మరో 13 కళాశాలలు

ABN , First Publish Date - 2020-07-12T11:40:36+05:30 IST

జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో 13 జూనియర్‌ కళాశాలలను ప్రైవేట్‌ యాజమాన్యాలతో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు

మరో 13 కళాశాలలు

జిల్లాలో 13 జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు

ప్రైవేటు యాజమాన్యాలకు ఆహ్వానం


సాలూరు రూరల్‌, జూలై 11: జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో 13 జూనియర్‌ కళాశాలలను ప్రైవేట్‌ యాజమాన్యాలతో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఉన్నత పాఠశాలల్లో 500 మంది కంటే అధికంగా విద్యార్థులుంటే జూనియర్‌ కళాశాల మంజూరు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తొలి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్‌ కళాశాలలను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటోంది.


రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 323 జూనియర్‌ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళంలో 18, విశాఖలో 23, తూర్పుగోదావరి జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 25, కృష్ణాలో 21, గుంటూరులో 32, ప్రకాశంలో 33, నెల్లూరులో 14, చిత్తూరులో 23, కర్నూల్‌లో 24, అనంతపురంలో 37, కడప జిల్లాలో 32 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో సెక్షన్‌కు 40 మంది చొప్పున రెండు ఆర్ట్స్‌, ఏడు సైన్స్‌ సెక్షన్లతో 360 మంది విద్యార్థులకు మించి ప్రవేశాలు కల్పించడానికి వీల్లేదు.


ఈ నిబంధనలతో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు సీట్ల కొరత ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 22 జూనియర్‌ కళాశాలల్లో 7164 మంది విద్యార్థులు, 88 ప్రైవేట్‌ కళాశాలల్లో 16,062 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం ప్రవేశాలను నియంత్రించడంతో గ్రామీణ విద్యార్థుల కోసం మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో బాడంగి, భోగాపురం, డెంకాడ, గరివిడి, గరుగుబిల్లి, గుర్ల, జియ్యమ్మవలస, కొమరాడ, లక్కవరపుకోట, మెంటాడ, మెరకముడిదాం, రామభద్రపురం, తెర్లాం మండలాల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రైవేట్‌ వ్యక్తులు ముందుకొస్తే అనుమతులు మంజూరు చేయనున్నారు. కళాశాలలను ఏర్పాటు చేయదల్చిన వారు ఇంటర్మీడియట్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే నిబంధనలనుసరించి అనుమతులివ్వనున్నారు. 


ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావాలి

జిల్లాలో ప్రభుత్వం నోటిఫై చేసిన 13 మండలాల్లో జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావాలి. ఆయా మండలాల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు బోర్డుకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనలనుసరించి అనుమతులు జారీ అవుతాయి.

- మంజులవీణ, ఆర్‌ఐవో, ఇంటర్మీడియట్‌ బోర్డు, విజయనగరం

Updated Date - 2020-07-12T11:40:36+05:30 IST