చెల్లని ‘కల్యాణలక్ష్మి’ చెక్కులు

ABN , First Publish Date - 2022-07-01T06:02:55+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అభాసుపాలైంది.

చెల్లని ‘కల్యాణలక్ష్మి’ చెక్కులు
మర్రిగూడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చెక్కులతో నిరసన తెలుపుతున్న లబ్ధిదారులు

 గడువు తీరేరోజు చెక్కుల పంపిణీ 

 లబోదిబోమంటున్న మునుగోడు నియోజకవర్గ లబ్ధిదారులు

నల్లగొండ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అభాసుపాలైంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యంతో సమయానికి ఇవ్వాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులు గడువుకు ఒకరోజు ముందు లబ్ధిదారుల చేతిలో పెట్టడంతో అవి చెల్లకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని పలువురు కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో విద్యుత్‌శాఖ మంత్రి గుం టకండ్ల జగదీ్‌షరెడ్డి జూన్‌ 29వ తేదీన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. చండూరు మండలంలో 82 మందికి, మునుగోడులో 76, మర్రిగూడ మండలంలో 76 మంది లబ్ధిదారులకు కలిపి మొత్తం 234 చెక్కులను అందజేశారు. అయితే తీరా వారు ఇంటికి వెళ్లి చూసుకున్నాక మార్చి నెల 31వ తేదీతో చెక్కులు ముద్రించి ఉన్నాయి. చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు సంతోషంగా గురువారం బ్యాంకులో జమ చేస్తే తప్ప డబ్బులు రాని పరిస్థితి ఉంది. అయితే చాలామంది లబ్ధిదారులకు ఆ విషయం తెలియకపోవడంతో చెక్కులు జమకాక డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది. చండూరు మండలంలో కొంతమందికి మే నెలకు సంబంధించిన చెక్కులు ఇవ్వడం వల్ల వారికి ఇబ్బంది తలెత్తకున్నా మర్రిగూడ మండలానికి చెందిన 76 మంది లబ్ధిదారులందరికీ చెల్లని చెక్కులు ఇచ్చిన పరిస్థితి ఉంది. దీంతో మర్రిగూడ మండలం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. 


అధికారుల నిర్లక్ష్యమే కారణం

చెక్కులపై తేదీ ప్రకారం మూడు నెలల వరకే చెల్లుతుంది. ఆ మూడు నెలల్లో చెక్కు వేయకపోతే డబ్బులు రాని పరిస్థితి ఉంటుందని తెలిసినా అధికారులు లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేసిన విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెక్కుల తేదీలను అనుసరించి ముఖ్య అతిథులను సకాలంలో ఆహ్వానించి లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. కానీ ఆ వైపుగా చర్యలు తీసుకోలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు షాదీ ముబారక్‌ చెక్కులు కూడా చెల్లకుండా పోయాయి. మునుగోడు మండలంలో మొత్తం 76మందికి చెక్కులను అందజేయగా 50చెక్కులు మార్చి నెల 30, 31వ తేదీ మీద మంజూరు చేసినట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంకుల్లో గురువారం వేసినా చెల్లుతాయని ఇతర బ్యాంకుల్లో చెక్కులు వేస్తే చెల్లవని బ్యాంకు నిర్వాహకులు చెప్పడంతో లబ్ధిదారులు వెనుతిరిగారు. మునుగోడు మండలంలో 35చెక్కులను లబ్ధిదారులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఇచ్చి వెళ్లిపోయారు. 


చెక్కు చెల్లకుండా పోయింది 

గత ఏడాది నవంబరు నెలలో కుమార్తె కీర్తనకు వివాహం చేశాను. నెల రోజుల్లోపు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేశాను. జూన్‌ 29వ తేదీన విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. సంతోషంగా గురువారం చెక్కును తీసుకుని బ్యాంకుకు వెళితే గడువు తీరిపోయిందని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులను సంప్రదించగా చెక్కు ఇచ్చి వెళితే వారం రోజుల్లో మరో చెక్కు ఇస్తామని హామీ ఇచ్చారు. 

చొప్పరి లక్ష్మి, సింగారం, మునుగోడు మండలం.


రెండు రోజుల్లో కొత్త చెక్కులు ఇస్తాం 

మునుగోడు నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు జూన్‌ 29వ తేదీన చెక్కులు పంపిణీ చేశాం. ఎస్‌బీఐ శాఖలో ఖాతాలు ఉన్న వారికి చెక్కులు జమ అయ్యాయి. ఇతర బ్యాంకుల్లో ఖాతా ఉన్న వారికి సమయం సరిపోలేదు. రీవాల్యుయేషన్‌ చేసి రెండు రోజుల్లో లబ్ధిదారులకు కొత్త చెక్కులను అందజేస్తాం. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు.

జగదీ్‌షరెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో, నల్లగొండ.

Updated Date - 2022-07-01T06:02:55+05:30 IST