రాష్ట్రానికి రూ.32,200 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-07-06T16:21:08+05:30 IST

మలేషియాకు చెందిన పెట్రోనాస్‌ హైడ్రోజన్‌, కాంటినెంట్‌ ఇండియా సంస్థలు రాష్ట్రంలో రూ.32,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు

రాష్ట్రానికి రూ.32,200 కోట్ల పెట్టుబడులు

బెంగళూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మలేషియాకు చెందిన పెట్రోనాస్‌ హైడ్రోజన్‌, కాంటినెంట్‌ ఇండియా సంస్థలు రాష్ట్రంలో రూ.32,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. నగరంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సమక్షంలో మంగళవారం ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ ఈవీ రమణారెడ్డి, పెట్రోనాస్‌ హైడ్రోజన్‌ సీఈ ఓ అదలాన్‌ అహ్మద్‌, కాంటినెంటల్‌ ఇండియా సీఈఓ ప్రశాంత్‌ దొరస్వామి తమ తమ కంపెనీల తరపున ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నిర్ణీత అవధిలో ఈ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. పెట్రోనాస్‌ హైడ్రోజన్‌ సంస్థ మంగళూరులో ఇంధన ఉత్పాదనా విభాగాన్ని రూ.31,200 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయనుంది. తద్వారా మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. కాగా కాంటినెంటల్‌ ఇండియా సంస్థ తన ఆర్‌ అండ్‌ డీ విభాగం కోసం ఎఫ్‌డీఐ ద్వారా రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ఆరు వేలమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆటోమోటివ్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న టెక్‌ కంపెనీ కాంటినెంటల్‌ పరిశోధనా సంస్థ టెక్నికల్‌ సెంటర్‌ ఇండియా (టీసీఐ) తన విస్తరణ కార్యకలాపాల కోసం రూ.వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. రాష్ట్ర పెట్టుబడుల రంగంలో ఇదో కీలక పరిణామమని సీఎం తెలిపారు. కార్యక్రమంలో ఐటీ, బీటీ శాఖల మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్‌ మంజునాథప్రసాద్‌, నైపుణ్యాభివృద్ధిశాఖ కార్యదర్శి సెల్వకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T16:21:08+05:30 IST