ఇంతింతై...అధ్యక్షుడై!

ABN , First Publish Date - 2020-10-20T08:20:08+05:30 IST

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నియమిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు.

ఇంతింతై...అధ్యక్షుడై!

 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకం

 కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వైనం

(టెక్కలి)

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును నియమిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు.  మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన అచ్చెన్నాయుడు.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, శాసనసభాపక్ష ఉపనేతగా, టెక్కలి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. సోదరుడు, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా కార్యకర్త స్థాయి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగారు.


హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి మూడుసార్లు, టెక్కలి నియోజకవర్గానికి రెండుసార్లు మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా.. అసెంబ్లీలో తన వాణి  వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈఎస్‌ఐ కుంభకోణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అచ్చెన్నాయుడును 78 రోజుల పాటు ఏసీబీ రిమాండ్‌లో ఉంచినా, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసే వ్యక్తిగా అధినేత చంద్రబాబునాయుడు వద్ద అచ్చెన్న గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నకు అవకాశం కల్పించారు.


ఈ సందర్భంగా చంద్రబాబునాయుడుకి అచ్చెన్న కృతజ్ఞతలు తెలిపారు. ‘మీతో పాటు లోకేష్‌బాబు, యనమల రామకృష్ణుడు, ఇతర పెద్దల సూచనలు పాటిస్తూ.. ముందుకెళ్తా. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి. మళ్లీ మీరు సీఎం కావాలన్నదే లక్ష్యంగా పని చేస్తా. పార్టీలో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటా. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని మరింత బలోపేతం చేస్తా... బాధ్యతాయుతమైన స్థానం అప్పగించినందుకు తమకు రుణపడి ఉంటా’నని తెలిపారు. 


 టీడీపీ శ్రేణుల్లో హర్షం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న నియామకంపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అధినేత చంద్రబాబునాయుడు అచ్చెన్న పేరు ప్రకటించిన వెంటనే.. అంతా సంబరాల్లో మునిగితేలారు. వివిధ ప్రాంతాల్లో బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. నిమ్మాడలో భార్య విజయమాధవి, కుమారులు తనూజ్‌నాయుడు, కృష్ణమోహన్‌ నాయుడులు అచ్చెన్నకు మిఠాయిలు తినిపించారు.

అచ్చెన్న నియామకంతో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నాయకులు అచ్చెన్నను అభినందనలతో ముంచెత్తారు. టీడీపీ నేతలు చౌదరి బాబ్జి, బగాది శేషగిరి, బోయిన రమేష్‌, పినకాన అజయ్‌కుమార్‌, వెలమల కామేశ్వరరావు తదితరులు గజమాలతో సత్కరించారు. 


 

బయోడేటా :

 

పేరు : కింజరాపు అచ్చెన్నాయుడు

వయసు : 49 సంవత్సరాలు

చదువు : బీఎస్సీ

తల్లిదండ్రులు : కింజరాపు దాలయ్య(కీర్తిశేషులు), కళావతి

భార్య, పిల్లలు : విజయమాధవి, కృష్ణమోహన్‌ నాయుడు, తనూజ్‌ నాయుడు

స్వగ్రామం : నిమ్మాడ, కోటబొమ్మాళి మండలం

రాజకీయ నేపథ్యం : ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీఎల్పీ ఉపనేతగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, టెక్కలి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  

కుటుంబ నేపథ్యం : పెద్దన్నయ్య దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేశారు. ఐదు సార్లు ఎంపీగా, రైల్వేస్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, చీఫ్‌ విప్‌గా పని చేశారు. ఆయన కుమారుడు ప్రస్తుత ఎంపీ రామ్మోహన్‌నాయుడు రెండు పర్యాయాలు శ్రీకాకుళం పార్లమెంట్‌ సభ్యుడిగా ఎంపికయ్యారు. మరో సోదరుడు కింజరాపు హరిప్రసాద్‌ కోటబొమ్మాళి పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరో సోదరుడు కింజరాపు ప్రభాకర్‌ పోలీస్‌ ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు.


 


Updated Date - 2020-10-20T08:20:08+05:30 IST