వేలంలో మిలింద్‌ను హైదరాబాద్‌ నుంచి  హాట్‌ ఫేవరెట్‌గా పరిగణించారు. అయితే, ఫ్రాంచైజీల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో ఆర్‌సీబీ తక్కువ ధరకే ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను సొంతం చేసుకొంది.


భళా రాహుల్‌..

మౌలాలిలో నివాసం ఉండే రాహుల్‌ బుద్ధి ఎడమచేతి వాటం బ్యాటర్‌. మూడేళ్లగా హైదరాబాద్‌ డొమిస్టిక్‌ లీగ్స్‌లో ఎవర్‌గ్రీన్‌ క్లబ్‌కు నాయకత్వం వహిస్తున్న రాహుల్‌ ఆ జట్టును రెండుసార్లు విజేతగా, ఒకసారి రన్నర్‌పగా నిలిపాడు. 2019-20లో రంజీ ట్రోఫీలో, 2020 జనవరిలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో, కిందటి ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ ద్వారా మూడు ఫార్మాట్లలోనూ రాహుల్‌ అరంగేట్రం చేశాడు.

Updated Date - 2022-02-14T15:16:52+05:30 IST